Share News

వంద టీఎంసీలు సముద్రం పాలు

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:17 AM

ఉమ్మడి జిల్లాలో రిజర్వాయర్లను నింపుకోకపోవడంతో వంద టీఎంసీల నీరు సముద్రం పాలైందని జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు

వంద టీఎంసీలు సముద్రం పాలు
మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

రిజర్వాయర్లు నింపి ఉంటే నీటికొరత ఉండేది కాదు

ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడాలి

జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

ముగిసిన స్థాయీ సంఘ సమావేశాలు

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో రిజర్వాయర్లను నింపుకోకపోవడంతో వంద టీఎంసీల నీరు సముద్రం పాలైందని జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. గత సంవత్సరం కురిసిన వర్షాలకు రిజర్వాయర్లను నింపుకుని ఉంటే ప్రస్తుతం నీటికొరత ఉండేది కాదని, ఇప్పటికైనా అధికారులు రిజర్వాయర్లను నింపే విష యంలో అలసత్వం వీడాలని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం జడ్పీ మినీ సమా వేశ భవనంలో సీఈవో సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గతేడాది విస్తారంగా వర్షాలు కురిసినా కూడా ఖరీ్‌ఫలో నీరివ్వలేని పరిస్థితిలో ఉన్నారని, కనీసం ఈ రబీకైనా రైతులకు నీరివ్వాలని అన్నారు. నీరు వదిలి నెలవుతున్న 68 చెరువులకు నీరు ఎందుకు వదలలేదని ప్రశ్నించారు. శ్రీశైలంలో 200 టీఎంసీల నీరు వచ్చినప్పుడు ఖరీ్‌ఫలో నీరు ఎందుకు ఇవ్వలేదన్నారు. రెండు జిల్లాలో తాగు నీటి కోసం కేవలం 5టీఎంసీలు సరిపోతుందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అంచనా వేశారని, అలాంటప్పుడు మిగిలిన నీటిని వాడుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించారు. నెల తరువాత వర్షాలు రాకపోతే తాగు, సాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సమా వేశాలకు జిల్లాస్థాయి అధికారులు తప్పకుండా హాజరు కావాలని, కిందిస్థాయి అధికారులు వస్తే సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పలేపోతున్నారన్నారు. జుపాడు బంగ్లా మండలంలోని తంగడంచలో చెరువుకు వేసిన టెండరును తక్షణమే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. మండల కేంద్రాల్లో ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లకుండా బయట నుంచే వెళ్తున్నాయన్నారు. బస్టాండులో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. కోసిగి లోని ఓ పాఠశాలలో ఒక్కో విద్యార్థికి కేవలం ఒక్కగ్లాసు నీరు మాత్రమే ఇస్తున్నారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. స్థాయీ సంఘ సమావేశాలకు రాని జిల్లా అధికారులకు నోటీసులు జారీచేయాలని సీఈవోను ఆదేశించారు. ఐదేళ్ల కాలంలో జరిగిన స్థాయీ సంఘ సమావేశాలకు సహకరించిన అధికారులు, జడ్పీటీసీలకు చైర్మన్‌ అభినందనలు తెలిపారు. సమావేశాలలో సమస్యల పరంగానే జడ్పీటీసీలు అధికారులను ప్రశ్నించారని, వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. జడ్పీటీసీలు సంబంధిత శాఖలపై సమస్యలను వివరించారు. డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి, పరిపాలన అధికారి జితేంద్ర, ఉమ్మడి జిల్లాల అధికారులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

జడ్పీటీసీలు ఏమన్నారంటే కొత్త పింఛన్లు త్వరగా అమలయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలని వెల్దుర్తి జడ్పీటీసీ సుంకన్న అన్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఓర్వకల్లు జడ్పీటీసీ రంగనాథగౌడు అన్నారు. హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స నీటిని జిల్లాకు కాకుండ చిత్తూరు జిల్లాకు తీసుకుపోవడం కారణంగా జిల్లాలో తీవ్రంగా తాగు, సాగు నీటి కొరత ఏర్పడుతుందని కోడుమూరు జడ్పీటీసీ అన్నారు.

నేను బతికే ఉన్నా

పీఎం కిసాన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే తాను చనిపోయినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. తనకు ఐదెకరాల పొలం ఉంది. పీఎం కిసాన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా. అధికారుల రికార్డుల్లో చనిపోయినట్లు ఉన్నందున మరణ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని చెప్పడం విడ్డూరం. బతికున్న ఒక జడ్పీటీసీకే అధికారులు చంపేసారంటే మిగిలిన సామాన్య రైతులు పరిస్థితి ఏమిటి? - మౌలాలి, జడ్పీటీసీ సభ్యుడు, గూడూరు

అధికారులు పట్టించకోకపోవడం దారుణం

తంగడంచచెరువు టెండర్లలో అవకతవకలపై విచారణ చేపట్టాలని గత సమావేశంలో అడిగినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. అర్హత లేని కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం బాధాకరం. డీఈఈ, ఏఈఈలు పచ్చ కండువాలు వేసుకుని దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. కలెక్టర్‌ స్పందించి జరిగిన టెండర్లపై సమగ్ర విచారణ చేపట్టాలి - పోచా జగదీశ్వరరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు, జుపాడుబంగ్లా

Updated Date - Aug 30 , 2026 | 12:17 AM