జీడీడీపీలో 15వ స్థానం
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:56 PM
జీడీడీపీలో 15వ స్థానం
జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి రూ.54,452 కోట్లు
పరిశ్రలు, సేవా రంగాలు పర్వాలేదు
వ్యవసాయ రంగం కుదేలు..
జిల్లా తలసరి ఆదాయం రూ.2,00,143
వివిధ రంగాల్లో ఆశాజనంగా పురోగతి
ప్రమాదకర స్థాయిలో బాలికల గర్భధారణ
కర్నూలు జిల్లా పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీడీపీ)లో కర్నూలు జిల్లా రూ.52,820 కోట్లు సాధించింది. తద్వారా రాష్ట్రంలో మన జిల్లా 15వ స్థానంలో నిలిచి పర్వాలేదనిపించింది. గతేడాది రూ.52,820 కోట్లు సాధిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరం రూ.61,746 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవంగా సెప్టెంబరు నాటికి సాధించిన జీడీడీపీ కేవలం రూ.10,338 కొట్లే. ఐదు నెలల్లో రూ.44,114 కోట్లు రాబట్టారు. అంటే.. మొత్తం రూ.రూ.54,452 కోట్లు జీడీడీపీ వృద్ధిరేటు సాధించి రాష్ట్రంలో 15వ ర్యాంక్ దక్కించుకున్నారు. పరిశ్రమలు, సేవా రంగాల్లో పర్వలేదు అనిపిస్తే, వ్యవసాయం రంగం పూర్తిగా కుదేలు కావడంతో 7.88 శాతం వృద్ధిరేటుతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. జిల్లా తలసరి ఆదాయం (పీసీఐ) రూ,2,25,099 సాధించాలని లక్ష్యం పెట్టుకుంటే.. రూ.2,00,143తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. జిల్లా స్థూల ఉత్పాదకత, తలసరి ఆదాయం మెరుగు పురుచుకోవాలంటే ఆయా రంగాల్లో మరింతగా పురోగతి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మంత్రులతో కలసి వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా వివిధ శాఖ అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.
కర్నూలు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఆర్థిక పురోగతి ప్రధాన సూచిక జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ). వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సాధించిన పురోగతిని అంచనా వేసి జీడీడీపీ లెక్కిస్తారు. జీడీడీఏ లక్ష్య సాధనంలో రాష్ట్రంలో 15వ ర్యాంకులో ఉన్నాం. ఐదు నెలల క్రితం 22వ స్థానంలో ఉంటే.. ప్రస్తుతం 15వ ర్యాంకుకు చేరుకుని వృద్ధిరేటు పెరుగు పరుచుకున్నాం. 2022-23 రూ.48,052 కోట్లు, 2023-24లో రూ.47,362 కోట్లు, 2024-25లో రూ.52,820 కోట్లు జీడీడీపీ సాధించాం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.61,746 కోట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.54,452 కోట్లు రాబట్టి 3.74 శాతం వృద్ధిరేటు నమోదు చేసుకోవడం కొసమెరుపు. జిల్లాలో అధిక వర్షాలు, పతనమైన ధరలు కారణంగా జీడీడీపీ లక్ష్య సాధనంలో వ్యవసాయం రంగం కుదేలైంది. వ్యవసాయం, ఉద్యానం, మాంసం, చేపలు, కోళ్ల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థూల విలువ జోడింపు (జీడీవీఏ) లెక్కిస్తారు. ఈ కేటగిరిలో రాబడి భారిగా తగ్గిందనే చెప్పాలి. జీవీఏ 2022-23లో రూ.17,133 కోట్లు వచ్చింది. అతివృష్టి, అనావృష్టి కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతినడంతో ఇప్పటి వరకు రూ.16,670 కోట్లు రాబట్టి 16వ స్థానంలో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.
ఆశాజనకంగా పరిశ్రమలు
పరిశ్రమలు, సేవా రంగాల్లో జీడీవీఏ ఆశాజనకంగా ఉంది. ఈ రంగంలో స్థూల విలువ జోడింపు (జీడీవీఏ) పుంజుకొని జీడీడీపీలో ఆ విభాగాల వాటా గణనీయం గా పెరిగింది. పరిశ్రమల రంగంలో కర్నూ లు నగరంలో ఇండస్ట్రీస్, ఆదోని పట్టణంలోని పత్తి జిన్నింగ్ మిల్లుల ద్వారానే అధికంగా వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇప్పటికే రూ.9,732 కోట్లు రాబ ట్టి రాష్ట్రంలో 15 స్థానంలో ఉంటే.. సేవలు రంగంలో రూ.23,795 కోట్లు రాబ్టారు. గతేడాది రూ.21,226 కోట్లు వచ్చింది. 12.11 శాతం వృద్ధిరేటు నమోదు చేసుకుంది. అదే క్రమంలో జిల్లాకు ఏడు పరిశ్రమలు వచ్చాయి. 74 స్కోర్‌తో బీ గ్రేడ్‌లో ఉంది.
