వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:33 AM
ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచ రణను సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రత్యేక ఆదేశాలిచ్చింది.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి
ప్రతి పాఠశాలకు ఒకరికి బాధ్యతలు
281 మంది అధికారుల నియామకం
చాగలమర్రి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచ రణను సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రత్యేక ఆదేశాలిచ్చింది. దీనిపై కలెక్టర్ రాజకుమారి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి హైస్కూల్‌కు ఒక మండలస్థాయి గెజిటెడ్ అధికా రులను పర్యవేక్షకులుగా నియమించారు. మొత్తం 281మందిని కేటాయించారు. ఇప్ప టికే డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో పాఠశాలలను సందర్శిస్తున్నారు. వీరితో పాటు పర్యవేక్షణాధికారులుగా నియమితులైన వారు పాఠశాలలకు వెళ్లి మార్గనిర్దేశం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 25,449 మంది విద్యార్థులు..
జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, జెడ్పీహెచ్‌ఎ్‌సల్లో 25,449 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక తరగతులు, విద్యార్థుల హాజరును ప్రత్యేక అధికారులు పర్యవేక్షించనున్నారు. ప్రత్యేకతరగతులకు గైర్హాజరవుతున్నవారిని గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రతి రోజు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూడాల్సి ఉంది. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో లోపాలు గుర్తించాలి. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరి గణించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
రోజువారిగా మండలస్థాయి అధికారులతో నిర్వహించే టెలి కాన్ఫరెన్స్‌ల్లో పదోతరగతి పిల్లల విషయం ప్రస్తావిస్తూ అధికారులను అలర్టు చేస్తున్నారు.
వారానికి రెండుసార్లు సందర్శించాలి
పర్యవేక్షణాధికారులుగా నియమితులైన అధికారులు వారానికి కనీసం రెండుసార్లు పాఠశాలలను సందర్శించి పిల్లల్లో స్పూర్తిని నింపాలి. విద్యాపరంగా వెనుకబడిన వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమీక్షించి విద్యార్థుల ప్రతిభ ప్రగతిని తెలుసుకోవాలి.ప్రత్యేక తరగతులు, సందేహ నివృత్తి తరగతులు నిర్వహించేలా చూడాలి.
అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు
పదో తరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులతో 100శాతం ఉత్తీర్ణత సాధించేలా అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. 100 రోజుల ప్రణాళిక అమలు ద్వార విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారికి సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు.
- న్యామతుల్ల, ఎంఈవో-2, చాగలమర్రి
ప్రణాళిక ప్రకారం బోధన
విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రణాళిక ప్రకారంగా బోధన చేస్తున్నాం. పదోతరగతిలో విద్యార్థుల వారి ప్రతిభ ఆధారంగా గ్రేడ్‌లుగా విభజించి వారికి శిక్షణ ఇస్తున్నాం. - జనార్దన్‌రెడ్డి, డీఈవో, నంద్యాల