Share News

1.56 లక్షల ఓటర్లు అనర్హులు

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:38 PM

ఎన్నికల తీర్పును తారుమారు చేస్తూ.. అభ్యర్థుల గెలుపోటములను అడ్డగోలుగా శాసిస్తున్న ‘దొంగ ఓట్ల’ దందాపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఉక్కు పాదం మోపింది. మృతిచెందిన, శాశ్వతంగా ఊరు వదిలి వలస వెళ్లిన, రెండు.. అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల అండతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న శక్తులకు బ్రేక్‌ వేసేందుకు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌) ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది.

1.56 లక్షల ఓటర్లు అనర్హులు

చెక్‌ పెట్టిన ‘సర్‌’

మరణించిన వాళ్లు 60 వేలకుపైగా

శాశ్వతంగా ఊరొదిలి వెళ్లినవాళ్లు 50 వేలు

46 వేల మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు

ఇప్పటి వరకు డిజిటలైజేషన్‌ చేసిన ఓటర్లు 19,67,861

రేపటితో ముగుస్తున్న సర్‌.. మిగిలిన గడువు రెండు రోజులే

ఎన్నికల తీర్పును తారుమారు చేస్తూ.. అభ్యర్థుల గెలుపోటములను అడ్డగోలుగా శాసిస్తున్న ‘దొంగ ఓట్ల’ దందాపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఉక్కు పాదం మోపింది. మృతిచెందిన, శాశ్వతంగా ఊరు వదిలి వలస వెళ్లిన, రెండు.. అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల అండతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న శక్తులకు బ్రేక్‌ వేసేందుకు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌) ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. అర్హులైన, నిజమైన ఓటర్లతో నిఖార్సైన ఓటర్ల జాబితా సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యం. సర్‌ ప్రక్రియ ద్వారా విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. భూమిపై లేకపోయినా ఓటర్ల జాబితాలో మాత్రం శాశ్వతంగా మరణించిన ఓటర్ల పేర్లు చలామణిలో ఉన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే 60 వేలకు పైగా మృతులు ఓటర్ల జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డబుల్‌ ఎంట్రీ ఓటర్లు 46 వేలు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు 50 వేలు ఉన్నట్లు గుర్తించారు. అంటే.. ఓటర్ల జాబితా నుంచి శాశ్వతంగా తొల గించే ఓటర్లు 1.56 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. సర్‌ ప్రక్రియకు ఇంకా రెండు రోజుల గడువు ఉంది. మృతులు, పర్మనెంట్‌ షిఫ్ట్‌, డబుల్‌ ఎంట్రీ ఓటర్లు మరింత మంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంటున్నారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాల యం, ఆదోని, పత్తికొండ, ఆలూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ ప్రక్రియ ప్రారంభించే నాటికి జిల్లాలో 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో 2,203 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు ఒక బీఎల్‌వోను నియమించారు. గత నెల 12 నుంచి సర్‌ ప్రక్రియలో బీఎల్‌వోలు, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్‌ఏ సహకారంతో సర్‌ విజయం వంతం చేసేందుకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 7-8 గంటల వరకు పని చేస్తున్నారు. ప్రారంభంలో సర్‌ మందకొడిగా మొదలైంది. పట్టణ ఓటర్లు ఏ మాత్రం బాధ్యతగా ముందుకు వచ్చి సహకారం అందించలేదు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరల్‌ ఖమర్‌లు ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలపై ఒత్తిడి తెచ్చారు. ఎక్కడికక్కడే ఓటర్లలో అవగాహన కల్పించారు. గత వారం పది రోజులగా సర్‌ వేగం పుంజుకుంది. ఆదివారం నాటికి 19,67,861 మంది ఓటర్లను (04.33 ఽశాతం) డిజిటలైజేషన్‌ చేశారు.

మరణించిన ఓటర్లు 60 వేలు

జూన్‌ 12న సర్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబి తాలో ఉన్న అడ్రస్‌ను గుర్తించి 99.99 శాతం అంటే 20,85,943 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపి ణీ చేశారు. అందులో 19,67,861 మంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాల ను బీఎల్‌వోలు తిరిగి స్వీకరించి ఆన్‌లైన్‌లో డిజిటలైజేషన్‌ చేశారు. ఇంకా.. 1,18,258 మంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలు స్వీకరించాల్సి ఉంది. సర్‌ ప్రక్రియలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. ఇన్నాళ్లు ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి మరణించిన ఓటర్లను 60 వేల మందిని గుర్తించారు. అలాగే.. శాశ్వతంగా ఊరు వదిలి వలస వెళ్లిన 50 వేల మంది ఓటర్లను గుర్తించారు. అంతేకాదు.. ఒకే వ్యక్తికి రెండు అంతకంటే ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలు, గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన డబుల్‌ ఎంట్రీ ఓటర్లు 46 వేల మంది ఉన్నారు. అంటే.. సర్‌ ప్రక్రియ తరువాత జాబితా నుంచి శాశ్వతంగా తొలగించే ఓటర్లు 1,53,700 మందిని గుర్తించారు. వీరితో పాటు మరో 57 వేల మంది ఓటర్లు ఎక్కడ ఉన్నారో..? అసలు ఉన్నారో లేరో..? కూడా తెలియదు. వారి అడ్రస్‌లు గుర్తించ లేకపోతున్నారు. వారికి ఫోన్‌ చేసినా సమాధానం రావడం లేదు. రేపటితో సర్‌ ప్రక్రియ ముగుస్తుంది. మిగిలిన గడువు నేటితో రెండు రోజులే. సర్‌ ప్రక్రియను వంద శాతం విజయవంతం చేసి అర్హులైన ఓటర్లు మాత్రమే ఓటు హక్కు కల్పిస్తూ తుది జాబితా సిద్ధం చేయనున్నారు.

