వైభవంగా పూర్ణాహుతి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:13 AM
మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపించారు.
ఆరో రోజు వసంతోత్సవం, త్రిశూలస్నానం
శ్రీశైలంఓ కనుల పండువగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపించారు. శనివారం ఉదయం స్వామివారి యాగశాలలో చండీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆరు రోజులపాటు పంచాహ్నిక దీక్షతో జరిగిన బ్రహ్మోత్సవ ప్రత్యేక రుద్రహోమంలో నారికేళాలు, సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలను హవిస్సులుగా ఆహుతి చేశారు. ఈవో శ్రీనివాసరావు దంపతులతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీనివాసులు, స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులతో యాగ పూర్ణాహుతిని నిర్వహించారు.
వసంతోత్సవం.. అవబృదం
ఆలయ అర్చక వేదపండితులు పసుపు సున్నంతో కలిపిన మంత్రజల వసంతాన్ని భక్తులపై ప్రోక్షణ చేసి వసంతోత్సవాన్ని నిర్వహించారు. చండీశ్వరస్వామికి ఆలయ పుష్కరిణి వద్ద ఆగమ శాస్త్రం ప్రకారం స్నపన కార్యక్రమం అనంతరం పుష్కరిణిలో త్రిశూల స్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల ప్రధాన అర్చకుడు విజయ్‌కుమార్ వివరించారు. అవబృద కార్యక్రమం ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది.
నేడు స్వామి, అమ్మవార్లకు అశ్వవాహన సేవ
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడో రోజు ఆదివారం స్వామి, అమ్మవార్లకు అశ్వవాహన సేవ ప్రత్యేక పూజలతో పాటు ఆలయ ఉత్సవాన్ని నిర్వహించ నున్నారు. అనంతరం పుష్పోత్సవం ఏకాంతసేవ శయనోత్సవ సేవలను జరిపించనున్నట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు తెలిపారు.