Share News

తిష్ట వేసిన ఓ అధికారి

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:55 PM

కలెక్టరేట్‌లోని జిల్లా భూసర్వే కార్యాలయం నూతనంగా ఏడీగా మురళీకృష్ణ నియమితులయ్యారు.

తిష్ట వేసిన ఓ అధికారి

భూసర్వే కార్యాలయంలో అంతా ఆయనే...

సర్వే విభాగంలో పరిష్కారం కాని సమస్యలు

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లోని జిల్లా భూసర్వే కార్యాలయం నూతనంగా ఏడీగా మురళీకృష్ణ నియమితులయ్యారు. కానీ పాత ఎఫ్‌ఏసీ ఏడీగా పని చేసిన ఓ అధికారి మాత్రం భూసర్వే కార్యాలయంలోనే తిష్ట వేశాడు. నిబంధనల ప్రకారం ఆ మాజీ ఏడీ సర్వే ఆర్డీవో కార్యాలయంలోని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధికారిగా నియమితులయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎఫ్‌ఏసీ సర్వే ఏడీగా బాధ్యతలు చేపట్టారు. కానీ బదిలీల్లో భాగంగా నూతన ఏడీ బాధ్యతలు స్వీకరించినా కూడా మాజీ ఏడీ భూసర్వే మాతృసంస్థ ఆర్డీవో కార్యాలాయానికి వెళ్లకుండా ఇక్కడే సర్వే కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనగాక ఇప్పుడు కూడా ఆయనపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వేయర్లు తప్పులు చేసినా క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. సర్వేయర్ల సర్వీసు బుక్‌లను అప్పుడు తనిఖీ చేయకుండా ఇప్పుడు తనిఖీ చేయడం గమనార్హం.

పీజీఆర్‌ఎస్‌లోని రీసర్వే అర్జీలు

ప్రతి సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్‌లో రీసర్వే సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు రైతులు మండల తహసీల్దార్‌, కలెక్టర్‌కి రైతులు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఒక రైతు పొలం ఎల్‌పీ నెంబర్‌ మరొక రైతుకు ఎల్‌పీ నెంబర్‌ కేటాయించడం, పట్టా పొలాన్ని చుక్కల భూములుగా గుర్తించడం, విస్తీర్ణం తగ్గించడం, వంక పొలంగా చూపెట్టడం.. వంటివి గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన జగనన్న భూసర్వేలో జరిగాయి. దీంతో వంశ పారంపర్య భూమి ఉన్న రైతులు ఈ సమస్యలకు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు.

రైతులు ఇచ్చిన అర్జీలు

మొత్తం అర్జీలు 21,630

పురోగతిలో ఉన్నవి 602

పరిష్కారమైనవి 19,781

పెండింగ్‌లో ఉన్నవి 139

రీసర్వే బహిష్కరణ

జిల్లాలో పని చేస్తున్న సర్వేయర్లు గత రెండు రోజులుగా రీసర్వేలను బహిష్కరించారు. రీసర్వే తప్ప మిగతా అన్ని విధులకు హాజరవుతామని సర్వేయర్లు పేర్కొన్నారు. ప్రధానంగా జీతాల పెంపుదలతో పాటు, పదోన్నతులు, గ్రామాల్లో ఫీల్డ్‌ వెళ్లినందుకు అదనంగా జీతాలు ఇవ్వాలని జిల్లా సర్వేయర్లు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామాల్లో సర్వే చేసేందుకు పరికరాలు, ల్యాప్‌టాప్‌లు అందజేయాలని కోరుతున్నారు.

సమస్యలు పరిష్కరిస్తాం

జిల్లాలో పని చేస్తున్న సర్వేయర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. సర్వేయర్లు విధులకు హాజరై రీసర్వే చేపట్టాలి. రైతులను ఇబ్బంది పెట్టిన సర్వేయర్‌పై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.

- మురళీకృష్ణ, జిల్లా భూ సర్వే ఏడీ

Updated Date - Jan 31 , 2026 | 11:55 PM