బుడగ జంగాలకు ఊరట..!
ABN , Publish Date - May 14 , 2026 | 11:14 PM
వాళ్లది ఎన్నో ఏళ్ల పోరాటం.. అలుపెరుగని ఆరాటం.. వాళ్లదేమంత పెద్ద డిమాండ్ ఏమీ కాదు.
ఉద్యోగాలు తప్ప ఎస్సీల్లాగా సంక్షేమ పథకాలన్నీ వర్తింపచేయాలని సీఎం నిర్ణయం
రెండు దశాబ్దాల పోరాటానికి తాత్కాలిక ఉపశమనం
ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడమే శాశ్వత పరిష్కారం
కేంద్రాన్ని ఒప్పించాలని బుడగ జంగాల సంఘం డిమాండ్
కర్నూలు, మే 14 (ఆంధ్రజ్యోతి): వాళ్లది ఎన్నో ఏళ్ల పోరాటం.. అలుపెరుగని ఆరాటం.. వాళ్లదేమంత పెద్ద డిమాండ్ ఏమీ కాదు. కళా రూపాలు ప్రదర్శిస్తూ, భిక్షాటన చేసుకొని జీవించే అంటరానితనం అనుభవించే సమూ హం కాబట్టి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వమని కోరుతున్నారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు కలవని నాయకులు లేరు.. తొక్కని గడపలేదు.. వారడుగుతున్నది న్యాయబద్ధమైనదనే మద్దతు సమాజం నుంచి నిండుగా ఉంది. కానీ పాలకులు కదలలేదు. అయినా రెండు దశాబ్ద్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. వాళ్లే బేడ బుడగ జంగం కులస్థులు. కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చి తమ పిల్లలు భిక్షాటన చేయకుండా చదువుకోడానికీ, ఉద్యోగాలు చేసుకోడానికీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఉద్యోగాలు మినహా ఎస్సీలకు ఇచ్చే అన్ని పథకాలు వీరికి అందజేయాలని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశాడు. ఉన్నంతలో ఇదొక చిన్న ఊరట. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడమే తమ కులస్థులకు శాశ్వత పరిష్కారమని బుడగ జంగం సంఘం నాయకులు అంటున్నారు.
రాయలసీమ జిల్లాల్లో ‘బేడ బుడగ జంగం’ కులస్థులు అధికంగా ఉన్నారు. ప్రధానంగా భిక్షాటన, బుర్రకథలు, వీధి నాటకాలు, యక్షగానాలు చెబుతూ వీరు పొట్టపోసుకుం టున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా కుటుంబాలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో 36 మండల్లాలో బేడ బుడగ జంగాలు నివస్తున్నారు. ఎస్సీ కులాల్లో బేడ బుడగ జంగం ఉపకులంగా ఉందని ఏపీ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ వివరించారు. 1976 నుంచి 2008 వరకు మండల రెవిన్యూ అధికారులు వీరికి ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ జారీ చేస్తూ వచ్చారు. ‘ది కాన్‌స్టిట్యూషన్ (షెడ్యూల్ క్యాస్ట్స్) అర్డర్స్ (సెకండ్ అమెండ్‌మెంట్) యాక్ట్-2002’ (61 యాక్ట్) తీసుకొచ్చి ఏపీలో బేడ బుడగ జంగం కులస్థులు లేరని, 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు.144 వారికి శాపంగా మారింది. ఆ జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో బుడగ జంగం కులం లేదని గెజిట్ నుంచి తొలగించారు. అప్పుడప్పుడే భిక్షాటన మానేసి బడి బాట పడుతున్న వీరికి ఈ జోవో గొడ్డలిపెట్టుగా మారింది. బడి వెళ్లాల్సిన పిల్లలు మళ్లీ భిక్షాటన వైపు అడుగులు వేయాల్సిన దైన్యపరిస్థితి ఏర్పడింది. జీవో నంబరు.144 రద్దు చేయాలని.. మమ్ములను గుర్తించండి.. గతంలో మాదిరిగా ఎస్సీ కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలంటూ దాదాపు రెండు దశాబ్దాలుగా రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారు.