ప్రమాదకర స్థాయిలో యుక్తవయసు బాలికల గర్భధారణ
వైద్య, ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లాలో 16-19 ఏళ్లు మధ్య ఉన్న యుక్తవయసు (టీనేజ్) బాలికలు 12 శాతానికి పైగా గర్భం దాల్చారు. ఇది ప్రమాదకర (క్రిటికల్) స్టేజ్ దాటిందని సమీక్షలో గుర్తించారు. 12 వారాలు గర్భం దాలిస్తే వారిని ఆశా వర్కర్లు మాతా శిశు సంరక్షణ కార్డుల్లో నమోదు చేస్తారు. వాస్తవంగా యుక్తవయసు బాలికల గర్భదారణ 5 శాతం కంటే తక్కువ ఉండాలి. 12 శాతం కంటే ఎక్కువ నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఆదోని, పత్తికొండ, కృష్ణగిరి ప్రాంతాల్లో బాల్య వివాహాలు అధికంగా ఉండడం వల్లే యుక్తవయసు బాలికల గర్భదారణ సంఖ్య పెరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొనడం కొసమెరుపు.
తగ్గిన తలసరి ఆదాయం
వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాలు ద్వారా సాధించే స్థూల విలువ జోడింపు (జీవీఏ), నిఖర పన్నులు (నెట్ టాక్సెస్) ద్వారా వచ్చే రాబడిని జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)గా నిర్ణయిస్తారు. అందులో నికర జిల్లా స్థూల ఉత్పాదకత (జీడీడీపీ) రాబడి ఆధారంగా జిల్లా ప్రజల సలసరి ఆదాయం లెక్కిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీడీపీ రూ.61,746 కోట్లు అంచనా వేసి జిల్లా తలసరి ఆదాయం రూ.2,25,099 అంచనా వేశారు. అయితే.. రూ.2,00,143లతో రాష్ట్రంలో 24 స్థానంలో నిలిచి రెడ్ జోన్‌లో ఉంది.
వివిధ శాఖల పురోగతి ఇలా:
జిల్లాలో 91,426 బంగారు కుటుంబాలు (బీకే) గుర్తిస్తే.. గ్రామ, వార్డు సచివాలయంలో నమోదు చేసుకున్న కుటుంబాలు 1,053 మాత్రం. కేవలం 1.15 శాతం మాత్రమే చేయూత లభించింది.
సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎ్‌సఏ) కింద రూ.85.62 కోట్లతో 713 పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 247 పనులు పూర్తి చేస్తే 393 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. 73 పనులు వివిధ కారణాలు వల్ల మొదలు పెట్టలేదు. 65.36 శాతం పురోగతి నమోదు చేసుకుంది.
జిల్లాలో రూ.1,844 కోట్లలో ఐదు ప్రధాన జాతీయ రహదారుల అనుసంధానం (కనెక్టివిటీ) పనులు చేపట్టారు. 105 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు నిర్మించాల్సి ఉంటే.. 86.86 కిలో మీటర్లు పూర్తి చేశారు. 18.14 కిలో మీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. 18.59 హెక్టార్లు భూ సేకరణ చేశారు.
జిల్లాలో రైల్వే కనెక్టివిటీలో భాగంగా 13 రైల్వే ప్రాజెక్టులు ప్రతిపాదనలు పంపించారు. వాటిలో ఎనిమిది ప్రాజెక్టులు మంజూరు చేయగా, ఐదు ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి.
జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో రూ.211 కోట్లు నిధులు అందుబాటులో ఉంటే, వివిధ అభివృద్ధి పనులకు రూ.192 కోట్లు ఖర్చు చేసి 91 శాతం పురోగతి నమోదు చేసుకున్నారు.
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా 1,150 మందికి ఉపాఽధి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా రూ.291 కోట్లతో జైన్ ఫార్మ ఫ్రెష్‌పుడ్ లిమిటెడ్, 400 మందికి ఉపాధి కల్పించేందుకు రూ.300 కోట్లతో జయాదిత్య ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, 250 మందికి ఉపాధి కల్పించేలా రూ.45 కోట్లతో ఫ్రెష్‌బో హార్టికల్చర్ పరిశ్రమ, 25 మందికి ఉపాధి కల్పించేలా రూ.10 కోట్లతో శ్రీమిత్ర ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ప్రభుత్వంలో ఎంఓయూ చేసుకున్నాయి.
ఎమ్మిగనూరు మండలం బనవాసి జెర్సీ పశు క్షేత్రంలో టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఇక్కడ 77.50 ఎకరాల్లో మౌలిక వసతుల పనులు కూడా మొదలైయ్యాయి.
ఆయా రంగంల్లో 2025-26 జీవీఏ లక్ష్యం, సాధించిన పురోగతి, సాధించాల్సిన లక్ష్యం.. రూ.కోట్లల్లో:
వివరాలు వ్యవసాయం పరిశ్రమలు సేవలు
లక్ష్యం (టార్గెట్) 18,985 11,774 25,927
పెరుగుదల శాతం 18.26 17.68 15.73
సాధించిన లక్ష్యం 16,670 9,732 23,795
ర్యాంక్ 16 15 12
వృద్ధిరేటు 7.88 5.550 12.11