Share News

పరిషత్‌ హోరాహోరీ!

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:15 PM

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం రెండో రోజు గురువారం ఊపందుకుంది.

పరిషత్‌ హోరాహోరీ!

రెండో రోజు నామినేషన్ల వెల్లువ

26 జడ్పీటీసీ స్థానాలకు 83 నామినేషన్లు

ఐదు స్థానాల్లో ఇంకా బోణీ లేదు

432 ఎంపీటీసీ స్థానాలకు 1,081 నామినేషన్లు

కృష్ణగిరిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల వర్షం

నామినేషన్‌ పత్రాలు చించేసిన టీడీపీ నాయకుడు

కర్నూలు/ కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం రెండో రోజు గురువారం ఊపందుకుంది. అభ్యర్థులు, అనుచరుల రాకతో మండల కేంద్రాల్లో రాజకీయ సందడి నెలకొంది. అధికార కూటమి ప్రధాన పార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీసీ సహా ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ వేడెక్కింది. 26 జడ్పీటీసీ స్థానాలకు 83 నామినేషన్లు వచ్చాయి. 432 ఎంపీటీసీ స్థానాలకు 1,081 నామినేషన్లు వేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు భారీగా అభ్యర్థులు తరలివచ్చే అవకాశం ఉండడంతో రాజకీయ వర్గాలు, బందోబస్తు నిర్వహించే పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆదోని, కృష్ణగిరి మినహా జిల్లాలో పరిషత్‌ రెండో రోజు నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది.

జిల్లాలో 26 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), 432 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ఈ నెల 19న షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం 26 జడ్పీటీసీ స్థానాలకు జడ్పీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, సీఈవో ఆర్‌.సుధాకర్‌రెడ్డి నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఆయా మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు మండల స్థాయి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్ల స్వీకరిస్తున్నారు. మొదటి రోజు జడ్పీటీసీ స్థానాలకు 9, ఎంపీటీసీ స్థానాలకు 165 నామినేషన్లు వచ్చాయి. తొలి రోజు దసరా కరి పండుగ, పశ్చిమ ప్రాంతంలో దేవరగట్టు కర్రల సమరం ఉండడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాలేదు. రెండో రోజు గురువారం పరిషత్‌ సంగ్రామం జోరందుకుంది. జడ్పీటీసీ స్థానాలకు 74 నామినేషన్లు వచ్చాయి. రెండు రోజుల్లో 83 మంది పోటీకి మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. ఎంపీటీసీ స్థానాలకు రెండు రోజుల్లో 1,081 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. వివిధ పార్టీల అభ్యర్థులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలతో నామినేషన్‌ కేంద్రాలకు చేరుకోవడంతో మండల కేంద్రాలు పార్టీ జెండాలతో కిటకిటలాడాయి. ప్రధాన పార్టీ ముఖ్య నాయకులు పార్టీ అభ్యర్థులతో కలసి నామినేషన్‌ కేంద్రాలకు చేరుకున్నారు. అయితే.. వారిని పోలీసులు వంద మీటర్ల దూరంలోనే ఆపేశారు. అభ్యర్థి, ప్రతిపాదించే ఇద్దరు కలిపి ముగ్గురిని మాత్రమే నామినేషన్‌ కేంద్రాలకు అనుమతించారు. కర్నూలు జిల్లా ప్రజా పరిషత్‌ పరిధిలో 26 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 21 స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. కోడుమూరు, గూడూరు, నందవరం, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు జడ్పీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్‌ కూడా రాకపోవడం కొసమెరుపు. ఆ స్థానాల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం కొసమెరుపు. అదే క్రమంలో ఏకగ్రీవాలకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆ స్థానాలకు చివరి రోజు అభ్యర్థులు నామినేషన్లు వేస్తారా..? ప్రధాన పార్టీల తరపున ఎవరు బరిలో నిలుస్తారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.

కృష్ణగిరిలో రణరంగం:

ఆదోని, కృష్ణగిరి మండలాల్లో మినహా రెండో రోజు పరిషత్‌ నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. కృష్ణగిరి మండలంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల వర్షం కురిసింది. ఉదయమే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఎంపీడీవో ఆఫీసులో ఉన్నారు. అదే సమయంలో 13 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి ముక్కుమ్మడిగా వచ్చారు. టీడీపీ అభ్యర్థులు ఆఫీసులో ఉన్నారనీ, మధ్యాహ్నం ఒంటి గంట తరువాత వస్తే నామినేషన్‌ వేయవచ్చని ఎస్‌ఐ అనుమంతరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం వచ్చిన వైసీపీ అభ్యర్థులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా, అప్పటికే రాళ్లు, కర్రలతో సిద్ధంగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై దాడి చేశారు. టీడీపీ శ్రేణులు కూడా ప్రతిఘటించి రాళ్లు రువ్వడంతో అక్కడ పరిస్థితి దాదాపుగా గంటకు పైగా రణరంగంగా మారింది. కానిస్టేబుల్‌ సహా పది మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ కృష్ణగిరికి చేరుకొని కార్యకర్తలను పరామర్శించారు.

నామినేషన్‌ పత్రాలు చించేసిన టీడీపీ నాయకుడు: ఆదోని-1, 2 మండలాల్లో పోటీ లేకుండా రెండు ఎంపీపీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలనీ, మెజార్టీ స్థానాలు కూటమి తీసుకోవాలనీ, వైసీపీకి రెండు మూడు ఎంపీటీసీ స్థానాలు ఇచ్చి మిగతావన్నీ తామే కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకుడు గోపాల్‌రెడ్డి దిబ్బనకల్లు, విరుపాపురం, మండిగిరి వైసీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు చించేశాడు. ఇది వివాదంగా మారింది. చివరికి పోలీసులు బందోబస్తు మధ్య వైసీపీ నాయకులతో నామినేషన్‌ వేయించారు.

ఆ గ్రామాల్లో టీడీపీ జెండా ఎగురుతుందా..!?:

శాంతి యాత్ర కావాలా..? దండయాత్ర కావాలా..? మంత్రాలయం రాజకీయాలపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్‌ 25న చేసిన వ్యాఖ్యలు ఇవి. మంత్రాలయం మండలంలో రాంపురం, బస్సాపురం, దిబ్బనదొడ్డి, కాచాపురం, కాగ్గల్‌, నారాయణపురం, తుంగభద్ర గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను కాదని ప్రత్యర్థులు అడుగుపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ ఏడు గ్రామాల్లోకి టీడీపీ నాయకులు కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. ‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తాం. భయపెట్టి రాజకీయాలు చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోం. ముందుగా శాంతి యాత్ర చేస్తాం.. కాదంటే దండయాత్రకైనా.. ఏ యాత్రకైనా సిద్ధం..’ అంటూ ్త టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సవాల్‌ విసిరారు. ప్రస్తుతం జరుగుతున్న మండల పరిషత్తు ఎన్నికల్లో ఆ గ్రామాల్లోని బస్సాపురం, కాచాపురం, రాంపురం ఎంపీటీసీ స్థానాలకు రెండు రోజులైనా టీడీపీ అభ్యర్థులు ఒక్కరు కూడా పోటీకి ముందుకు రాలేదు. అధినేత చంద్రబాబు సవాల్‌ మేరకు స్థానిక నాయకులు చివరి రోజైనా ఆ ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్‌ వేస్తారా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Updated Date - Oct 22 , 2026 | 11:15 PM