Share News

కుదిపేసిన గాలివాన

ABN , Publish Date - May 25 , 2026 | 12:30 AM

కర్నూలు జిల్లాలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కర్నూలు నగరంలో పాటుగా ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది.

కుదిపేసిన గాలివాన
కలెక్టరేట్‌ వద్ద కారుపై పడిన చెట్టు

ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

అంధకారంలో కాలనీలు

విద్యుత్‌శాఖకు రూ.1.26 కోట్లు నష్టం

కల్లూరు, మే 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కర్నూలు నగరంలో పాటుగా ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. వర్షానికి భారీ ఈదురుగాలులు తోడుకావడంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఎక్కడ చూసినా హోర్డింగులు, ఫ్లెక్సీలు, చెట్లు, చెట్లకొమ్మలు, విరిగి పడటంతో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌లైన్లు, విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లాలోని 5 మండలాలు, 29 గ్రామాల్లో గాలివాన ధాటికి విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిని విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం 10 గంటల తర్వాత చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. విద్యుత్‌శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన విద్యుత్‌లైన్ల మరమ్మతు పనులు చేపట్టారు. విద్యుత్‌ లేకపోవడంతో ప్రజలు కనీస అవసరాలకు అల్లాడిపోయారు. కొన్ని ప్రాంతాల్లో 24 గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

విద్యుత్‌శాఖకు రూ.1.25 కోట్ల నష్టం

జిల్లాలో శనివారం గాలివాన బీభత్సానికి విద్యుత్‌శాఖకు రూ.1.25 కోట్ల నష్టం కలిగింది. 33 కేవీ స్తంభాలు ఐదు, 11 కేవీ స్తంభాలు 239, 225 ఎల్‌టీ స్తంభాలు నేలకొరిగాయి. అదేవిధంగా 15 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్‌, 48 కిలోమీటర్ల మేర ఎల్‌టీ లైన్‌, 17 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. నగరంలో ఎక్కువగా చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్‌ తీగలు తెగిపడటంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దాదాపు 150-200 ప్రాంతాల్లో విద్యుత్‌తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడటం వల్ల ఇబ్బందులు తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో ఎక్కువ నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. మరో వైపు కర్నూలు ఎస్‌ ఈ పి.ప్రదీ్‌పకుమార్‌ ఆదేశాలతో విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది శనివారం అర్ధరాత్రి నుంచే మరమ్మతు పనులు చేపట్టారు. రేయింబవళ్లు లైన్లలో పనిచేస్తూ విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.

జిల్లాలో శనివారం గాలివాన బీభత్సానికి విద్యుత్‌శాఖకు రూ.78.52 లక్షలు నష్టం కలిగింది. జిల్లా వ్యాప్తంగా 33 కేవీ స్తంభాలు ఐదు, 11 కేవీ స్తంభాలు 229, 11కేవీ పీడర్స్‌ 59, ఎల్‌టీ స్తంభాలు 239 నేలకొరిగాయి. అదేవిధంగా 15 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్‌, 13.5 కిలోమీటర్ల మేర ఎల్‌టీ లైన్‌, 17 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. నగరంలో ఎక్కువగా చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్‌ తీగలు తెగిపడటంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దాదాపు 150-200 ప్రాంతాల్లో విద్యుత్‌తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడటం వల్ల ఇబ్బందులు తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో ఎక్కువ నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. మరో వైపు కర్నూలు ఎస్‌ఈ పి.ప్రదీ్‌పకుమార్‌ ఆదేశాలతో విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది శనివారం అర్ధరాత్రి నుంచే మరమ్మతు పనులు చేపట్టారు. రేయింబవళ్లు లైన్లలో పనిచేస్తూ విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా కల్లూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని శ్రీనివాసనగర్‌లో 132 కేవీ విద్యుత్‌ లైన్‌ ఇళ్ల మధ్యలో ఉంది. ఆ లైన్‌ టవర్‌ టు టవర్‌ మధ్యలో విద్యుత్‌ తీగలు దెబ్బతిన్నాయి. గాలుల వేగానికి ఆ తీగలు తెగిపోయి ఉంటే భారీ ప్రమాదమే జరిగేది. ఉదయమే సగానికి పైగా తెగి పోయిన 132 కేవీ లైన్‌ తీగలను గుర్తించిన డీఈఈలు అదినారాయణ, జగదీశ్‌కుమార్‌, ఉశేనివలి, హాట్‌లైన్‌ సీఎఫ్‌ఎం సిబ్బంది సి.బసవయ్య, గంగరాజులు 12 గంటల పాటు శ్రమించి విద్యుత్‌ తీగలను పునరుద్ధరించారు.

ఉద్యోగనగర్‌లో అంధకారం

వర్షం కారణంగా శనివారం సాయంత్రం 5 గంటలకు కరెంట్‌ పోగా ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు అధికారులు కరెంట్‌ ఇవ్వలేక పోయారని ఉద్యోగనగర్‌ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఏఈ కార్యాలయం, లైన్‌మెన్‌లకు సమాచారం ఇచ్చినా సరిగా స్పందించలేదని ఆసహనం వ్యక్తం చేశారు. కాలనీ వాసులు తాగడానికి మంచినీరు లేక అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. సంబంధిత విద్యుత్‌ శాఖ కార్యాలయానికి వెళ్లి ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

పిడుగు పాటుకు గొర్రెల కాపరి మృతి

నందికొట్కూరు, మే 24(ఆంధ్రజ్యోతి): పగిడ్యాల మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ గొర్రెల కాపరి పిడుగుపాటుకు మృతిచెందాడు. నందికొట్కూరు పట్టణం వడ్డెపేట కాలనీకి చెందిన కందాల రాముడు(60) పగిడ్యాల మండలం సంగిరేణి పల్లె వద్ద గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. అక్కడ పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంటేశ్వర్లు నివాళుర్పించారు. మృతుడి కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాగా మృతి చెందిన రాముడికి ముగ్గురు కుమారులు సంతానం.

కదిలిన ‘మున్సిపల్‌’ టీం

ఉదయం నుంచే క్లియరెన్స్‌ పనులు

తొలగింపు పనులు చేపట్టిన కమిషనర్‌ చల్లా

కర్నూలు న్యూసిటీ, మే 24(ఆంధ్రజ్యోతి): శనివారం అర్ధరాత్రి గాలివాన బీభత్సానికి కర్నూలు నగరం అతలాకుతలమైంది. ఈ క్రమంలో మున్సిపల్‌ యంత్రాంగం చొరవపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. శిక్షణ నిమిత్తం హైదరాబాద్‌ పర్యటన ముగించుకుని వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు తెల్లవారుజాము 4 గంటల నుంచే నగరంలో పర్యటించారు. తెల్లవారుజాము నుంచే అధికారులు సైతం క్లియరెన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో అధికారులు, పారిశుధ్య కార్మికులు తెల్లవారుజాము నుంచి సాయంత్రం దాకా వీధుల్లో పర్యటించారు. శానిటరీ ఇన్స్‌పెక్టర్లు తమకు కేటాయించిన ప్రాంతాల్లోకి వెళ్లి ముమ్మర చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే చెట్ల తొలగింపును పూర్తి చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు... మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రఘుతో కలసి రోడ్డుకు అడ్డుగా పడిన చెట్లను తొలగించడం విశేషం. ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర అత్యవసర పరిస్థితుల సమయాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యల్లో ఎప్పుడు యువత సేవాభావంతో ముందుండాలని కమిషనర్‌ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండ అన్ని శాఖలతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్లు రాజు, మునిస్వామి, రవి, రమేష్‌, హుస్సేన్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 12:30 AM