3.20 టీఎంసీలకు పులికనుమ
ABN , Publish Date - May 01 , 2026 | 11:09 PM
పశ్చిమ ప్రాంత పల్లెసీమల్లో కరువు దరువేస్తోంది.
1.24 టీఎంసీల నుంచి పెంపు..
గుడేకల్లు ఎత్తిపోతల పథకం కూడా
రూ.657 కోట్లతో ప్రతిపాదనలు
ప్రభుత్వం నిధులిస్తే కరువు పల్లెలకు జలసిరి
53 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం
పశ్చిమ ప్రాంత పల్లెసీమల్లో కరువు దరువేస్తోంది. వానొస్తే పంట.. లేదంటే అప్పులు, వలసలు, ఆకలి మంటలు. ఈ స్థితి మారాలంటే మెట్ట చేలకు సాగునీరు ఇవ్వాలి. తుంగభద్ర జలాలు ఎత్తిపోయాలి. ఈ లక్ష్యంతోనే పులికనుమ జలాశయం సామర్థ్యం 1.24 టీఎంసీల నుంచి 3.20 టీఎంసీలకు పెంచడానికి ఇంజనీర్లు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీనితోపాటు గుడేకల్లు ఎత్తిపోతల పథకానికి, పలు చెరువుల అఽధునికీకరణకు రూ.657 కోట్లు కేటాయించాలని కోరుతున్నారు. వీటి వల్ల 53 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు ఇవ్వవచ్చు. గతంలో కలుగొట్ల సభలో సీఎం చంద్రబాబు ఈ మేరకు హామీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా చూడాలి. ఈ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధాన జలాశయాల్లో పులికనుమ ఒకటి. గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో భాగంగా మండల కేంద్రం కోసిగి, పెద్దకడుబూరు మండలం పులికనుమ గ్రామాల కొండల మధ్యలో 1.243 టీఎంసీల సామర్థ్యంలో పులికనుమ జలాశయం నిర్మించారు. తుంగభద్ర నది నుంచి వరద జలాలు ఎత్తిపోసి, తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) నుంచి రబీ పంటకు సాగునీరు ఇవ్వలేని సమయంలో నీటి తడులు అందించి పంటలను కాపాడాలనే లక్ష్యంతో 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.261 కోట్లు మంజూరు చేసింది. 2009లో వచ్చిన ప్రభుత్వం పనులు మధ్యలోనే ఆపేసింది. రాష్ట్ర విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పులికనుమ జలాశయం, తుంగభద్ర నది ఒడ్డున పంపింగ్ స్టేషన్, పైపులైన్ నిర్మాణం పూర్తి చేసింది. 2018లో రైతులకు అంకితం చేశారు. ఎల్లెల్సీ కాలువ 270 కిలోమీటర్లు దిగువన ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో 26,400 ఎకరాలు గ్యాప్ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. కర్ణాటక రాష్ట్రంలో జల చౌర్యం కారణంగా వాటా జలాలు అందడం లేదు. రూ.వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన పులికనుమ జలాశయం నుంచి పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేని పరిస్థితి ఉంది. తుంగభద్రలో వరద ఉన్నా, అవసరమైన నీటిని ఎత్తిపోసి నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
సీఎం చంద్రబాబు హామీ
ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ పులికనుమ సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఈ జలాశయం సామర్థ్యం 3.20 టీఎంసీలకు పెంచితే అదనంగా 28 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వవచ్చని ఇంజనీర్లు అంచనా వేశారు. అలాగే.. గుడేకల్లు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేస్తే, ఒక టీఎంసీ నీటిని వినియోగించుకుంటే గుడేకల్లు, ఎస్.నాగులాపురం, మాచుమాన్‌దొడ్డి, వెంకటగిరి, కందనాతి, కడివెళ్ల, మసీదుపురం గ్రామాల్లో 20 వేల ఎకరాలకు కొత్తగా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుంది. ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల, పెసలదిన్నె, సోగనూరు, ఏనుగబాల, కొండమ్మ వాగు, పెద్దవాగు వంక, వడ్ల రామయ్య చెరువు, టీఎస్ కుల్లూరు చెరువు, సిరాలదొడ్డి చెరువులకు 0.500 టీఎంసీలు మళ్లించి మరో ఐదు వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వవచ్చు. పులికనుమ జలాశయం సామర్థ్యం 3.20 టీఎంసీలకు పెంచడం ద్వారా ఎల్లెల్సీ కాలువ, గుడేకల్లు ఎత్తిపోతల పథకం, ఆయా చెరువుల కింద దాదాపు 53 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఇందు కోసం 2025-26 ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు ప్రకారం సుమారు గా రూ.657 కోట్లు అవసరమని గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనాలు తయారు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ కావడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
పులికనుమ జలాశయం సామర్థ్యం 1.24 టీఎంసీల నుంచి 3.20 టీఎంసీలకు పెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. తుంగభద్ర వదర జలాలు ఎత్తిపోసి జలాశయంలో నిల్వ చేసి, అక్కడి నుంచి ఎల్లెల్సీ కాలువ 270 కిలోమీటర్లు దిగువన 28 వేల ఎకరాల ఆదనపు ఆయకట్టుకు సాగునీరు అందించే గుడేకల్లు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అట్లాగే మరో పది చెరువులను ఆధునికీకరించి తుంగభద్ర జలాలు మళ్లించడం ద్వారా 25 వేల ఎకరాలు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేలా రూ.657 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. త్వరలోనే కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా ద్వారా ప్రభుత్వానికి పంపుతాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే పశ్చిమ ప్రాంత పల్లెసీమల్లో సాగు, తాగునీరు అందుతుంది. తద్వారా కరువు, వలసలు నివారించే అవకాశాలు ఉన్నాయి.
రామకృష్ణ, డీఈఈ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, ఎమ్మిగనూరు