పెళ్లింట పెను విషాదం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:09 AM
: కోసిగి మండలం కందుకూరు గ్రామానికి చెందిన దాసరి ఆదిశేషు, సంగీతకు ఈ నెల 25న వివాహం జరిగింది. ఈ వేడుకలకు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి తాలుకా కురిడి గ్రామం నుంచి బంధువులు ఈనెల 24న ఇక్కడి వచ్చారు. మూడు రోజుల పాటు ఎంతో సంతోషంగా గడిపారు.
నీటి మునిగి నలుగురు కర్ణాటక వాసుల మృతి
మృతులంతా దాయాది కుటుంబాల వారే
కోసిగి మండలం అగసనూరు సమీపంలోని
ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద ఘటన
కోసిగి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండలం కందుకూరు గ్రామానికి చెందిన దాసరి ఆదిశేషు, సంగీతకు ఈ నెల 25న వివాహం జరిగింది. ఈ వేడుకలకు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి తాలుకా కురిడి గ్రామం నుంచి బంధువులు ఈనెల 24న ఇక్కడి వచ్చారు. మూడు రోజుల పాటు ఎంతో సంతోషంగా గడిపారు. శుక్రవారం రాత్రి తమ సొంత గ్రామానికి వెళ్లాల్సి ఉండగా.. మధ్యాహ్నం అగసనూరు సమీపంలోని తుంగభద్ర నది ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు మహిళల, పిల్లలు, పెద్దలు కలిసి వెళ్లారు. నీటిలో దిగిన వారు సెల్ఫీ దిగుతూ వీడియోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఈ క్రమంలో దాసరి రత్నమ్మ లోతు గమనించకుండా ముందుకు వెళ్లడంతో ఒకరి వెంట ఒకరు నీట మునిగిపోయారు. ఇందులో నలుగురు మృతి చెందారు. దాసరి ఉమావతి (28), దాసరి రత్నమ్మ (26), దాసరి శివానంద (20), దాసరి మహంతేష్ (20) నీట మునిగి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మృతుల్లో ఉమావతికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రత్నమ్మకు కూడా భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి పిల్లలందరూ 8 సంవత్సరాలలోపు కావడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. దీనంగా ఉన్న చిన్నారులు ఉలుకూ పలుకు లేకుండా తమ తల్లులను లేపుతూ ఏడుస్తున్న తీరు చూసి స్థానికుల కంటతడిపెట్టుకున్నారు. కందుకూరు, అగసనూరు గ్రామాల చెందిన గజ ఈతగాళ్లు పుట్టీల సాయంతో గాలించి తుంగభద్ర నదిలో నీట మునిగిన నలుగురుని బయటకు తీశారు. అయితే అప్పటికే నలుగురు మృతి చెందారు. కోసిగి ఎస్‌ఐ డి.రమేష్ రెడ్డి పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ తర్వాత టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, కోసిగి సీఐ మంజునాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమ్మితం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దాయాదుల కుటుంబాలకు చెందిన నలుగురు మృతి చెందడంతో అటు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో కురిడి, కందుకూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి వేడుకల కోసం ఇలా మృతి చెంది తిరిగి వెల్లడంతో కుటుంబ సభ్యులు ఆయా గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత వారి సొంత గ్రామాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి తెలిపారు.
ప్రజాప్రతినిధుల దిగ్ర్భాంతి
కర్నూలు అర్బన్: కర్ణాటకు చెందిన నలుగురు తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి చనిపోవడం బాఽధాకరమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు వేర్వేరు ప్రకటనల్లో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.