శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:47 AM
‘పది’ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యా శాఖ సమగ్ర కార్యాచరణకు రూపకల్పన చేసింది. ‘మిషన్ మార్చ్-2027’లో భాగంగా రెండో దశ కింద వంద రోజుల పునశ్చరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయనుంది.
‘మిషన్ మార్చ్-2027’ రెండో దశకు శ్రీకారం
వంద రోజుల పక్కా ప్రణాళిక
‘పది’ విద్యార్థులకు రోజూ స్లిప్ టెస్టులు
డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు
చాగలమర్రి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘పది’ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యా శాఖ సమగ్ర కార్యాచరణకు రూపకల్పన చేసింది. ‘మిషన్ మార్చ్-2027’లో భాగంగా రెండో దశ కింద వంద రోజుల పునశ్చరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయనుంది. డిసెంబరు 1వ తేదీ మార్చి 14వ తేదీ వరకు ఈ ప్రత్యేక షెడ్యూల్ కొనసాగనుంది. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతి ఒక్కరిని పరీక్షలకు సంపూర్ణంగా సన్నద్ధం చేయడమే ఈ ప్రణాళిక లక్ష్యం. ప్రతి రోజు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. నంద్యాల జిల్లాలోని 30 ఉన్నత పాఠశాలల్లో 21,929 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు.
డిసెంబరు 3న తొలి స్లిప్ టెస్టు
భౌతిక శాస్త్రానికి 63 బోధన విడతలు కేటాయించగా, రసాయన చర్యలు, సమీకరణలు, అధ్యాయంతో డిసెంబరు 3న తొలి స్లిప్ టెస్టు ప్రారంభమవుతుంది. రసాయన సమీకరణల సమతూల్యం, రేఖాచిత్రాల సాధనకు రోజు ప్రాధాన్యం ఇవ్వాలి. మూల్యాంకన ఛట్రానికి అనుగుణంగా కేవలం కంఠస్థ విద్యకే పరిమితం కాకుండా ఆలోచన, విశ్లేషణ, ప్రశ్నించే సామర్థ్యం, అనువర్థిత పరిజ్ఞానం పెంపొందించే ప్రశ్నలపై విద్యార్థులను సిద్ధం చేయాలని అధికారులు సూచించారు
తప్పులను సరిదిద్దేందుకు..
ఆదివారాలు, రెండో శనివారాల్లో సైతం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. గత పరీక్షల్లో విద్యార్థులు చేసిన తప్పులను సరిదిద్ధేందుకు ఉదయం ప్రత్యేక బోధన చేస్తారు. సాయంత్రం 20 మార్కులకు స్లిప్ టెస్ట్ నిర్వహించి విద్యార్థుల ప్రగతిని అంచన వేస్తారు.
రెండు వర్గాలుగా విభజించి శిక్షణ
ఫార్మెటివ్ అసె్‌సమెంట్-2 పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్థులను రెండు వర్గాలుగా విభజించి శిక్షణ అందిస్తారు. షైనింగ్ స్టార్స్ (60శాతం పైగా మార్కులు) విశ్లేషణాత్మక అనువర్తిత ప్రశ్నలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రైజింగ్ స్టార్స్ (60శాతం కంటే తక్కువ మార్కులు) ప్రాథమిక అంశాలపై పట్టు సాధించేలా ప్రత్యేక బోధన అందిస్తారు. వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయులు నిరంతర పర్యావేక్షణ చేపడతారు. స్లిప్‌టెస్ట్, ప్రశ్నా పత్రాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల విభాగం అందించిన నమూనాలు, ప్రశ్నల సరళి ఆధారంగా ఉపాధ్యాయులే రూపొందించాలి. పరీక్షలు పూర్తయిన 24గంటల లోపు మూల్యాంకనం చేసి మార్కులను నమోదు చేయడం, లీప్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
పరీక్షల భయాన్ని తొలగించి..
విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బలహీన విద్యార్థులకు అదనపు సహకారం, ప్రతిభావంతులకు ఉన్నతస్థాయి ప్రశ్నల సాధన అందించాలి. క్రమశిక్షణతో కూడిన పునశ్ఛరణ, నిరంతరం మూల్యాంకనం, వ్యక్తిగత మార్గదర్శకత్వం, సమన్వయంతో పది ఫలితాల్లో సరికొత్త ప్రమాణాలు సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకు సాగుతోంది.
ప్రణాళికతో ఎంతో ఉపయోగం
మంచి మార్కులతో అందరూ పాస్ కావడానికి నిర్వహిస్తున్న వంద రోజుల ప్రణాళిక ఎంతో ఉపయోగకరంగా ఉంది. నిత్యం చదువుపైనే దృష్టి పెడతాం. రోజు జరిగే పరీక్షల నిర్వహణతో ఏ సబ్జెక్టులో వెనుకబడ్డామో తెలిసిపోతుంది. - అర్ఫాన, పది విద్యార్థిని, కేజీబీవీ
పక్కాగా ప్రణాళిక అమలు
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళిక తయారు చేశాం. ప్రతి విద్యార్థిని ఉత్తీర్ణత సాధించడంతో పాటు అత్యధిక మార్కుల సాధన కోసం చదివిస్తూ పరీక్షలు నిర్వహిస్తాం. - స్వప్న, ఎస్‌వో, కేజీబీవీ, చాగలమర్రి
ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా..
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు రెండో విడత కార్యాచరణకు సిద్ధం చేశాం. ప్రణాళికాబద్ధంగా చదివించేలా చూస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా చూస్తాం. - న్యామతుల్ల, ఎంఈవో, చాగలమర్రి