సెలవుల్లో కూడా..

జిల్లాలో సర్‌ ప్రక్రియపై ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇంతర జిల్లాలో పోలిస్తే బాగా వెనుకపడ్డారు. ఈ ప్రక్రియలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్న తహసీల్దారు, బీఎల్‌వోను కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి సస్పెండ్‌ చేయడంతో ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోల్లో భయం పట్టుకుంది. నిర్లక్ష్యం వీడి ఓటర్ల ఇంటి వైపు అడుగులు వేశారు. అదే క్రమంలో అర్హులైన వారికి కూడా ఓటు హక్కు కోల్పోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోతామని రాజకీయ పార్టీలు కూడా గుర్తించాయి. ఆయా పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు కూడా బీఎల్‌ఓలకు సంపూర్ణ సహకారం అందించారు. శని, ఆదివారం రెండు రోజులు సెలవు అయినా ప్రత్యేక క్యాంపులు పెట్టి ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలను స్వీరించి డిజిటలైజేషన్‌ చేశారు. దీంతో గత వారం రోజుల్లో వేగం బాగా పెరిగింది. ముఖ్యంగా కర్నూలు నగరంలో పూర్తిగా వెనుకపడ్డారు. విద్యావంతులైన ఓటర్లే ఆసక్తి చూపకపోవడం ఇందుకు ప్రధాన కారణం. నగరపాలక సంస్థ కమిషన్‌ చల్లా ఓబులేసు ప్రత్యేక చొరువ తీసుకున్నారు. మైకుల ద్వారా ఇంటింటి ప్రచారం చేశారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. ఫలితంగా 74 శాతానికి పైగా ఓటర్లను డిజిటలైజేషన్‌ చేశారు. రెండు రోజుల్లోనే 21 వేలు ఎన్యూమరేషన్‌ ఫారాలు స్వీకరించి డిజిటలైజేషన్‌ చేశారు.

విద్యావంతులు అనాసక్తి

గ్రామీణ ప్రాంతాల్లో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లో విద్యావంతులైన ఓటర్లు సర్‌ ప్రక్రియపై ఆసక్తి చూపడం లేదు. కర్నూలు నియోజకవర్గంలో విద్యావంతులు, ఆర్థికంగా స్థిరపడిన బడాబాబులు అత్యధికంగా ఉండే గాయత్రీ ఎస్టేట్‌, ఎల్‌బీఎస్‌ నగర్‌, నాగప్ప నగర్‌, ఠాగూర్‌ నగర్‌, శ్రీరాం నగర్‌, ఎన్‌ఆర్‌ పేట, కొత్తపేట, వెంకటరమణ కాలనీ.. ప్రాంతాల్లో 60-65 శాతానికి మించి ఎన్యూమరేషన్‌ ఫారాలు డిజిటలైజేషన్‌ చేయలేదంటే పరిస్థితి అర్థం అవుతుంది. అదే.. సామాన్యులు, పేదలు ఉండే కాలనీల్లో 81-92 శాతం వరకు డిజిటలైజేషన్‌ చేశారు. ఆదోని, పాణ్యం నియోజకవర్గంలో కూడా విద్యావంతులు ఉండే ప్రాంతాల్లో మందకొడిగా సాగితే, సామాన్యులు ఉండే ప్రాంతాల్లో వేగంగా జరగుతుంది. రేపటితో గడువు ముగుస్తుంది. ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వని ఓటర్లు ఎవరైనా ఉంటే అకాశం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.

అర్హత ఉన్న ప్రతి ఓటరును డిజిటలైజేషన్‌ చేస్తాం - నూరుల్‌ఖమర్‌, జాయింట్‌ కలెక్టర్‌, కర్నూలు:

అర్హులైన ప్రతి ఓటర్లు ఎన్యూమరేషన్‌ పత్రాన్ని స్థానిక బీఎల్‌వోకు అందజేసి డిజిటలైజేషన్‌ చేయడానికి సహకరించాలి. రేపటితో గడువు ముగుస్తుంది. ఈ రెండు రోజుల్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీఎల్‌వోలు కూడా ఎంతో కష్టపడ్డారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పని చేయడం వల్లే 94.33 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి చేయగలిగాం. ఇప్పటి వరకు మరణించిన ఓటర్లు 60 వేలు, పర్మనెంట్‌ షిఫ్టెడ్‌ 50 వేలు, డబుల్‌ ఎంట్రీ ఓటర్లు 46 వేల మందిని గుర్తించాం. అడ్రస్‌ గుర్తించని వారు 57 వేల మంది ఉన్నారు. వారు కూడా ఎక్కడున్నారో గుర్తించి ఎన్యూమరేషన్‌ ఫారాలు స్వీకరించి డిజిటలైజేషన్‌ చేయడానికి మావంతు కృషి చేస్తాం.

Updated Date - Jul 12 , 2026 | 11:38 PM