Share News

మూగజీవాలకు గడ్డుకాలం

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:36 PM

ఆరుగాలం కష్టపడే అన్నదాతకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

మూగజీవాలకు గడ్డుకాలం
డోన్‌లో పశువుల సంతలో పశువులను కబేళాలకు తరలించేందుకు లారీలకు తరలిస్తున్న దృశ్యం

పోషణ భారమై జీవాలను వదులుకుంటున్న రైతాంగం

వ్యవసాయ పనులు ఆపేసి సంతలకు తరలిస్తున్న వైనం

ఉమ్మడి జిల్లాలో 45 లక్షల మూగజీవాల పరిస్థితి ఆగమ్యగోచరం

గ్రాసం పెంచేందుకు చర్యలు చేపట్టిన అధికారులు

ఆరుగాలం కష్టపడే అన్నదాతకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంతగా మూగజీవాలకు గడ్డుకాలం దాపురించింది. రానున్న రోజుల్లో మూగజీవాలను పోషించే పరిస్థితిని తలుచుకుని అన్నదాతలు పొలం పనుల కోసం తెచ్చుకున్న పశువులను, అప్పులుచేసి పాల వ్యాపారం చేసైనా జీవనోపాధి పొందుదామని తెచ్చుకున్న పాడిగేదెలను సంతలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి కబేళాలకు తీసుకెళ్తున్నారు.

కర్నూలు అగ్రికల్చర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో మూగజీవాలకు గడ్డుకాలం నెలకొంది. పాడి రైతులపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షాలు లేక సాగుచే సిన పంటలు కళ్లెదుటే ఎండిపోతుం డటంతో రైతులు కన్నీరు మున్నీరవుతు న్నారు. ఎండిన పంటలను దున్నేస్తున్నారు. తాము బతకడమే ముందు రోజుల్లో భారమయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో రూ.లక్షలు ఖర్చు పెట్టి పొలం పనుల కోసం తెచ్చుకున్న పశువులను వాటి పోషణ మోయలేమోనన్న బాధతో, దిగాలుతో పశువులను సంతకు తీసుకెళ్లి సగం ధరలకే విక్రయిస్తున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..

కర్నూలు జిల్లాలో 2.35లక్షల గోజాతి, 1.27 లక్షలు గేదెలు మొత్తం 3.62 లక్షల పశువులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడింది. 11.03 లక్షల గొర్రెలు, 3.4 లక్షల మేకలు మొత్తం 14.7 మేకలు, గొర్రెలు, అదే విదంగా 5.85 లక్షల కోళ్లు తదితర అన్ని జీవాలు కలిపి 25లక్షల పైచిలకు మూగజీవాలకు మేత సమస్య ఇప్పటికే తీవ్రంగా ఉంది. నంద్యాల జిల్లాలో 4.14 లక్షల ఆవులు, 11.89 లక్షల గొర్రెలు, మేకలు, 7.50 లక్షల కోళ్లు ఇతరత్రా అన్ని కలిపి 22 లక్షల జంతువుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

విక్రయానికి తరలింపు

పొలాల్లో సాగు పనుల కోసమని ఒక జత ఎద్దులను రైతులు దాదాపు రూ.లక్ష ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. కొంత మంది రైతులు అప్పులు చేసి మరీ వీటిని కొనుగోలు చేశారు. వరుణుడు కరుణించకపోతాడా పంట ఉత్పత్తులతో తమ ఇళ్లు, వాముదొడ్లు నిండిపోతాయని రైతులు ఆశించారు. సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రైతులు చాలా మంది వ్యవసాయ పనుల కోసం మే, జూన్‌ నెలలో సంతలకు వెళ్లి పశువులను కొనుగోలు చేస్తుంటారు. నంద్యాల జిల్లాలోని డోన్‌, బనగానపల్లె, కర్నూలు జిల్లాలోని గూడూరు, ఎమ్మిగనూరు ప్రాంతా ల్లో సంతకెళ్లి రైతులు పాడి పశువులను కొనుగోలు చేస్తారు. సాధారణంగా పంటలు సాగు చేసే సమయంలో సంతలు ఖాళీగా వెలవెలబోతుంటాయి. ప్రస్తుతం పంటల సాగు మందగించడంతో రైతులు ముందు చూపుతో ఈసారి తాము బతకడమే కష్టమవుతుందని, ఇక పశువులకు మేతను అందించలేమనే ఉద్దేశంతో సంతలకెళ్లి అమ్మేస్తున్నారు. రూ.లక్షకు కొనుగోలు చేసిన జతఎద్దులను కేవలం రూ.50వేలకు అమ్ముకుని రైతులు నష్టపోవాల్సి వస్తోంది.

40లక్షల పశుసంపదకు గ్రాసాన్ని..

ఉమ్మడి జిల్లాలో 40 లక్షల పశుసంపదకు రానున్న రోజుల్లో గ్రాసాన్ని ఏ విదంగా అందించాలో పశుసంవర్థక శాఖాధికారులకు దిక్కుతోచని పరిస్థితి. ఒక పశువుకు రోజుకు 5 కిలోల గ్రాసం కావాలి. ఈలెక్కన ఉమ్మడి జిల్లాలో 40లక్షల పశువులకు ఒకరోజుకు 70వేల కిలోల మేత అవసరమవుతుంది. ప్రస్తుతం పశుసంవర్దక శాఖ అధికారుల లెక్కల ప్రకారం మూడు నెలలకు సరిపడ గ్రాసం మాత్రమే కర్నూలు జిల్లాలో అందుబాటులో ఉంది. దాదాపు 3.13లక్షల మెట్రిక్‌ టన్నుల గడ్డి ఉందని, ఆ తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. రైతులకు అవగాహన కల్పించి ఎక్కడికక్కడ గ్రామాల్లో ఎండిన చెరువులతో పాటు ఖాళీ పొలాల్లో గ్రాసాన్ని పెంచే కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎండిన చెరువుల్లో 10 మంది దాకా రైతులను సంఘాలుగా ఏర్పాటుచేసి గ్రాసాన్ని పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని కర్నూలు కలెక్టర్‌ ఏ.సిరి పశుసంవర్థక శాఖాధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులను సమావేశ పరిచి గ్రాసాన్ని పెంచేందుకు అన్నిరకాల సాయాన్ని అందిస్తామని, వాటిని పెంచి మీ పశువులకే గ్రాసంగా అందించే అవకాశాన్ని కల్పించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. కర్నూలు జిల్లాలో 50చెరువులను గ్రాసం పెంపకం కోసం గుర్తించారు. ఈ చెరువుల కింద గ్రాసాన్ని పెంచే కార్యక్రమం మొదలైంది. గ్రాసం కొరతను లేకుండా మూగజీవాలను కాపాడే ప్రయత్నాలు ఆశాఖ చేపట్టింది.

మూగజీవాలను కాపాడుతాం

మూగజీవాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ విపత్కర పరిస్థితుల నుంచి పశువులను కాపాడేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి 3లక్షల మెట్రిక్‌ టన్నుల గ్రాసం నిల్వలున్నాయి.

రాజశేఖర్‌, జేడీ, పశుసంవర్థక శాఖ, కర్నూలు

Updated Date - Aug 19 , 2026 | 11:36 PM