అభివృద్ధి, సంక్షేమానికి బృహత్తర ప్రణాళిక
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:20 PM
‘పారదర్శక పాలనతో పాటు బలమైన వ్యవస్థలను నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
నంద్యాల జిల్లాకు రూ.2626.92 కోట్లు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ముగిసిన జిల్లా ‘బడ్జెట్ అవుట్‌రీచ్ 2026-27’
నంద్యాల/ నంద్యాలనూనెపల్లి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ‘పారదర్శక పాలనతో పాటు బలమైన వ్యవస్థలను నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిధుల వ్యయంలో పారదర్శకత దిశగా చర్యలు తీసుకుంది. నంద్యాల జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి బృహత్తరమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం’ అని రాష్ట్ర ఆర్థికశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ భవన్‌లో ‘జిల్లా బడ్జెట్ అవుట్‌రీచ్ 2026-27’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, కలెక్టర్ రాజకుమారి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. జిల్లా సమగ్ర బడ్జెట్ కేటాయింపుల వివరాలను మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ప్రధానంగా వివిధ అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల పరంగా 2026-27 ఏడాదికి రూ.2,626.92 కోట్లు కేటాయించారు. పేదల సంక్షేమంతో పాటు జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేసే విధంగా జిల్లా నిధుల కేటాయింపు చేశారు. అదేవిధంగా రైతులకు అండగా రాయలసీమ జిల్లాలో హార్టికల్చర్ హాబ్ కోసం త్వరలో రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి పయ్యావుల ప్రకటించారు. నంద్యాల జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న బోర్‌వెల్స్‌కు తప్పనిసరిగా జియో మ్యాపింగ్ చేయాలని, మరమ్మతు కావాల్సిన బోర్ల వివరాలను సేకరించాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి డీఎంఎఫ్ నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్‌కు సూచించారు.
ఆశాజనకంగా బడ్జెట్ కేటాయింపులు
న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
గతంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో సుమారు రూ.3.32 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్‌లో నంద్యాల జిల్లా కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతికి ప్రాధాన్యం ఇచ్చాం. నియోజకవర్గాల వారీగా కూడా నిధులు కేటాయించడం ఈ బడ్జెట్ ప్రత్యేకత. అధికారులందరూ బడ్జెట్ ప్రయోజనాలు ప్రజలకు చేర్చలా కృషి చేయాలి.
ప్రజలకు తెలియజేస్తాం
రాజకుమారి, కలెక్టర్
2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్ కేటాయింపులపై జిల్లా ప్రజలకు స్పష్టత కల్పించడంతో పాటు అవగాహన కల్పిస్తాం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు ఈ బడ్జెట్ బలమైన పునాదిగా మారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే క్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. నంద్యాల జిల్లాకు కేటాయించిన రూ.2,626.92 కోట్లను, 45 శాఖలకు సంబంధించిన బడ్జెట్ వివరాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గాల వారీగా కేటాయింపులు (రూ.కోట్లలో)
ఆళ్లగడ్డ 310.26
బనగానపల్లె 354.17
డోన్ 308.46
నందికొట్కూరు 319.36
నంద్యాల 870.92
పాణ్యం 103.32
శ్రీశైలం 360.43
మొత్తం 2,626.92
సంక్షేమ పథకాలకు నిధులు
పథకం కేటాయింపులు లబ్ధిదారులు
(రూ.కోట్లలో) (లక్షల్లో)
ఎన్టీఆర్ భరోసా 1109.78 2.12
దీపం 2.0 99.00 4.06
స్త్రీ శక్తి 62.99 1.20 (రోజుకు)
తల్లికి వందనం 395.31 2.34
అన్నదాత సుఖీభవ 292.43 2.06
ఆటోడ్రైవర్ల సేవలో 14.96 10,006
శాఖలకు కేటాయింపులు (రూ.కోట్లలో)
ఇరిగేషన్ రూ.359.22
ఆర్‌డబ్ల్యూఎస్ రూ.342.12
ఆర్టీసీ రూ.219.15
గృహ నిర్మాణం రూ.206.51
వైద్య కళాశాల రూ.183.33
మహిళాశిశు రూ.171.62
వైద్యఆరోగ్యశాఖ రూ. 163.85
విద్య రూ.148.42
పంచాయతీరాజ్ రూ.116.67