Share News

వంటింటిపై వార్‌ దెబ్బ

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:25 PM

పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు మనదేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

వంటింటిపై వార్‌ దెబ్బ

పెరిగిన గ్యాస్‌ బుకింగ్‌

భారమంటున్న ఏజెన్సీల నిర్వాహకులు

ఏజెన్సీలకు వినియోగదారుల పరుగులు

బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న అక్రమార్కులు

నంద్యాల టౌన్‌, మార్చి 13(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు మనదేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భారత్‌కు గ్యాస్‌ అత్యధికంగా సరఫరా చేసే ఖతార్‌ తన డెలివరీని ఆపేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో చమురు సంస్థలు ఒక్కసారిగా గ్యాస్‌ ధరలను పెంచేశాయి. దీనివల్ల గృహ వినియోగదారులతో పాటు వాణిజ్య వినియోగదారులపై అదనపు భారం పడింది. డొమెస్టిక్‌ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.115 ధర పెరిగింది. పోనీ పెరిగాన గ్యాస్‌ త్వరగా దొరుకుతుందా? అంటే అదీ లేదు. బుకింగ్‌ కూడా సక్రమంగా కావడం లేదు. ఒక్కసారిగా అందరూ బుకింగ్‌లు చేయడంతో గ్యాస్‌ ఏజెన్సీలు గ్యాస్‌ డెలివరీలను 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచాయి. గతంలో ఒక్కో ఏజెన్సీలో రోజువారీ బుకింగ్‌లు 1,500 ఉండేవని, ఇప్పుడు దాదాపు 4వేలకు వరకు పెరిగాయని నిర్వాహకులు తెలిపారు. బుక్‌ చేసుకున్నవారికి కుడా వారం రోజులపైనే పడుతుండడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. జిల్లాలో రోజువారి కన్నా రెండు రోజుల్లో మూడు వంతులు పెరిగింది. ఒక్కసారిగా పెరిగిన బుకింగ్‌లతో సిలిండర్ల సరఫరా గ్యాస్‌ ఏజెన్సీలకు భారంగా మారింది.

అధిక ధరలకు విక్రయిస్తూ ..

కొంతమంది గ్యాస్‌ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సిలిండర్‌ ధర రూ.1500 నుంచి రూ.1800 వరకు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వివాహాలు, ఇతర శుభాకార్యాలు ఎక్కవగా జరుగుతుం డడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయట అధిక ధరలకు కొనుగోలు చేయవలసిన పరిస్థితి. అధికారుల కనీస పర్యవేక్షణ లేకపోవడంతో కొందరూ వ్యాపారులు వంట గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.

జిల్లాలోని వివరాలు

గ్యాస్‌ ఏజెన్సీలు : 32

గృహ అవసరాల

కనెక్షన్లు : 5.77 లక్షలు

రోజు వారి బుకింగ్‌ : 10,999

కమర్షియల్‌ కనెక్షన్లు : 3,278

దీపం కనెక్షన్లు : 22,599

ఉజ్వల కనెక్షన్లు : 37,216

కొరత తప్పదన్న భయంతో..

రానున్న రోజుల్లో గ్యాస్‌ కొరత తప్పదన్న భయంతో వినియోగదారులు ఏజెన్సీలకు పరు గులు తీసున్నారు. జిల్లాలో ఎక్కువగా నంద్యాలతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో గ్యాస్‌ను అధికంగా అక్రమంగా వియోగిస్తున్నారు. దీంతో పాటు వసతి గృహాల్లోనూ గ్యాస్‌ ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్న సమయంలో గ్యాస్‌ సరఫరా అగితే ఇబ్బందులు తప్పవని సంక్షేమ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫుడ్‌ సెంటర్లపై ప్రభావం

నంద్యాల జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లలో వంటగ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా రోజుల తరబడి వేచి చూడక తప్పదు. గృహ అవసరాలకు వాడే సిలిండర్లు కనీసం బ్లాక్‌లో కూడా దక్కని పరిస్థితి నెలకొంది. చిన్న హోటళ్లు, వీధుల్లో టిఫిన్‌ కేంద్రాలు ఇప్పటికే మూసేశారు. దీంతో చేసేదేమి లేక హోటళ్లు మూసుకునే పరిస్థితి వచ్చిందని నిర్వాహకులు వాపోతున్నారు.

వినియోగదారులు ఆందోళన చెందొద్దు

వినియోగదారులు సిలిండర్‌ బుక్‌ చేసుకున్న 3, 4రోజుల్లో డెలివరీ చేయాలని కఠినమైన ఆదేశాలు జారీచేశాం. డోమాస్టిక్‌ సిలిండర్లను ఎట్టి పరిస్థతుల్లో కుడా కమర్షియల్‌ విని యోగానికి ఇవ్వదని ఆదేశించాం. రానున్న రోజుల్లో కొరత ఏర్పడితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్‌ కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేస్తాం. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందొద్దు.

రవిబాబు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, నంద్యాల

గ్యాస్‌ నిల్వలు ఉన్నాయి : జేసీ కార్తీక్‌

నంద్యాల నూనెపల్లి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం జిల్లాలోని ఎల్పీజీ డిస్ర్టిబ్యూటర్ల వద్ద తగినంత గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయిల్‌ కంపెనీల నుంచి అందిన సమాచారం మేరకు డొమెస్టిక్‌ ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై అదనంగా రూ.60, కమర్షియల్‌ ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.115 పెంచినట్లు వివరించారు. గృహ వినియోగం కోసం కేటాయించిన డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను హోటల్స్‌, టిఫిన్‌ సెంటర్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు విక్రయించినట్లు తెలిస్తే వినియోగదారుల గ్యాస్‌ సబ్సిడీ రద్దు చేస్తామని, కనెక్షన్‌ రద్దు చేస్తామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డిస్ర్టిబ్యూటర్ల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. డెలివరీ సిబ్బంది ఎక్కువ డబ్బు వసూలు చేస్తే సంబంధిత పౌరసరఫరా శాఖ డిప్యూటీ తహసీల్దార్‌, మండల తహసీల్దారు, జిల్లా పౌర సరఫరాల అధికారి లేదా టోల్‌ ఫ్రీ నంబరు 1967కు ఫిర్యాదు చేయాలన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 11:25 PM