పెను విషాదం
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:39 PM
క్షణ కాలం చాలు.. మానవ జీవితం రక్తమోడటానికి. అప్రమత్తత లోపిస్తే తీరని విషాదం మిగులుతుంది. ఆ వాహనం డ్రైవర్ క్షణకాలపు కునుకు 8 మందిని అనంత లోకాలకు చేర్చింది.
మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
8 మంది మృతి - 14 మందికి గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం
అందరూ కర్ణాటక వాసులు
ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం
క్షణ కాలం చాలు.. మానవ జీవితం రక్తమోడటానికి. అప్రమత్తత లోపిస్తే తీరని విషాదం మిగులుతుంది. ఆ వాహనం డ్రైవర్ క్షణకాలపు కునుకు 8 మందిని అనంత లోకాలకు చేర్చింది. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వస్తున్న కర్ణాటక భక్తుల జీవితాలు తెల్లారాయి. హైవే రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో మరణ మృదంగం మోగింది. మినీ ట్రక్ వాహనంలో ఉన్న 22 మందిలో 8 మంది భక్తుల మృతదేహాలు చెల్లాచెదురై ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల హాహాకారాలతో దద్దరిల్లింది. మృతుల్లో ఐదుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి ఉంది. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎటుచూసినా రోడ్డుపై రక్తపు ఆనవాళ్లు దర్శనమిచ్చాయి. పది నిమిషాల్లో మంత్రాలయం చేరుకుంటామని భావించిన ఆ కుటుంబాలను విషాదం ఆవరించింది. మృతులందరూ కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగళూరు జిల్లా వాసులు. ఒకే కుటుంబంలో ఆరుగురు మృత్యువాతపడటం అందరినీ కలచివేసింది. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున 3గంటలకు మంత్రాలయం మండలంలోని చిలకలడోణ గ్రామ సమీపంలో జరిగింది.
మంత్రాలయం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగళూరు జిల్లా బేలూరు తాలుకా బేలూరు, బూతనహల్లి, తలకేరి తాలుకా ఊడేవా, దావణగేరి జిల్లా చెన్నగిరి తాలుకా ఉబ్రాని గ్రామం, హసన్ జిల్లా కనయాకనహల్లి, శెట్టిగేరి గ్రామాలకు చెందిన 22 మంది భక్తులు కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం బుధవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో కేఏ 46 9745 నంబరు గల మినీ ట్రక్‌లో బయలుదేరారు. వారంతా మినీ ట్రక్ వాహనం యజమాని, డ్రైవర్ ఎస్‌కే సునీల్ కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు. వీరంతా రెక్కాడితే తప్ప పూటగడవని సామాన్య కుటుంబాలకు చెందిన వారు. గురువారం తెల్లవారుజామున ఎమ్మిగనూరు దాటుకొని జాతీయ రహదారి-167పై మంత్రాలయం వైపు సాగిపోతున్నారు. చిలకలడోన గ్రామం దాటి దాదాపు 200 మీటర్లు వెళ్లారో లేదు.. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. అప్పుడు సమయం సుమారుగా 3 గంటలు.. మినీ ట్రక్ వాహనం, ఎదురుగా వస్తున్న కేఏ 32ఏసీ 1117 నంబరు గల సిమెంట్ కాంక్రీట్ రెడీమిక్స్ ట్యాంకర్ ఢీకొన్నాయి. మినీ ట్రక్ వాహనం పల్టీలు కొట్టడంతో.. అందులో ప్రయాణిస్తున్న భక్తులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. చీకట్లలో ఆక్రందనలు మిన్నంటాయి. జాతీయ రహదారి-167 రక్తసిక్తమయ్యింది. కదలేనిస్థితిలో పడిఉన్న భక్తుల్లో మరణించిన వారెందరో.. తీవ్ర గాయాలతో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వా రెందరో..? తెలియని పరిస్థితి ఉంది. మంత్రాలయం సీఐ దస్తగిరి బాబు, మాధవరం, మంత్రాలయం ఎస్‌ఐలు విజయ్‌కుమార్, మల్లికార్జున క్షతగాత్రుల గురించి తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకలోని శెట్టిగేరి గ్రామం, మెన్నూ రు, బెలూరు తాలూకా, హాసన్ జిల్లాకు చెందిన సునీల్ (40)అనే వ్యక్తి మిని గూడ్స్ వాహనంలో తండ్రి కుమా ర్(60), చెల్లెలు దీపికవీణ(35), మేనకోడలు నిషిత(3), చిన్నమ్మ లోలాక్షి(50), అవ్వ జయమ్మ(60) ఒకే కుటుం బంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం శోకసంద్రంలో ముంచెత్తింది. మరో కుటుంబానికి చెందిన మనోజ్ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ అతని తల్లి మీనా క్షమ్మ(50), అవ్వ పుట్టమ్మ (60) మృతి చెందారు. అక్క శుభ పరిస్థితి విషమంగా ఉంది. మేనల్లుడు దీపక్, మేన కోడళ్లు ధన్యశ్రీ, దీక్షిత, బావమరిది ప్రతాప్ తీవ్రగా యా లతో చికి త్స పొందుతున్నారు. ఉగ్రాని గ్రామం, చెన్నగిరి తాలూకా ధావనగేరి జిల్లాకు చెందిన భారతమ్మ, సునీల్, అమృత, వర్షిత, నవీన్, తేజశ్విని, సిరిచాన, జయమ్మలు తీవ్రంగా గాయపడి కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. ఇందులో తేజశ్విని పరిస్థితి విషమంగా ఉంది.
