21 కొత్త, అదనపు కోర్టులు
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:40 PM
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొత్త, అదనపు కోర్టుల ఏర్పాటుకు మంత్రి వర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడింది.
ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకు రంగం సిద్ధం
కృషి చేసిన మంత్రి ఫరూక్
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొత్త, అదనపు కోర్టుల ఏర్పాటుకు మంత్రి వర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 21 కొత్త, అదనపు కోర్టులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖమంత్రిగా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్ కోర్టుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఎన్నడూలేని విధంగా భారీ సంఖ్యలో కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో న్యాయవాద వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
నంద్యాల, క్రైం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా సత్వర న్యాయం, పరిష్కారం కోసం కొత్త కోర్టులు, అదనపు కోర్టులను ఏర్పాటు చేసేందుకు న్యాయశాఖ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో పెండింగ్ కేసుల సంఖ్య ఆధారంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలనా విభాగం) ప్రతిపాదించిన 96 కొత్త, అదనపు కోర్టులను ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది.
ఉమ్మడి జిల్లాలో 21 కోత్త కోర్టుల ఏర్పాటు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో 21 కొత్త, అదనపు కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఇందులో రెండు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు, రెండు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు, 17 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లా సెషన్స్ జడ్జి కోర్టుల్లో ఉమ్మడి జిల్లాలోని కర్నూలులో 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, నంద్యాలలో 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు ఏర్పాటు కానున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 25 సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదోనిలో ఒకటవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఎమ్మిగనూరులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయనున్నారు. అలాగే జూనియర్ సివిల్ జడ్జి కమ్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల ఏర్పాటులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 59 కోర్టుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 21 కోర్టులు మంజూరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో ఆదోనిలో మూడో అదనపు సివిల్ జడ్జి కమ్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లెలో ఒకటవ, డోన్‌లో రెండవ, కర్నూలులో 5,6,7,8వ అదనపు కోర్టులు, నందికొట్కూరులో ఒకటవ, నంద్యాలలో 2,3,4 అదనపు సివిల్ జడ్జి కోర్టులు, పత్తికొండ, ఎమ్మిగనూరులో ఒకటవ అదనపు సివిల్ జడ్జి కోర్టులు, శ్రీశైలంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కానున్నాయి.
పెండింగ్ కేసుల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు
మంత్రి ఫరూక్
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్దేశించిన మేరకు ఐదేళ్లకు మించి ఏ కేసు పెండింగ్‌లో ఉండరాదని, రాష్ట్రంలో పెండింగ్ కేసుల సంఖ్య జనవరి 1,2019 నాటికి 5,308,020 ఉండగా, ఈ సంఖ్య జనవరి 1, 2025 నాటికి 8,93,993కు చేరిందని రాష్ట్ర న్యాయ, సంక్షేమ శాఖమంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. కోర్టుల సంఖ్య మాత్రం నేడు 636 నుంచి 660కి మాత్రమే పెరిగిందని, దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోందన్నారు. ఆర్థిక శాఖ 2026-27కుగాను 100 కోర్టులు ఏర్పాటు చేసేందుకు సమ్మతి తెలిపిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జ్యుడీషియల్ జిల్లాలతోపాటు రానున్న కొత్త జ్యుడీషియల్ జిల్లాల్లో 172 కొత్త, అదనపు కోర్టులు ఏర్పాటు చేసేందుకు హైకోర్టు రిజిస్ట్రార్ ప్రతిపాదన పంపినట్లు చెప్పారు. ఇందులో 96 కోర్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఉమ్మడి కర్నూలు జిల్లాకు 21 కొత్త, అదనపు కోర్టుల మంజూరుతో పెండింగ్ కేసుల పరిష్కారం, సత్వర న్యాయ సేవలు అందనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 96 కోర్టులు, 1730 పోస్టులు మంజూరు చేయడంపై సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రివర్గ సహచరులకు, హైకోర్టుకు మంత్రి ఫరూక్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.