వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం: కలెక్టర్
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:44 PM
వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం: కలెక్టర్
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అక్షరాంధ్ర కార్యక్రమం రెండో దశ కొనసాగుతోంది. ఈ దశలో కర్నూలు జిల్లాలో 1,89,571 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అక్షరాస్యత కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్షరాంధ్ర కార్యక్రమం మూడో దశను ఏప్రిల్ 2027 నుంచి సెప్టెంబరు వరకు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ దశలో మిగిలిన నిరక్షరాస్యులందరినీ గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. 2027 సెప్టెంబరులో అక్షరాస్యత మూల్యాంకన పరీక్ష నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అధికారులను ఉద్దేశించి క్షేత్రస్థాయిలో అర్హులైన నిరక్షరాస్యులను గుర్తించి వలంటీర్లతో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. అక్షరాంధ్ర యాప్‌లో నమోదు డేటా వెరిఫికేషన్, మ్యాపింగ్ ప్రక్రియను 2026 నవంబరు 25లోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతి నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.