క్రిష్ణగిరిలో టీడీపీకి ఝలక్!
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:02 AM
కేఈ రుద్రఫణి.. అనూహ్యంగా జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు.
టీడీపీ అభ్యర్థి కేఈ రుద్రఫణి నామినేషన్ తిరస్కరణ
జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తెరపైకి
నామినేషన్ తిరస్కరణతో రాజకీయ వర్గాల్లో చర్చ
కలెక్టర్‌కు అప్పీల్
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రుద్రఫణి
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కేఈ రుద్రఫణి.. అనూహ్యంగా జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఆయన తన తండ్రి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలసి క్రిష్ణగిరి జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శనివారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో రుద్రఫణి ఓటు కర్నూలు జిల్లా పరిషత్తు ఓటర్ల జాబితాలో లేదు.. కర్నూలు అర్బన్‌లో ఉందని వైసీపీ అభ్యర్థి మాధవరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సీఈవో ఆర్. సుధాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పరిశీలించిన ఆర్‌వో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే అంటే దాదాపు రెండు నెలల క్రితమే కర్నూలు అర్బన్ పరిధిలో ఓటర్ల జాబితాలో ఉన్న తన ఓటును తొలగించాలని కోరుతూ ఫారం-8 బీఎల్‌వోకు కేఈ రుద్రఫణి అందజేసినట్లు టీడీపీ లీగల్ సెల్ నాయకులు వాదిస్తున్నారు. అదే క్రమంలో తన స్వగ్రామం క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామంలో ఇంటి నంబరు.2-30లో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ ఫారం-7 కూడా బీఎల్‌వోలకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన విన్నపాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారులు కర్నూలు అర్బన్‌లో ఓటు తొలగించి.. క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామంలో ఓటరు ఐడీ నంబరు: జడ్‌జీఎఫ్3374634 కింద కేఈ రుద్రఫణికి ఓటు హక్కు కల్పించారు. ఓటరు ఐడీ కార్డు కూడా జారీ చేశారు. కొత్తగా చేర్చిన ఓటును జిల్లా పరిషత్తు ఓటర్ల జాబితాలో చేరుస్తూ.. అడిషినల్ జాబితా జత చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని టీడీపీ నాయకులు అంటున్నారు. ఆర్‌వో తీసుకున్న నిర్ణయంపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి అప్పీల్ చేశామని తెలిపారు. అదే క్రమంలో న్యాయస్థానానికి కూడా ఆశ్రయించామని, న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా 26 జడ్పీ స్థానాలకు అభ్యర్థుల నామినేషన్లు శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఆర్.సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఆస్పరి జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసిన బోయ రవి నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలకు 185 నామినేషన్లు రాగా, కేవలం రెండు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. కర్నూలు జిల్లాలో 432 ఎంపీటీసీ స్థానాలకు 2,180 నామినేషన్లు వచ్చాయి. మంత్రాలయం నియోజకవర్గంలో వివిధ కారణాలతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు నాలుగు, వైసీపీ అభ్యర్థులవి ఆరు, సీపీఎం అభ్యర్థి ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురయ్యాయి. నందవరం మండలంలో అభ్యర్థి నామినేషన్ పత్రంపై సంతకం చేయకపోడంతో ఆర్వో తిరస్కరించారు. ఆలూరు నియోజకవర్గంలో 29 నామినేషన్లు తిరస్కరించగా, వారిలో హోళగుందలో ఇద్దరు, ఆలూరు, దేవనకొండలో ఒకరు చొప్పున ఆర్వో నిర్ణయంపై పత్తికొండ ఆర్డీవోకు అప్పీల్ చేశారు. కర్నూలు రూరల్ మండలంలో 8 నామినేషన్లు ఆర్‌వో వివిధ కారణాలతో రిజక్ట్ చేశారు. పత్తికొండ నియోజకవర్గం పరిధిలో 20 నామినేషన్లు, ఓర్వకల్లు మండలంలో లొద్దిపల్లె, నన్నూరు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.