జడ్పీ బరిలో 97 మంది
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:29 PM
జిల్లా, మండల పరిషత్ సమరం తుది అంకానికి చేరింది.
26 జడ్పీటీసీ స్థానాలు..
కూటమిలో సీట్ల సర్దుబాటు
24 స్థానాల్లో టీడీపీ
జనసేన-3, బీజేపీ ఓ స్థానంలో పోటీ
432 ఎంపీటీసీ స్థానాల్లో 983 మంది అభ్యర్థులు
టీడీపీ 54, వైసీపీకి 19, బీజేపీ ఒక చోట ఏకగ్రీవం
జిల్లా, మండల పరిషత్ సమరం తుది అంకానికి చేరింది. నామినేషన్ల ఉప సంహరణతో బరిలో తలపడే అభ్యర్థులు ఎవరో స్పష్టత వచ్చింది. జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి, వైసీపీ సై అంటోంది. పొత్తుల్లో భాగంగా 24 స్థానాల్లో టీడీపీ, మూడు స్థానాల్లో జనసేన, ఒక చోట బీజేపీ పోటీలో నిలబడ్డాయి. పరిషత్ పోరులో కీలకమైన నామినేషన్లు, విత్‌డ్రాల పర్వం ముగిసింది. పలు నియోజకవర్గాల్లో ఏకగ్రీవాల కోసం టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య చర్చలు జరిగినా.. ఫలానా జడ్పీటీసీ స్థానాన్ని తమకే ఇవ్వాలంటూ ఎవరికి వారే పట్టుబట్టడంతో ఏకగ్రీవాలకు చెక్ పడింది. 432 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంటే.. 74 ఏకగ్రీవం కాగా, 358 స్థానాలకు పోరు అనివార్యమైంది. ఈ ఎన్నికల సమరంలో విజయ తీరాలకు చేరేదెవరు..? జిల్లా అంతటా ఇదే చర్చ. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 26 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ)కు ఈ నెల 21న జడ్పీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌వో) సుధాకర్‌రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. చివరి రోజు 24వ తేది నాటికి 165 మంది అభ్యర్థులు 195 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 30 మంది డబుల్ నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉప సంహరణకు మంగళవారం సాయంతం 3 గంటలకు ఆఖరు కావడంతో 68 మంది అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి (విత్‌డ్రా) తీసుకొని జడ్పీ పోరు నుంచి తప్పుకున్నారు. 97 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. వారిలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మొత్తం 26 స్థానాలకు పోటీలో అభ్యర్థులను నిలిపారు. అందే క్రమంలో సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీలు, స్వతంత్రులు 45 మంది పరిషత్ పోరులో తలపడేందుకు సిద్ధం అయ్యారు. దీంతో హోరాహోరీ పోరుకు తెర లేచింది. మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో పలు మండలాల జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవాల కోసం అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో మొత్తం స్థానాలకు పోటీ అనివార్యమైంది. మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం మండలాల జడ్పీటీసీ స్థానాల్లో పెద్దకడుబూరు జడ్పీటీసీ వైసీపీ, మిగిలిన మూడు స్థానాల్లో టీడీపీ ఏకగ్రీవం అవుతాయని ఆయా పార్టీల నాయకులు భావించారు. మంత్రాలయం ఎంపీపీ పీఠం విషయంలో ఒప్పందం కుదరకపోవడంతో జడ్పీటీసీ స్థానాల ఏకగ్రీవాల చర్చ అటకెక్కి.. సమరానికి సైరన్ మోగించారు. ఒక పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ ఏకగ్రీవం చేసుకోవాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వైసీపీ అభ్యర్థి సాయిపూజితరెడ్డి విత్‌డ్రా చేసుకున్నా, బీఎస్‌పీ అభ్యర్థి సునితమ్మ సెల్ స్వీచ్‌ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోటీ అనివార్యమైంది.
74 ఎంపీటీసీలు ఏకగ్రీవం.. టీడీపీ ఖాతాలో 54:
జిల్లాలో 26 మండలాల్లోని 432 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా స్థానాల్లో అదృష్టం పరీక్షించుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రులుగా 2,054 మంది నామినేషన్లు వేశారు. ఉప సంహరణకు చివరి గడువు మంగళవారం సాయంత్రం 3 గంటలు. నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో 1,073 మంది వివిధ కారణాలతో విత్‌డ్రా చేసుకున్నారు. 983 నామినేషన్లను మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. 74 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 358 స్థానాలకు పోరు తప్పలేదు. ఏకగ్రీవమైన స్థానాల్లో టీడీపీ 54, వైసీపీ 19, బీజేపీ ఒక స్థానం దక్కించుకుంది. పోటీ జరిగే 358 ఎంపీటీసీ స్థానాల్లో 907 మంది బరిలో ఉన్నారు. వారిలో టీడీపీ అభ్యర్థులు 337, వైసీపీ అభ్యర్థులు 349, జనసేన 38, బీజేపీ 10, ఇతర పార్టీలు, స్వతంత్రులు 173 మంది అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు.
సర్దుబాటైనా.. రెబల్‌గా బీజేపీ:
జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కూటమి పార్టీల పొత్తుల్లో భాగంగా ఆదోని-1, ఆస్పరి, ఎమ్మిగనూరు స్థానాలు జనసేనకు, హాలహర్వి బీజేపీకి సీట్లు కేటాయించారు. టీడీపీ 21 స్థానాల్లో పోటీ చేసింది. అయితే.. కౌతాళం జడ్పీటీసీగా బీజేపీ అభ్యర్థి రామకృష్ణ నామినేషన్ వేశారు. సీట్ల సర్దుబాటులో ఆ స్థానం బీజేపీకి ఇవ్వలేదు. అయినా బీజేపీ నామినేషన్ విత్‌డ్రా చేసుకోకపోవడంతో అక్కడ త్రిముఖ పోరు తప్పడం లేదు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఆయా పార్టీల వారీగా బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు
పార్టీలు జడ్పీటీసీ ఎంపీటీసీ
టీడీపీ 22 337
వైసీపీ 26 349
జనసేన 3 38
బీజేపీ 1 10
కాంగ్రెస్ 12 12
సీపీఐ -- 29
సీపీఎం 1 32
బీఎస్‌పీ 4 9
ఇతరులు 23 91
మొత్తం 97 907
పార్టీల వారీగా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
పార్టీ ఎంపీటీసీ
టీడీపీ 54
వైసీపీ 19
బీజేపీ 1
మొత్తం 74