పోతిరెడ్డిపాడు నుంచి 4 వేల క్యూసెక్కులు విడుదల
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:38 PM
శ్రీశైలం ప్రాజెక్టుకు ఆశాజనంగా వరద చేరుతోంది.
హంద్రీ-నీవాకు రెండు పంపుల ద్వారా 700 క్యూసెక్కులు లిఫ్ట్
శ్రీశైలం డ్యాంకు 2.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జలాశయంలో చేరిన 149.0620 టీఎంసీలు
తుంగభద్రకు తగ్గిన వరద
శ్రీశైలం ప్రాజెక్టుకు ఆశాజనంగా వరద చేరుతోంది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరుగులు పెడుతూ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలను నింపుకుంటూ శ్రీశైలానికి చేరుకుంది. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో డ్యాంలో 149.0620 టీఎంసీలు చేరింది. రాయలసీమ జిల్లా కరువు పల్లెల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ (ఎస్‌ఆర్‌ఎంసీ)కి కృష్ణా జలాలు విడుదల చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు నంద్యాల సర్కిల్ ఎస్‌ఈ శివశంకర్‌రెడి,్డ ఈఈ సుబ్రహ్మణ్యం రెడ్డి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి గేట్లు ఎత్తారు. మొదట రెండు క్యూసెక్కులు విడుదల చేసిన ఇంజనీర్లు క్రమక్రమంగా పెంచుతూ సాయంత్రం ఆరు గంటలకు నాలుగు వేల క్యూసెక్కుల మేర విడుదల చేస్తున్నారు. బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ కాలువ నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. ముందు వెలుగోడు జలాశయం నింపి, ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు మళ్లించనున్నారు. తెలుగు రాష్ట్రాల జీవ వాడి శ్రీశైలం డ్యాంకు స్వల్పంగా వరద తగ్గింది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,16,764 క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. డ్యాం దగ్గర 2,25,901 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో జూరాల నుంచి 2,44,998 క్యూసెక్కులు విడుదల చేస్తే, డ్యాం వద్ద 2,38,613 క్యూసెక్కులు నమోదైంది. బుధవారంతో పోలిస్తే స్వల్పంగా వరద తగ్గింది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 871.70 అడుగుల లెవల్‌లో 149.0620 టీఎంసీలు చేరింది.
కర్నూలు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి)
హంద్రీ-నీవాకు రెండు పంపుల ద్వారా నీటి విడుదల
హంద్రీనీవా ప్రాజెక్టు ప్రధాన లిఫ్ట్ మాల్యాల నుంచి బుధవారం సాయంత్రం ఆ ప్రాజెక్టు కర్నూలు-1 సర్కిల్ ఎస్‌ఈ రాజన్‌బాబు, ఈఈ ప్రసాద్‌రావు తదితరులు ఒక పంప్ ఆన్ చేసి 350 క్యూసెక్కులు ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గురువారం మరో పంపు ఆన్ చేశారు. రెండు పంపుల ద్వారా 700 క్యూసెక్కుల కృష్ణా జలాలు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎత్తిపోస్తున్నారు. కర్నూలు నగర శివారులో 20 కిలోమీటర్లు దాటి కృష్ణా జలాలు సాగిపోతున్నాయి. నీటి ప్రవాహాన్ని ఇంజనీర్లు పరిశీలించారు. క్రమంగా ఐదు పంపులకు పెంచేందుకు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉంది. హంద్రీనీవా కాలువకు ఎత్తిపోతలు చేపట్టడంతో పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాల కోసం 68 చెరువులకు నీటిని ఎత్తిపోసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ శైలేశ్వర్ హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు ఎస్‌ఈకి లేఖ రాసినట్లు సమాచారం.
తుంగభద్రకు తగ్గిన వరద
తుంగభద్ర డ్యాంకు వరద తగ్గింది. బుధవారం ఉదయం 1,00,750 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండేది. గురువారం నాటికి 60,751 క్యూసెక్కులకు పడిపోయింది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 1,633 అడుగులు, సామర్థ్యం 105.780 టీఎంసీలు కాగా బుధవారం 1,621.22 అడుగుల లెవల్‌లో 64.816 టీఎంసీలు నీటి నిల్వ చేరింది. తాగునీటి కోసం కర్ణాటక, ఆంధ్ర ఇండెంట్ మేరకు వివిధ కాలువకు 1,445 క్యూసెక్కులు విడుదల చేయగా, ఏపీ సరిహద్దుల్లో టీబీపీ ఎల్లెల్సీ కాలువలో 350 క్యూసెక్కులు ప్రవాహం కొనసాగుతోంది. డ్యాంలో ఆశాజనకంగా వరద చేరడంతో రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.