సాంస్కృతిక విధానాన్ని ప్రవేశ పెట్టాలి
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:46 PM
సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వమే ప్రవేశ పెట్టాలని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని ప్రజానాట్య మండలి 11వ రాష్ట్ర మహాసభల్లో తీర్మానం చేశారు.
భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి
ప్రజా నాట్య మండలి 11వ రాష్ట్ర మహాసభల్లో తీర్మానం
రెండోరోజూ ఆకట్టుకున్న వీధి నాటకోత్సవాలు
కర్నూలు కల్చరల్, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వమే ప్రవేశ పెట్టాలని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని ప్రజానాట్య మండలి 11వ రాష్ట్ర మహాసభల్లో తీర్మానం చేశారు. కార్పొరేట్ మతోన్మాద శక్తులను ఎదిరించడానికి ప్రజా సాంస్కృతిక ఉద్యమంపై బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య వక్తలు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని సన్యాసిరావు-పెంచలయ్య నగర్ (డైమండ్ ఫంక్షన్ హాలు)లో ప్రజా నాట్య మండలి (పీఎన్‌ఎం) రాష్ట్ర మహాసభలు రెండో రోజు కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సభల్లో పీఎన్‌ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ గత మూడేళ్లలో పీఎన్‌ఎం ప్రదర్శించిన వివిధ కళారూపాల వివరా లను మహాసభ కార్యదర్శి నివేదికలో ప్రవేశ పెట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచీ వచ్చిన జిల్లాల ప్రతినిధులు కార్యదర్శి నివేదికపై చర్చల్లో పాల్గొన్నారు. మహాసభలకు సౌహార్థ సందేశం ఇవ్వడానికి హాజరైన తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నరసింహ మాట్లాడుతూ 1991 తర్వాత ప్రపంచీకరణ ప్రభావం వల్ల కళలు కూడా బడా కార్పొరేట్లకు అనుకూలంగా మారిన పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రస్తుత సమాజంలో కార్పొరేట్ మతోన్మాద శక్తులు బలపడటం వల్ల ప్రజా కళలు, కళాకారులకు ప్రోత్సాహం తగ్గి బలహీ నప డటం, భావ ప్రకటన స్వేచ్ఛకు, భావవ్యక్తీకరణకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా పోరాటాలు, ప్రజా కళలు వర్థిల్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం, సీఐటీయూ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు కందారపు మురళి, గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు, జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బంగారు మురళి మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజా కళలు వర్థిల్లాలని, ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. అం దరూ ఐక్యమై ప్రజా పోరాటాలను, ప్రజా కళలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పారు.
తీర్మానాలు ఇవి..
ఈ మహాసభల్లో సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వమే ప్రకటించాలనే తీర్మానాన్ని పీఎన్‌ఎం నాయకుడు పెద్దిరాజు ప్రవేశపెట్టగా, మరో నాయకుడు రాఘవయ్య బలపరిచారు. ఇందులో ప్రధానంగా తెలుగు భాస, సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం సమగ్ర సాంస్కృతిక విధానాన్ని ప్రకటిం చాలని సమావేశంలో నాయకులు డిమాండ్ చేసింది. అలాగే గురజాడ సాంస్కృతిక విశ్వ విద్యాలయం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయడంతోపాటూ జానపద, నాటక, ప్రజా కళారూపాలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. తెలుగు మాధ్యమ విద్యను బలోపేతం చేయడం, కళాకారుల సంక్షేమం కొసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కపాడాలనే తీర్మానాన్ని పీఎన్‌ఎం నాయకుడు ఎం. చంటి ప్రవేశ పెట్టగా, మహాసభల నాయకురాలు సోమేశ్వరి బలపరిచారు. ఇందులో ప్రధానంగా భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొంటూ రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రెండు తీర్మానాలను మహాసభలో నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.మంగరాజు, ఉపాధ్యక్షుడు జి.రమణ, సహాయ కార్యదర్శులు నాగరాజు, వెంకటేశ్వర్లు, రిసోర్స్ పర్సన్ కవి పీఎన్‌ఎం, సీనియర్ నాయకులు జగన్, జిల్లా అధ్యక్షురాలు నోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.