రాఘవేంద్రస్వామిని దర్శనం కోసం....
వీరంతా మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకోడానికి గత మూడు రోజులుగా సన్నాహాలు చేసుకొని బుధవారం సాయంత్రం 4గంటలకు బయల్దేరారు. డ్రైవర్‌తో పాటు మరో 21మంది వాహనంలో ఉన్నారు. డ్రైవర్ క్యాబిన్‌లో డ్రైవర్ ఎస్‌ఎస్ సునీల్, మనోజ్, సునీల్, శుభ ముందు భాగంలో కూర్చున్నారు. వెనక ట్రాలీలో చెక్క పలక ఏర్పాటు చేసుకుని లగేజీని పెట్టుకున్నారు. కింద 18మంది కూర్చున్నారు. అనంతపురం దాటిన తరువాత రాత్రి దాదాపు 10గంటల సమయంలో గుత్తి టోల్‌గేట్ వద్ద వెంట తెచ్చుకున్న పులిహోర తిన్నారు. కబుర్లు చెప్పుకుంటూ అరగంట సేదదీరారు. మంత్రాలయానికి పది నిమిషాల్లో చేరుకుంటామన్న సమయంలో మృత్యువు డ్రైవర్ కునుకు రూపంలో ఎదురుగా వస్తున్న రెడీ మిక్స్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. వీరంతా రోజువారీ కూలీలే. రెక్కాడితే డొక్కాడని జీవితాలు వారివి.
కాలం చెల్లిన సర్టిఫికెట్‌లతో వాహనం
మృతుడు డ్రైవర్ సునీల్‌కు ఉన్న మినీ ట్రక్ వాహనానికి కాలం చెల్లిన సర్టిఫికెట్లు ఉన్నట్లు మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కేఎండీ అవైష్ తెలిపారు. వాహనం నెం.కేఏ 46 9745 సకేశ్వర ఆర్టీవో కార్యాలయంలో రిజిస్టరై ఉంది. పర్మిట్ లేదు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గత ఏడాది మే 25కి ముగిసింది. ఇన్సూరెన్సు సైతం ఈనెల 9న ముగిసింది.
నా లారీని ఎంత కంట్రోల్ చేసినా మినీ ట్రక్ దూసుకొచ్చింది - లారీ ట్యాంకర్ డ్రైవర్ రామన్నబసప్ప
సుమారు 3గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కర్నాటక మినీ ట్రక్ రాంగ్‌రూట్‌లో వచ్చినా దాన్ని తప్పించే ప్రయత్నం చేశాను. అయినప్పటికీ నిద్రమత్తులో నా వాహనాన్ని ఢీకొట్టింది. నా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పొల్లాల్లో బోల్తా పడింది. అతి కష్టంపై ప్రాణాలతో బయటపడ్డాను. బీదర్ నుంచి దాదాపు 30 టన్నుల లోడ్‌తో తుమ్‌కుర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే ఆ రోడ్డులో తిరుగుతున్న వాహనాలను ఆపి వారి సహాయంతో బాధితులను అంబులెన్స్‌లో ఎక్కించాను.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు, నాయకులు
ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనను ఎస్పీ విక్రాంత్ పాటిల్, జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి, డీఎస్పీ భార్గవి, ఆర్టీవో కేఎండీ అవైష్ పరిశీలించారు. జరిగిన సంఘటనను మృత్యుంజయుడుగా ఉన్న భక్తుడు మనోజ్‌ను సంఘటన వివిరాలను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దారు రమాదేవి ఎమ్మిగనూరు డివిజినల్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు సంఘటనా స్థలం, ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. తీవ్రగాయాలైన భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేపట్టారు.
మాటలకందని విషాదం - రాఘవేంద్రరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి
మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందడం మాటలకందని విషాదం. ఈ సంఘటన తీవ్ర దిగ్ర్భాంతి కలిగించింది. ్ల హైవే రోడ్డుపై సూచికబోర్డులు, ప్రమాద నివారణకు చర్యలు తీసుకునే విధంగా ఉన్నత అధికారులతో మాట్లాడుతాను.
ప్రమాదంపై కేసు నమోదు- దస్తగిరిబాబు, సీఐ, మంత్రాలయం
జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఉడేవ గ్రామానికి చెందిన మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించాం. మృతదేహాలకు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించాం.