Share News

ప్రత్యక్ష ‘పుర’పోరు..!

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:41 PM

పుర పోరుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నగరపాలక మేయర్లు, పురపాలక సంఘాల చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానంపై అసెంబ్లీలో తీర్మానం చేసింది.

ప్రత్యక్ష ‘పుర’పోరు..!

నేరుగా మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక

పట్టణాల్లోనూ బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్‌

3న ఓటర్ల జాబితా ప్రచురణ

కర్నూలు కార్పొరేషన్‌ వార్డుల పునర్విభజనపై న్యాయస్థానం స్టే

నగరపాలక ఎన్నికలపై సందిగ్ధం

పుర పోరుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నగరపాలక మేయర్లు, పురపాలక సంఘాల చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానంపై అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. అక్టోబరులో ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగాంగా వెనుక బడిన తరగతులకు (బీసీలు) 33.33 శాతం రిజర్వేషన్ల అమలుపై బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సెప్టెంబరు 3న ఓటర్లు జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణ స్థానిక ఎన్నికలకు వేగం గా కసరత్తు చేస్తుంటే.. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. వా ర్డుల పునర్విభజనలో భాగంగా సరి హద్దులు మార్చడం వల్ల జనగణనపై ప్రభావం చూపు తుందని ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయిం చడంతో స్టే ఇచ్చింది. దీంతో కోర్టు ఇచ్చే తీర్పుపై కర్నూలు మేయర్‌, కార్పొరేటర్ల ఎన్నిక ఆధారపడి ఉంటుంది. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కర్నూలు నగర పాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్‌, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు పురపాలక సంఘాలు, గూడూరు, బేతంచర్ల నగర పంచాయతీలు ఉన్నాయి. నగర, పుర పాలకవర్గాల పదవీ కాలం మార్చి 23న ముగిసింది. అప్పటి నుంచే సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టింది. వార్డుల సంఖ్యను పెంచుతూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డులను విభజన చేశారు. పురపోరుకు వేగంగా సన్నాహాలు మొదలయ్యాయి. అప్పుడే కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డివిజన్లు, వార్డుల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కర్నూలు కార్పొరేషన్‌కు సంబంధించి కోర్టు కేసు పెండింగ్‌లో ఉండడంతో డివిజన్ల పెంపు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేశామని న్యాయస్థానం తీర్పుకు లోబడి ప్రకటన చేస్తామని అధికారులు అంటున్నారు.

బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్‌

పల్లె స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు కోసం ప్రభుత్వం జీవో ఆర్టీ నంబరు.1065 జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ సహా ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీల్లో 149 వార్డులను 187 వార్డులకు పెంచారు. నంద్యాల జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్‌, నందికొట్కూరు, ఆత్మకూరు, బేతంచర్ల మున్పిపాలిటీల్లో 158 వార్డులను 184 వార్డులకు పెంచారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మేరకు కర్నూలు జిల్లాలో 62-63 వార్డులు, నంద్యాల జిల్లాలో 61-62 వార్డులు బీసీలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కసరత్తు చేస్తున్న అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ప్రత్యక్ష పోరు.. అప్పుడే రాజకీయ వేడి

నగరపాలక సంస్థల్లో మేయర్‌, మున్సిపాలిటీల్లో చైర్మన్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకునేవారు. వార్డుల్లో గెలిచిన కార్పొరేటర్లు మేయర్‌ను, కౌన్సిలర్లు చైర్మన్లను ఎన్నుకునే విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఓటర్లే నేరుగా ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో నగర, పట్టణాల్లో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. రిజర్వేషన్లను అంచనా వేస్తూ ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడే ఆర్థిక బలం, అంగబలం, సామాజిక బాలాబలాను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీల ముఖ్య నాయకులు కసరత్తు చేస్తున్నారు. బలమైన ఇద్దరు, ముగ్గురు నాయకులను గుర్తించారు. అదే క్రమంలో ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్‌, ఏడు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయి.కూటమి ధర్మం మేరకు రెండు లేదా మూడు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాలు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీలకు కేటాయించాల్సి ఉంది. ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి విజయం సాధించారు. ఆదోని మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అదే క్రమంలో ఎమ్మిగనూరు పీఠం కూడా ఆశిస్తున్నారు.

సెప్టెంబరు 3న ఓటర్ల జాబితా ప్రకటన

జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌) ప్రక్రియ పూర్తిస్థాయిలో అక్టోబరు 3న ముగుస్తుంది. అయితే.. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టడంతో 2026 జనవరి ఒకటో తారీఖు వరకు నగరపాలక, మున్సిపాలిటీల్లో ఉన్న ఓటర్లను పరిగణలోకి తీసుకొని వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. సెప్టెంబరు 3న ఓటర్ల జాబితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఉన్న ఓటర్లను ఆ మున్సిపాలిటీలోని వార్డులకు సమానంగా విభజించే అవకాశం ఉంది. భౌగోళిక విస్తీర్ణాన్ని బట్టి కొన్ని వార్డుల్లో ఓటర్లు ఎక్కువ తక్కువ ఉండే అవకాశం ఉంది. గతంలో ఒకే ఇంట్లో ఓటర్లు రెండు మూడు వార్డుల్లో ఉండేవారని, ఆ ఇబ్బందులు సరిచేసిన ఏ వార్డులో ఓటర్లు అదే వార్డులో ఉండేలా ఓటర్ల విభజన చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

ఆర్‌వో, ఏఆర్‌వోల నియామకం

జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టరు ఉంటారు. కార్పొరేషన్‌ కమిషన్‌ అడిషనల్‌ ఎలక్షన్‌ ఆఫీసరుగా, మున్సిపాలిటీ కమిషనర్లు అసిస్టెంట్‌ ఎలక్షన్‌ ఆఫీసర్లుగా కొనసాగుతారు. ప్రతి 2-4 వార్డులకు ఒక రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి (ఏఆర్‌వో)లను నియమిస్తారు. సీనియర్‌ గెజిటెడ్‌ అధికారిని ఆర్‌వోగా, జూనియర్‌ గెజిటెడ్‌ అధికారిని ఏఆర్‌వోగా నియమిస్తారని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 125-150 మంది ఆర్‌వోలు, అంత సంఖ్యలో ఏఆర్‌వోలు అవసరం ఉంది. వీరి పర్యవేక్షణలోనే పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు, పబ్లిష్‌, బ్యాలెట్‌ పత్రాలు ముద్రణ, ఎన్నికల నిర్వహణ ఉంటుంది. కీలకమైన ఆర్‌వో, ఏఆర్‌వోల నియామకంపై ప్రత్యేక దృష్టిని పెట్టారు.

కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతాయా?

కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతాయా..? రాజకీయ నాయకులనే కాదు, సామాన్య ఓటర్లను సైతం వేధిస్తున్న ప్రశ్న ఇది. 2011 జనాభా లెక్కలు ప్రకారం నాటి జనాభాకు అనుగుణంగా డివిజన్లు, వార్డులు పునర్విభజనకు కూటమి ప్రభుత్వం మే 24న జీవో ఎంఎస్‌ నంబరు.64 జారీ చేసింది. ఆ జీవో ప్రకారం కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 52 వార్డులను 68 వార్డులకు పెంచారు. ఆ మేరకు జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు. అయితే.. ఒకపక్క జనగణన (సెన్సెస్‌) జరుగుతుంటే, వార్డులను పునర్విభజన ఎలా చేస్తారంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. ఇలాంటి కేసులు ఉన్న మున్సిపాలిటీలు రాష్ట్రంలో 39 ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేసులపై దృష్టి సారించింది. గతంలో గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న స్టేలను రద్దు చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించిందని, తీర్పు రిజర్వులో ఉంచారని అధికారులు పేర్కొంటున్నారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పు అనుగుణంగా సెప్టెంబరు 3న ఓటర్ల జాబితా ప్రకటనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోర్టు తీర్పు ఎలా ఉంటుంది? కర్నూలు నగర పాలక ఎన్నికలు జరుగుతాయా..? నగరంలో ఇదే హాట్‌ టాపిక్‌.

ఉమ్మడి జిల్లాలో నగర, పురపాలక సంస్థల్లో విభజనకు ముందు, తరువాత వార్డులు, బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్‌ ప్రకారం దక్కనున్న స్థానాలు (సుమారుగా) వివరాలు

నగర/పురపాలక సంఘాలు విభజనకు ముందు విభజన తరువాత బీసీలకు

డివిజన్లు/వార్డులు డివిజన్లు/వార్డులు దక్కే స్థానాలు

కర్నూలు 52 68 22-23

ఆదోని 42 52 17-18

ఎమ్మిగనూరు 35 44 14-15

గూడూరు 20 23 7-8

కర్నూలు జిల్లా మొత్తం 149 187 62-63

నంద్యాల 42 52 17-18

డోన్‌ 32 36 11-12

నందికొట్కూరు 29 32 10-11

ఆత్మకూరు 28 32 10-11

ఆళ్లగడ్డ 27 32 10-11

నంద్యాల జిల్లా మొత్తం 158 184 61-62

Updated Date - Aug 20 , 2026 | 11:41 PM