tdp, ycp leaders fight
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:48 AM
అక్రమ ఇసుక రగిల్చిన చిచ్చు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అనుచరులతో వెళ్లి టీడీపీ కార్యకర్త ఇంటిని ముట్టడించడం ఘర్షణకు మరింత ఆజ్యం పోసింది. టీడీపీ కార్యకర్తలు తిరగబడటంతో ఇరువర్గాల మధ్య వివాదం ముదిరి రాళ్ల వర్షం కురిసేదాకా వెళ్లింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే సోదరుడికి గాయాలు కాగా, టీడీపీ మండల కన్వీనర్ వాహనాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు.
కర్నూలు/చిప్పగిరి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): అక్రమ ఇసుక రగిల్చిన చిచ్చు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అనుచరులతో వెళ్లి టీడీపీ కార్యకర్త ఇంటిని ముట్టడించడం ఘర్షణకు మరింత ఆజ్యం పోసింది. టీడీపీ కార్యకర్తలు తిరగబడటంతో ఇరువర్గాల మధ్య వివాదం ముదిరి రాళ్ల వర్షం కురిసేదాకా వెళ్లింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే సోదరుడికి గాయాలు కాగా, టీడీపీ మండల కన్వీనర్ వాహనాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. ఇద్దరి వ్యక్తుల మధ్య వాగ్వాదంతో మొదలై అనుచరులతో ఎమ్మెల్యే రావడంతో గ్రామంలో అశాంతికి ఆజ్యం పోసింది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లు, సంగాల జంట గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు అక్రమంగా ఇసుకను డంప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నేమకల్లు చెందిన వైసీపీ నాయకుడు గిరి, టీడీపీ నాయకుడు గురునాథ్ మధ్య వాగ్వాదం జరిగింది. తమకు సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని ఎందుకు నిందిస్తావని టీడీపీ నాయకులు గురునాథ్, సుధాకర్, నాగరాజు నిలదీసినట్లు గ్రామస్థులు తెలిపారు. అయితే.. తన ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి వచ్చారని, తనను రక్షించాలని వైసీపీ నాయకుడు గిరి ఆలూరు ఎమ్మెల్యే బి.విరుపాక్షికి ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. తమ కార్యకర్త నుంచి ఫోన్ రాగానే నిజనిజాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు శ్రీరాములు, కుమారుడు చంద్రశేఖర్‌లతో సహా మరో వంద మంది కార్యకర్తలతో కలిసి వాహనాల్లో నేమకల్లు, సంగాలకు చేరుకున్నారని, వివాదానికి దారి తీసిన పరిస్థితులు విచారించకుండా.. ఏకంగా టీడీపీ నాయకులు గురునాథ్ ఇంటికి చేరుకున్నాడని, ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. అదే క్రమంలో మాటామాటా పెరిగి ఇరువర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నారు. కొద్ది సేపు ఆకాశంలో రాళ్ల వర్షం కురిసింది. ఈ గొడవల్లో ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చేతికి రాళ్లు తగిలి చేయి విరిగినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం తెలుసుకున్న ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి, సిబ్బంది నేమకల్లు సంగాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే విరుపాక్షి తన అనుచరులతో తిరిగి వెళ్తుండగా.. అదే సమయంలో టీడీపీ మండల కన్వీనర్ కొండా పురుషోత్తం వాహనం ఎదురుగా రావడం, వైసీపీ కార్యకర్తలు ఆ వాహానాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ సమయంలో వాహనంలో కొండా పురుషోత్తం లేరని సమాచారం. కాగా వైసీపీ కార్యకర్త నుంచి తనపై దాడి చేస్తున్నారని ఫోన్ రాగానే ఎమ్మెల్యేగా తక్షణమే పోలీసులకు పోన్ చేసి తన కార్యకర్తకు రక్షణ కల్పించమని కోరాల్సిన ఎమ్మెల్యే ఏకంగా అనుచరులతో వెళ్లి టీడీపీ నాయకుడి ఇంటిని ముట్టడించి దౌర్జన్యానికి దిగడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ప్రజాప్రతినిధిగా పోలీసు విధులు కూడా తమ చేతుల్లోకి తీసుకోవడం ఎంత వరకు సమంజసం అంటూ పలువురు నిలదీస్తున్నారు. అంతేగాకుండా ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని తమపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలని చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగడం కొసమెరుపు. నేమకల్లు సంగాలలో జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని, ఘర్షణకు కారకులపై కేసులు నమోదు చేస్తామని సీఐ రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు