విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:07 AM
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అని కలెక్టర్ ఏ.సిరి అన్నారు.
కలెక్టర్ సిరి
కోడుమూరు రూరల్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. మంగళవారం కోడు మూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులతో కలెక్టర్ పలు అంశాలపై ముచ్చటించారు. విద్యా బోధన, లక్ష్యాల సాధనపై సందేశం ఇచ్చారు. తల్లిదండ్రులు, గురువులకు గౌరవం ఇస్తూ క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. యువత మత్తు పదార్థాలు, దూమపానం, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. పాఠ్యాంశాలపై సందేహాలను ఎప్పటికప్పుడు అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలని, మంచి ఆరోగ్యం కోసం మంచి పౌష్టికా హారం, క్రమం తప్పకుండా క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. మధ్యాహ్న భోజనం గురించి కలెక్టర్ విద్యార్థులను ఆరా తీశారు. భోజనంలో నాణ్యత, బియ్యం సరఫరా, చిక్కీ, పాలు, కూరలు తదితర అంశాలపై ఆరా తీశారు. భోజనంలో పురుగులు ఉన్నాయనే ఫిర్యాదులపై సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని నివేదించాలని ఆర్‌ఐవోను ఆదేశించారు. చిక్కీ ఆహార పదార్థాల సరఫరా విషయంలో విద్యార్థులు తెలిపిన అంశాలను నమోదు చేసుకుని ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పప్పు, ఆలు కర్రీ నీళ్లలా పలుచగా ఉంటోందని విద్యార్థులు తెలపడంతో భోజన నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు సంబంధిత వంట మనిషిని మార్చాలని, అవసరమైన చోట ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయా లని సమగ్ర శిక్ష పీవోను ఆదేశించారు.
పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి
జూనియర్ కళాశాలను పరిశీలిస్తున్న సమయంలో పారిశుధ్య నిర్వ హణ సరిగా లేకపోవడం గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌ఐవోను ఆదేశించారు. సమ గ్రశిక్ష అభియాన పీవో లోకరాజ్, ఆర్‌ఐవో లాలప్ప పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం తనిఖీ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి డా. సురేష్ బాబు, ఆర్‌ఐవో లాలప్ప తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.