Share News

ఆస్తి వివాదాల పరిష్కారానికి నక్షా

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:32 PM

నగర, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులు, స్థలాలకు కచ్చితమైన రికార్డులు రూపొందించి, నవీకరించడం ద్వారా వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం నక్షా(నేషనల్‌ జియో స్పేషియల్‌ నాలెడ్జ్‌ బెస్ట్‌ సర్వే ఇన్‌ హ్యబిటేషన్స్‌ ఇన్‌ అర్బన్‌ ఏరియాస్‌) కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తోందని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు తెలిపారు.

ఆస్తి వివాదాల పరిష్కారానికి నక్షా
మాట్లాడుతున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

ఇక నగరాల్లో స్థలాలకు కచ్చితమైన రికార్డులు

కొలతలతో వివరాల క్రోడీకరణ

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలులో ప్రారంభమైన అర్బన్‌ రీసర్వే

కర్నూలు న్యూసిటీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): నగర, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులు, స్థలాలకు కచ్చితమైన రికార్డులు రూపొందించి, నవీకరించడం ద్వారా వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం నక్షా(నేషనల్‌ జియో స్పేషియల్‌ నాలెడ్జ్‌ బెస్ట్‌ సర్వే ఇన్‌ హ్యబిటేషన్స్‌ ఇన్‌ అర్బన్‌ ఏరియాస్‌) కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తోందని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో సచివాలయ అడ్మిన్‌, ప్లానింగ్‌, వీఆర్‌ఓ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నక్షా పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా 152 పట్టణ స్థానిక సంస్థలను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో 10 పట్టణాలు ఎంపిక అయ్యాయని అన్నారు. అందులో కర్నూలు నగర పాలక సంస్థకు అవకాశం లభించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, కర్నూలు నగర పాలక సంస్థ సంయుక్త అధ్వర్యంలో ఆధునాతన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో అర్బన్‌ రీ సర్వేకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. నగర పాలక సంస్థ పరిధి 114 చదరపు కిలోమీటర్లు ఉండగా, పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా తొలి విడతలో 48 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే చేపడుతున్నామ న్నారు. సెప్టెంబర్‌ 10వ తేదీలోపు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను మ్యాపింగ్‌ చూసి డిజిటలైజ్‌ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సర్వే పూర్తయిన అనంతరం ఆస్తు వివరాలను డిజిటల్‌ రూపంలో భద్రపరచి, అర్బన్‌ ప్రాపర్టీ డిజిటల్‌ కార్డుతో కూడిన ఆస్తి ఽధ్రువీకరణ పత్రాన్ని యజమానులకు అందజేస్తామన్నారు. దీంతో ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన వివాదాలు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న చట్టపరమైన కేసుల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. రహదారులు, మురుగు కాలువలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు మొదలైన అర్బన్‌ రీసర్వే దోహదపడుతుందని పేర్కొన్నారు. సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో ప్రజలు తమ ఆస్తుల పత్రాలు, ఖచ్చితమైన వివరాలను సిబ్బందికి అందించి సహకరించాలని కమిషనర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, ఏసీపీ నాగరాజు, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్‌బాషా, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే పి. నాగభూషణం, అర్బన్‌ సర్వేయర్‌ జయరాముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 11:32 PM