పులికనుమ నుంచి 0.583 టీఎంసీలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:00 AM
జల్ జీవన్ మిషన్‌లో భాగంగా పులికనుమ జలాశయం నుంచి తాగునీటి కోసం ప్రభుత్వం 0.583 టీఎంసీలు కేటాయిస్లూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాగునీటి కోసం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తుంగభద్ర నుంచి ఎత్తిపోయడానికి రూ.200 కోట్లు అవసరం
జలాశయాన్ని పరిశీలించిన సీఈ కబీర్‌బాషా, ఇంజనీర్లు
కర్నూలు/కోసిగి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): జల్ జీవన్ మిషన్‌లో భాగంగా పులికనుమ జలాశయం నుంచి తాగునీటి కోసం ప్రభుత్వం 0.583 టీఎంసీలు కేటాయిస్లూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నీటిని తుంగభద్ర నది నుంచి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయాలంటే సుమారుగా రూ.200 కోట్ల నిధులు కావాలి. టీబీపీ ఎల్లెల్సీ ఆయకట్టుకు సాగునీటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే జల్ జీవన్ మిషన్ నుంచి నిధులు మంజూరు చేసి అదనపు పైపులైన్ నిర్మించాలి. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా జలవనరుల శాఖ ప్రాజెక్టుల సీఈ కబీర్‌బాషా, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఈఈ మల్లికార్జునరెడ్డి, ఎఫ్‌ఆర్‌ఎల్ డివిజన్ ఈఈ విజయరాజు, డీఈఈలు రామకృష్ణ, శివప్ప పులికనుమ జలాశయం, తుంగభద్ర నది ఒడ్డున పంప్ హౌస్ పనులను పరిశీలించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో జరిగిన మీ భూమి - మీ హక్కు గ్రామ సభ లో జలాశయం సామర్థ్యం 3.20 టీఎంసీలకు పెంచుతామని హా మీ ఇచ్చారు. భవిష్యత్తులో తాగు, సాగునీటికి ఎలాం టి ఇబ్బం దులు రాకుండా ఉండాలంటే సామర్థ్యం పెంచడమే ఉత్తమని ఇంజనీర్లు అంటున్నారు. రెండు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని సీఈ కబీర్‌బాషా అంధ్రజ్యోతికి తెలిపారు.
జిల్లాలో మండల కేంద్రం కోసిగి, పెద్దకడుబూరు మండలం పులికనుమ గ్రామాల మధ్య గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో భాగంగా 1.243 టీఎంసీల సామర్థ్యంతో పులికనుమ జలాశయం నిర్మించారు. తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) ఆయకట్టుకు రబీ సీజన్‌లో నీటి తడులకు ఇబ్బందులు వస్తే, ఎల్లెల్సీ 270 కిలోమీటర్లు దిగువన ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో 26,400 ఎకరాల ఆయకట్టుకు నీటి తడులు అందించడం పులికనుమ ప్రధాన లక్ష్యం. కేవలం సాగునీటి కోసమే ఈ రిజర్వాయర్ నిర్మించారు. అయితే.. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాల కోసం 0.583 టీఎంసీలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రాజెక్ట్ డిజైన్ మేరకు ఉన్న నీటిలో తాగునీరు కేటాయిస్తే, సాగునీటి ఇబ్బందులు వస్తాయి. సాగు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తుంగభద్ర నది నుంచి అదనంగా 0.600 టీఎంసీలు ఎత్తిపోసేందుకు వీలుగా పంప్ హౌస్, పైపులైన్ నిర్మించాల్సి ఉంది. ఇందు కోసం రూ.200 కోట్లు అవసరం అవుతాయని అంచనా. అయితే.. ఫిబ్రవరి 6న ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో జరిగిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు ఈ జలాశయం సామర్థ్యం 3.20 టీఎంసీలకు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అది జరగాలంటే జలాశయం మట్టి ఆనకట్టలు ఏడు మీటర్లుకు పైగా పెంచాలి. అదనంగా ఒక టీఎంసీ ఎత్తిపోయడానికి పంప్ హౌస్, పైపులైన్ల నిర్మాణం కోసం 2025-26 ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు ప్రకారం సుమారుగా రూ.657 కోట్లు కావాలని ప్రాథమిక అంచనా వేశారు. సామర్థ్యం పెంచడం వల్ల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సీఈ కబీర్ బాషా నేతృత్వంలో ఇంజనీర్లు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించారు. పులికనుమ జలాశయం, తుంగభద్ర నదిలో నీటి లభ్యత, పంప్ హౌస్, పైపులైన్ నిర్మాణానికి ఉన్న అవకాశాలు పరిశీలించారు. తక్కువ వ్యయంతో ఎక్కువ జల ప్రయోజనాలు అందించేలా సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతాయని సీఈ కబీర్‌బాషా తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఈఈలు మల్లికార్జునరెడ్డి, విజయ్‌రాజు, డీఈఈలు రామకృష్ణ, శివప్పలతో పాటు స్థానిక జేఈలు, ఏఈలు, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.