ఐదోసారి అరుదైన గౌరవం
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:54 PM
కర్నూలు నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది.
ఉత్తమ పాఠశాలగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హైస్కూల్
రాష్ట్రస్థాయిలో బెస్ట్‌గా నిలిచిన కార్పొరేషన్ స్కూల్
కర్నూలు ఎడ్యుకేషన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. 2025-26 విద్యాసంవత్సరానికి 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే (మున్సిపల్ యజమాన్యం విభాగంలో) అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించింది. దీంతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పాఠశాలగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర వేడుకల్లో భాగంగా అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉత్తమ పాఠశాల అవార్డును ప్రధానోపాధ్యాయుడు ఎస్‌ఎం. హుస్సేన్ అందుకుంటారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పాఠశాలగా వరుసగా ఐదోసారి ఎంపికై తమ రికార్డును మరోసారి బద్దలు కొట్టింది. దీంతో ఈ పాఠశాలకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. కర్నూలు నగరంలో 2016 సంవత్సరంలో ఈ పాఠశాలను ఫౌండేషన్ పాఠశాలగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెలకొల్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫౌండేషన్ పాఠశాలను రద్దు చేశారు. అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాలాజీ చొరవతో ఫౌండేషన్ స్కూల్‌గా పేరు మార్చి డా.ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలగా మార్చి గుర్తింపు తీసుకువచ్చారు.
ఇదీ ట్రాక్ రికార్డ్
2022 సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 40 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 40 మంది పాసై వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థి డెబ్బోరా మిజ్మోర్ విద్యార్థిని 592/600 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రభాగంలో నిలిచారు. అలాగే 2023లో జరిగిన ఎస్‌ఎ్‌ససీ పబ్లిక్ పరీక్షలో 54 మందికి గానూ 54 మంది పాసై వంద శాతం సాధించారు. సుస్మిత్ అనే విద్యార్థిని 586/600 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. 2024 విద్యాసంవత్సరం పరీక్ష ఫలితాల్లో 48 మంది పాసయ్యారు. విద్యార్థి డి.ఇక్బాల్ 593/600 మార్కులు సాధించాడు. 2025 విద్యాసంవత్సరంలో 43 మంది పరీక్షకు హాజరు కాగా, అందరూ పాసై వంద శాతం సాధించారు. సాయి లిఖిత అనే విద్యార్థిని 597/600 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిచారు. 2025-26 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో 42 మంది పరీక్షలు రాసి అందరూ పాసై వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో పి.లిఖిత 593/600, గిరీషా 591, ఎం.మేఘన 587 మార్కులు సాధించారు. అలాగే 581, 580, 579, 578, 577, 576, 575, 574, 573, 531 మార్కులు సాధించారు. 500 మార్కులు పైగా 40 మంది విద్యార్థులు దక్కించుకోవడ విశేషం. 2026 పాలిసెట్ పరీక్ష పలితాలో ఈ పాఠశాలకు చెందిన విద్యార్థి కె.పవన్‌కళ్యాణ్ 117/120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 195వ ర్యాంకును, పి.లిఖిత 115 మార్కులతో 375వ ర్యాంకు సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకొచ్చారు. అలాగే ఏపీఆర్‌జేసీ ఫలితాల్లో బైపీసీ విభాగంలో అనంత జాగృతి రాష్ట్ర స్థాయిలో 230వ ర్యాంకును ఎంపీసీ విభాగంలో ఎం.సాయి రోహన 256, పి.లిఖిత 285, పవన్ కళ్యాణ్ 310 మార్కులతో పాఠశాల ఖ్యాతిని పెంచారు. 2025 డిసెంబరు 7న నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షలో ఈ పాఠశాల విద్యార్థులు 143, 142 మార్కులతో జిల్లా 2, 3 ర్యాంకులతో పాటు అత్యధికంగా 31 మంది అర్హత సాధించారు. 2026-27 విద్యాసంవత్సరానికి 9 మంది విద్యార్థులు ఈ పాఠశాలనుంచి ఇడుపులపాయ, నూజివీడు వంటి ట్రిపుల్ ఐటీలకు ఎంపికై ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. 2022 బ్యాచ్‌కు చెందిన రాగిమాన్ ఈశ్వర్ అనే విద్యార్థి జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకు సాధించి కర్నూలు ఐఐఐటీ డీఎంకు ఎంపికై బీటెక్‌లో సీఎ్‌సఈ బ్రాంచ్‌లో చదువుతున్నారు.
తల్లిదండ్రుల సహకారంతోనే గుర్తింపు
మా పాఠశాల అత్యుత్తమ ఫలితాలు రాబట్టడంలో విద్యార్థుల పట్టుదలతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ఉపాధ్యాయులందరూ సమష్టి కృషితో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించేలా విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో వరుసగా ఐదోసారి ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కూడా రాష్ట్ర స్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాం.
- ఎస్‌ఎం హుస్సేన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు