Share News

ప్రత్యక్ష పద్ధతిలో పరిషత్‌ పోరు?

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:24 PM

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించేందుకు అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే గుర్తించిన బ్యాలెట్‌ బాక్స్‌ల కంటే అదనంగా సమకూర్చుకోవాల్సి వస్తుంది.

ప్రత్యక్ష పద్ధతిలో పరిషత్‌ పోరు?

జడ్పీ చైర్మన్‌, ఎంపీపీ పదవులకు ఎన్నికల నిర్వహణపై కసరత్తు

సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం

నంద్యాల జిల్లాలో 28, కర్నూలులో 25 మండల పరిషత్‌లు

నంద్యాలకు కొత్తగా జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు

ఉద్యోగుల సర్దుబాటుకు సిద్ధం

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించేందుకు అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే గుర్తించిన బ్యాలెట్‌ బాక్స్‌ల కంటే అదనంగా సమకూర్చుకోవాల్సి వస్తుంది. పార్టీ గుర్తులతో నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రాజకీయ పార్టీలు సవాల్‌గా తీసుకుంటాయి. ఎంపీపీ, జడ్పీ చైర్మన్లను ప్రత్య క్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తే క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానుంది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ అభ్యర్థులకు వేర్వేరుగా ుగా ఓట్లు వేసే సమయంలో క్రాస్‌ ఓటింగ్‌ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

శిరివెళ్ల, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతోపాటు గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్లను ఎన్నుకునేందుకు కూటమి ప్రభు త్వం ఇటీవలే అసెంబ్లీలో తీర్మానించింది. ఇదే బాటలో జడ్పీ చైర్మన్‌, ఎంపీపీ పదవులకు సైతం నేరుగా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రతి ఓటరు.. ఎంపీటీసీ అభ్యర్థికి ఒక ఓటు, ఎంపీపీకి, జడ్పీటీసీకి, జడ్పీ చైర్మన్‌కు ఒక ఓటు చొప్పున మొత్తం నాలుగు ఓట్లు వేయాల్సి ఉంటుంది. పోలింగ్‌ నిర్వహణ, బ్యాలె ట్‌ బాక్స్‌ల ఏర్పాటు, సాంకేతిక అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

24న ముగియనున్న పదవీ కాలం

ఉమ్మడి జిల్లా పరిషత్‌ పరిధిలోని జడ్పీ పాలకవర్గంతో పాటు ఎంపీటీసీల పదవీకాలం ఈనెల 24వ తేదీన ముగియనుంది. కొత్త జిల్లాలకు జడ్పీ కార్యాలయాల ఏర్పాటు, ఉద్యోగుల సర్దుబాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 53 మండలాలుండగా 53మంది జడ్పీటీసీలు, 807 మంది ఎంపీటీసీ స్థానాలు న్నాయి. కర్నూలు జడ్పీ పరిధిలోకి వచ్చే 25 మండల పరిషత్‌లలో 430 మంది ఎంపీటీసీ స్థానాలకు, కొత్తగా ఏర్పాటు కానున్న నంద్యాల జడ్పీ పరిధిలోకి వచ్చే 28 మండల పరిషత్‌లలో 377 మంది ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అధికారుల ఏర్పాట్లు

పల్లె పోరుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పంచాయతీల పరిధిలో ఓటర్ల తుది జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణనను ఇప్పటికే పూర్తి చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు.

ఆయా జిల్లాల వారీగా..

ఉమ్మడి జిల్లాలో మొత్తం 23,34,866 మంది ఓటర్లను గుర్తించారు. నంద్యాల జిల్లాకుగాను 28 మండలాలు, 489 గ్రామ పంచాయతీలున్నాయి. మొత్తం ఓటర్లు 10,84,704 కాగా ఇందులో ఎస్సీ ఓటర్లు 2,34,535 మంది, ఎస్టీలు 33,831, బీసీలు 5,92,107, ఓసీలు 2,24,231 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,244 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు 6,099 బ్యాలెట్‌ బాక్సులు అవసరమవుతాయని అధికారులు లెక్కించారు.

కర్నూలు జిల్లా పరిధిలోకి రానున్న 25 మండల పరిషత్‌లు, 484 గ్రామ పంచాయతీల్లో మొత్తం 12,50,162 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 2,33,863 మంది, ఎస్టీలు 17,119, బీసీలు 9,05,589, ఓసీలు 93,591 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకుగాను 5,096 పోలింగ్‌ కేంద్రాల్లో 6,067 బ్యాలెట్‌ బాక్సులు అవసరమవుతాయని గుర్తించారు.

ఉమ్మడి పాలనకు వీడ్కోలు

1959, డిసెంబరులో ఏర్పాటైన కర్నూలు జిల్లా పరిషత్‌ నుంచి ఉమ్మడి పాలన తుది అంకానికి చేరుకుంది. దివంగత మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి మొట్టమొదటి జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి జిల్లాకు చివరి చైర్మన్‌గా ఎర్రబోతుల పాపిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 16మంది కర్నూలు జడ్పీ చైర్మన్లుగా సారథ్యం వహించారు. ప్రస్తుత కర్నూలు జడ్పీ కార్యాలయంలో దాదాపు వంద మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. నంద్యాలలో కొత్తగా జడ్పీ ఏర్పాటు కానుండడంతో ఇక్కడి నుంచి దాదాపు 55మంది సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు నంద్యాల జిల్లాకు జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు కొత్తగా రానున్నాయి.

Updated Date - Sep 15 , 2026 | 11:24 PM