అసెంబ్లీలో తీర్మానాలు చేసినా..: రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల సమయంలో పల్లెకొచ్చిన ప్రతి నాయకుడిని కలిశారు.. 2008 వరకు జారీ చేసినట్లుగానే ఎస్సీ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని విన్నవించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబును కలసి గోడు వెళ్లబోసుకున్నారు. ఏ జిల్లాలో ఎంత మంది బేడ బుడగ జంగం కులస్థులు ఉన్నారు..? వారి జీవన విధానం..! వంటి సమగ్ర వివరాలలో ఏపీ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం వినతి పత్రాలు ఇచ్చింది. స్పందించిన సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారి జేసీ శర్మ కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. బుడగ జంగం కాలనీలకు వెళ్లి.. వారితో నేరుగా మాట్లాడారు. రాష్ట్రంలో కర్నూలు, నంద్యాల జిల్లాలు సహా వివిధ జిల్లాల్లో బేడ బుడగ జంగం కులస్థులు ఉన్నారని, భిక్షాటన, కళా ప్రదర్శనలతో దుర్భరంగా జీవిస్తున్నారని, వీరిని ఎస్సీలలో ఉప కులంగా చేర్చి ఎస్సీ ధృవీకరణ సర్టిఫికెట్‌ను జారీ చేయాలని సిఫారసు చేస్తూ 2018 డిసెంబరు 31న నివేదిక ఇచ్చింది. సీఎం చంద్రబాబు ప్రభుత్వం మంత్రివర్గం, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం పలు కొర్రీలు పెట్టి ఆ ఫైలును వెనక్కి నెట్టేసింది. కేంద్రం అడిగిన ఫార్మెట్ ప్రకారం జేసీ శర్మ కమిషన్ మరోసారి విచారణ చేసి 2020 జూన్ 8న మరో నివేదిక ఇచ్చింది. మూడేళ్లు తరువాత 2023లో ఆనాటి వైసీపీ ప్రభుత్వం కూడా మంత్రివర్గం, అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపితే మళ్లీ పలు కొర్రీలు పెట్టి రెండోసారి వెనక్కి పంపింది. 2024లో సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అనుమానాలు నివృత్తి చేస్తూ, ఆ ఏడాది మార్చి 20న మూడోసారి మంత్రివర్గం, అసెంబ్లీలో తీర్మానం చేసి ఏప్రిల్ 11న కేంద్రానికి పంపించారు. ప్రస్తుతం ఈ ఫైల్ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోని ‘రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా’లో పెండింగ్‌లో ఉందని ఆ సంఘం నాయకులు పేర్కొంటున్నారు.
అధినేత, యువనేత స్పష్టమైన హామీ: 2024 ఎన్నికలకు ముందు ప్రజాగళం భాగంగా కర్నూలు, పత్తికొండలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం చంద్రబాబును, యువగళం పాదయాత్రలో కర్నూలు జిల్లాలో యువనేత, ప్రస్తుత విద్య, ఐటీ శాఖ నారా లోకేశ్‌లను ఏపీ బేడ బుడగ జంగం సంక్షే మ సంఘం నాయకులు కలి తమ సమస్య విన్నవించుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తక్షణమే కేంద్రాన్ని ఒప్పించి ఎస్సీ సర్టిఫికెట్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కూటమి ప్రభు త్వం వచ్చాక 2024 అక్టోబరు ఒకటిన పత్తికొండ మండలం పుచ్చకా యలమడ సభలోనూ, ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామ సభలోనూ మరోసారి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం హామీతో కాస్త ఊటర: ఈ నేపథ్యంలో మే 7, 8 తేదీల్లో అమరావతిలోని సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ చీఫ్ సెక్రెటరీ కె. సునిత రాష్ట్రంలో బేడ బుడగ జంగాలు, పంబాడ, పాముల సహా పలు సామాజికవర్గాలు గుర్తింపు లేకపోవడం ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలకు దూరం అవుతున్నారని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని అంగీకరిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు బేడ బుడగ జంగం కులస్థులకు ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే అన్ని రకాల సంక్షేమ, విద్య, అభివృద్ధి పథకాలు అందజేయాలని కలెక్టర్లకు ఆదేశించారు.
శాశ్వత ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు చేయాలి
సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల మా బేడ బుడగ జంగం కులస్థులకు కొంత ఊరట లభించింది. అయితే.. కేంద్రాన్ని ఒప్పించి మా కులాన్ని ఎస్సీ ఉప కులంగా చేర్చాలి. శాశ్వత ఎస్పీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి. అప్పుడే మాకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, హోంశాఖతో చర్చించి మా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.
- తూర్పాటి మనోహర్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం, కర్నూలు