Share News

రెవెన్యూలో భూ బకాసురులు

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:59 PM

రెవెన్యూ శాఖలో భూ బకాసురులు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే కబ్జాలు చేస్తున్నారు.

రెవెన్యూలో భూ బకాసురులు

ప్రభుత్వ భూమి కబ్జా

ప్లాట్లు వేసి విక్రయాలు

ఉన్నతాధికారుల అండదండలు

ఆదోని, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖలో భూ బకాసురులు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే కబ్జాలు చేస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారం అనుకుంటే పొరపాటే. ఆదోని పట్టణంలోని మండగిరి పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిని అనుకొని ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోంది. ప్రభుత్వ వంక పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి రెవెన్యూ శాఖలోని ఓ అధికారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరలేపాడు. ఈఅంశం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

కింది స్థాయి సిబ్బందితో పాటు..

ఈ భూమి కబ్జా వెనుక కిందిస్థాయి సిబ్బందితో పాటు కొందరు ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. మండగిరి పంచాయతీ పరిధిలో హైవే రోడ్డును అనుకుని ఉన్న సర్వేనంబర్‌ 574లోని ప్రభుత్వ వంక పోరంబోకు స్థలాన్ని కొందరు అక్రమంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అనుమతుల్లేకుండా..

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతుల్లేకుండా ఏకంగా 30 అడుగుల రోడ్డు వేసి ఆ స్థలాన్ని 24 ప్లాట్లుగా విభజించారు. ఈ అక్రమ ప్లాట్లను ఆదోనిలోని ఆర్థికంగా బలమైన కొద్దిమంది బడాబాబులు, ధనవంతులకు విక్రయించి తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున గడించేందుకు ప్లాన్‌ వేసినట్లు సమాచారం.

దీని వెనుక పెద్ద నెట్‌వర్కే..

ఈ రియల్‌ ఎస్టేట్‌ దందా కేవలం ఒక వ్యక్తితో కాదు దీని వెనుక పెద్ద నెట్‌వర్కే పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కొందరు ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం వస్తుండడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ స్థలంలో ఇష్టానుసారంగా రోడ్లు వేసి ప్లాట్లు చేస్తుంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న పెద్దలు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుకవారి అండదండలున్నాయనే విమర్శలున్నాయి.

గతంలో పనిచేసిన..

గతంలో ఆదోని మండలంలో పనిచేసిన కొందరు తహసీల్దార్ల సంతకాలతోనే ఈ స్థలానికి సంబంధించిన పట్టాలిచ్చినట్లు సమాచారం. అధికారిక రికార్డులను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా జరిపిన ఈ బాగోతంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

కాపాడాల్సిన వారే.. కబ్జాలకు పాల్పడితే..

ప్రభుత్వ భూములను, వాగులు, వంకలు, పో రంబోకు స్థలాలను కాపాడాల్సిన బాధ్యత రెవె న్యూ అధికారులే కబ్జాలకు పాల్పడటం విడ్డూరం. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం చట్టరీత్యా నేరం. వంకలు, వాగులు, చెరువు శిఖాలు వంటి ప్రభుత్వ భూముల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు లేదా లేఅవుట్లు వేయడానికి నిబంధనలు పూర్తిగా వ్యతిరేకిస్తాయి. ఇవి భవిష్యత్‌లో వరద నీటి ప్రవాహానికి లేదా ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సినవి. రెవెన్యూ శాఖలో పనిచేసే అధికారే ఈ అక్రమ లేఅవుట్‌కు తెరలేపడంపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై కలెక్టర్‌, రెవెన్యూ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సరన్వే నంబర్‌ 574లోని స్థలంపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

సర్వేనంబర్‌ 574లో ప్రభుత్వ భూమిని ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. అలాంటివి ఎవరూ కొనుగోలు చేయొద్దని గతంలోనే చెప్పాం. నా దృష్టికి కూడా వచ్చింది. విజిట్‌ చేసి చూశాను. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసి ఉంటే సంబంధిత వ్యక్తి నుంచే వాపసు తీసుకోవాలి. రెవెన్యూ వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు.

శేషఫణి, తహసీల్దార్‌, ఆదోని

Updated Date - Aug 16 , 2026 | 11:59 PM