పోలీసులకు 103 ఫిర్యాదులు
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:32 PM
జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 103 ఫిర్యాదులు వచ్చాయి.
బాధితులకు న్యాయం చేస్తాం : ఎస్పీ
కర్నూలు క్రైం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 103 ఫిర్యాదులు వచ్చాయి. బాధితులు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎస్పీ ఎదుట విన్నవించారు. వచ్చిన ఫిర్యాదుల్లో ప్రధానంగా... తన కుమారుడికి హైదరాబాదులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.4 లక్షలు తీసుకుని కర్నూలు బుధవారపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మోసం చేసిందని నంద్యాల జిల్లా పాములపాడు మండలం జూటూరు గ్రామానికి చెందిన ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కుదువ పెట్టిన బంగారాన్ని డబ్బులు ఇచ్చి వెనక్కు తీసుకుంటానంటే ఆ వ్యక్తి ఇవ్వడం లేదని కర్నూలు ఎన్‌ఆర్ పేటకు చెందిన రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఎంబీఏ చదివిన తన కుమారుడు శశాంక్‌కు నంద్యాలకు చెందిన చందన్ రూ.లక్ష తీసుకుని ఉద్యోగం పేరిట మోసం చేశాడనీ ఆదోనికి చెందిన జయంతి ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు కలిసి ఒక ఇంటిపై రూ.40 లక్షల లోన్ తీసుకున్న తర్వాత కంతులు చెల్లించడం లేదని కర్నూలు తాండ్రపాడు చెందిన ఎస్‌ఆర్‌జీ హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. తన భార్య, ఆరుగురు కుమారులు కలిసి అన్నం పెట్టడం లేదని, ఇంట్లో నుంచి బయటకు గెంటేశారనీ సి.బెళగల్ మండలం కొండాపురం చెందిన తెలుగు చిన్న తిమ్మప్ప అనే వృద్ధుడు ఎస్పీ ఎదుట వాపోయాడు. తన కుమారుడు అభిలాష్‌కు ఆర్‌అండ్‌బీ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని ఒక వ్యక్తి రూ.1.30 లక్షలు తీసుకుని మోసం చేశాడనీ కర్నూలు గార్గేయాపురానికి చెందిన జార్జ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు రామకృష్ణ, శ్రీనివాస్ నాయక్, రమేష్, మస్తాన్‌వలి పాల్గొన్నారు.