సరికొత్త రికార్డు
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:50 PM
కర్నూలు కళాకారులు మరోసారి సత్తా చాటారు. 12 గంటల పాటు నిర్విరామంగా నృత్య ప్రదర్శనలు చేస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.
12 గంటల పాటు నృత్య ప్రదర్శనలు
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
కర్నూలు కళాకారుల సత్తా
కర్నూలు కల్చరల్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు కళాకారులు మరోసారి సత్తా చాటారు. 12 గంటల పాటు నిర్విరామంగా నృత్య ప్రదర్శనలు చేస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రం, నటరాజ నృత్య కళామందిర్ సంయుక్త ఆధ్వర్యంలో 200 మంది నృత్య కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను ప్రదర్శించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులు ఉత్సాహంగా ఈ నృత్య ప్రదర్శనలకు తరలి వచ్చి, అబ్బుర పరిచేలా ప్రదర్శనలు ఇచ్చారు. ఉదయం 9 గంటలకు మొదలైన నృత్య ప్రదర్శనలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త, చిత్ర నిర్మాత బీవీ రెడ్డి మాట్లాడుతూ కళాకారులుగా పుట్టడం, కళాకారులుగా జీవించడం పూర్వజన్మ సుకృతమని, కర్మ ఫలానుసారమే మానవ జన్మ అన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళారత్న పత్తి ఓబులయ్య మాట్లాడుతూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు టీజీవీ కళాక్షేత్ర ప్రదర్శనలకు రావడం ఇది రెండోసారి అని గుర్తు చేశారు. గతంలోనూ వంద పాటలు, వంద నృత్యాలకు, రంగస్థల కళాకారులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించిందన్నారు. నృత్య పోటీల్లో పాల్గొన్న కళాకారులు, గురువులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గజల్ గాయకులు మహ్మద్ మియా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఛైర్మన్ డాక్టర్ వెంకటాచారి, నృత్య గురువు ఎస్.కరీముల్లా, సభ్యులు అకోశ్‌కుమార్, సినీ నృత్య గురువు కేవీ సత్యనారాయణ, వ్యాఖ్యాత సునీత, మునిస్వామి, సంగా ఆంజనేయులు పాల్గొన్నారు.