ఎల్లెల్సీకి ‘ఇసుక గోడ’..!
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:53 PM
ఎల్లెల్సీకి ‘ఇసుక గోడ’..!
దిగువకు నీరు వెళ్లనివ్వమని ఇసుక బస్తాలు వేసిన కన్నడ రైతులు
ఇండెంట్ ఆపేసిన అధికారులుఏపీ వాటా విడుదలనునిలిపేసిన టీబీ బోర్డు ఇంజనీర్లు
అడ్డుకోబోయిన ఇంజనీర్లతో కన్నడ రైతుల వాగ్వాదం
ఎల్లెల్సీలో ఇసుక బస్తాలు వేయడం నిబంధనలకు విరుద్ధం - టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్
తుంగభద్ర కాలువల నీటి పంపిణీ వ్యవహారం రెండు రాష్ట్రాల రైతుల మధ్య వివాదానికి దారితీసింది. ‘మా నీళ్లు మాకే.. దిగువకు వెళ్లనివ్వం..!’ అంటూ కన్నడ రైతులు టీబీపీ ఎల్లెల్సీలో ఇసుక బస్తాలతో అడ్డుగోడ కట్టేశారు. కర్ణాటక రైతుల వాదనలో నిజం ఉండవచ్చు. అయితే అది తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు నిబంధనలకు విరుద్ధమని అధికారులు అంటున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల తుంగభద్రకు ఈ ఏడాది 98 టీఎంసీలకు మించి చేరకపోవచ్చని టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా వేసింది. ఎల్లెల్సీకి ఏపీ వాటా 11.094 టీఎంసీలు కేటాయించారు. ఇప్పటికే తాగునీటి కోసం 1.432 టీఎంసీలు వాడుకోగా, 9.68 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. తాగునీటి ప్రయోజనాలు దృష్ట్యా సాగునీరు ఇవ్వలేమని జిల్లా యంత్రాంగం తేల్చిసింది. డ్యాం నుంచి నీటి విడుదల ఇండెంట్‌ను ఆపేసింది. దీంతో తమ నీరు ఆంధ్రకు పోనివ్వమంటూ ఎగువ రాష్ట్రం రైతులు అడ్డంగా ఇసుక బస్తాలు వేసి నీటిని నిలిపివేశారు.
కర్నూలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయంలో నీటి సంవత్సరంలో 212 టీఎంసీలు వరద చేరితే, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో సాగు, తాగునీరు అందించే తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ)కు తుంగభద్ర జలాశయంలో ఏపీ కోటాగా 24 టీఎంసీలు ఉంది. డ్యాంలో వరద చేరికను అంచనా వేసి కేడబ్ల్యూడీటీ-1 (బచావత్ అవార్డు) కేటాయింపుల దమాషా ప్రకారం పంపిణీ చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా డ్యాంకు ఆలస్యంగా వరద మొదలైనా.. పూర్తిగా వరద చేరలేదు. ఈ ఏడాది 98 టీఎంసీలకు మించి చేరకపోవచ్చని టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా వేసింది. ఆమేరకు దమాషా ప్రకారం టీబీపీ ఎల్లెల్సీ ఏపీ వాటా 11.094 టీఎంసీలు కేటాయించారు. అయితే.. జిల్లా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర తాగునీటి ఎద్దడి తలెత్తడంతో జూలై 16 నుంచి ఈ నెల 10వ తేది వరకు 1.432 టీఎంసీలు తీసుకొని గ్రామీణ రక్షిత మంచినీటి శాఖ పర్యవేక్షణలో ఎస్‌ఎస్ ట్యాంకులు నింపుకున్నారు. ఇందులో కొంత నీరు గాజులదిన్నె ప్రాజెక్టులో నిల్వ చేశారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రత దృష్ట్యా 2027 జూన్ ఆఖరు వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మిగులు నీటి వాటాను తుంగభద్ర డ్యాంలోనే నిల్వ చేసి తాగునీటి అవసరాలు ఉన్న సమయంలో ఎల్లెల్సీ కాలువ ద్వారా తీసుకోవాలన్నది జిల్లా అధికారుల ప్రణాళిక. అందులో భాగంగా తాత్కాలికంగా డ్యాం నుంచి ఎల్లెల్సీ విడుదల చేస్తున్న ఇండెంట్‌ను ఆపేయడంతో ఏపీ నీటి వాటా విడుదలను బోర్డు ఇంజనీర్లు నిలిపివేశారు. ఈ ఏడాది జిల్లాలో ఎల్లెల్సీ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే అవకాశాలు లేవని ఇప్పటికే జిల్లా యంత్రాంగం తేల్చేసింది.
టీబీపీ డ్యాం నుంచి కర్ణాటక వాటాగా ప్రకారం కర్ణాటక వాటాగా 64.25టీఎంసీలు కేటాయించారు. ఆ రాష్ట్రం సాగునీటి సలహా మండలి సమావేశంలో 90 సాగునీరు ఇస్తామని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా కర్ణాటక వాటాగా ఎల్లెల్సీ కాలువకు 650 క్యూసెక్కులు విడుదల చేశారు. కాలువ డిజైన్ ప్రకారం 1,800 క్యూసెక్కులు ప్రవాహం ఉంటే తప్ప డీపీలకు నీరు మళ్లించలేని పరిస్థితి ఉంటుంది. దీంతో ఏపీ వాటా కూడా విడుదల చేయాలని కర్ణాటక మంత్రి, మోకా ఎమ్మెల్యే నాగేంద్ర ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ నరసింహమూర్తితో కూడా చర్చించారు. అయితే.. తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా సాగునీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ఈఎన్‌సీ వివరించారు. ఏపీకి నీళ్లు రాకుండా మోకా సమీపంలో 138 కిలోమీటరు వద్ద షట్టర్లు దింపేశారు. అంతేకాదు..కన్నడ రైతాంగం 155 కిలో మీటరు వద్ద కాలువకు అడ్డంగా ఇసుక బస్తాలు వేసి చుక్కనీరు రాకుండా అడ్డుకున్నారు. వారి వాదనలో నిజం ఉన్నా.. కాలువకు ఇసుక బస్తాలు అడ్డుగా వేయడం టీబీపీ బోర్డు నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇది ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో జల జగడానికి కారణం అవుతుందని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే 155 నుంచి 250.788 కిలో మీటర్దు (బోర్డు సరిహద్దు) మధ్యలో ఉన్న కర్ణాటక గ్రామాల రైతులు కూడా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇసుక బస్తాలు వేయడాన్ని అడ్డుకోబోయిన టీబీపీ ఎల్లెల్సీ బళ్లారి డీఈఈ చెన్నకేశవ్‌నాయక్‌తో కర్ణాటక రైతులు వాగ్వాదానికి దిగారు. సున్నితమైన ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
బోర్డు నిబంధనలు ఒప్పుకోవు
ఎల్లెల్సీ కాలువకు ఏపీ నీటి వాటా ఇండెంట్ ఆపేయడంతో నీటి విడుదల నిలిపివేశాం. ప్రస్తుతం కర్ణాటక ఇండెంట్ మాత్రమే ఇస్తున్నాం. తూములు, డీపీలకు నీళ్లు ఎక్కడం లేదని కాలువకు ఇసుక బస్తాలు అడ్డంగా వేశామని కన్నడ రైతులు వాదిస్తున్నారు. ఇది బోర్డు నిబంధనలకు వ్యతిరేకం. ఆ రైతులతో మాట్లాడుతున్నాం.
- నారాయణనాయక్, ఎస్‌ఈ, టీబీపీ బోర్డు, హోస్పేట, కర్ణాటక