Share News

రామనవమికి రాజమార్గం

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:49 AM

వెస్ట్‌ బైపాస్‌పై పూర్తిస్థాయిలో రాకపోకలు సాగించడానికి వీలుగా ఎన్‌హెచ్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామనవమి నుంచి పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు.

రామనవమికి రాజమార్గం

పూర్తిస్థాయిలో సిద్ధమైన వెస్ట్‌ బైపాస్‌

జక్కంపూడి వద్ద ఆర్వోబీ మినహా అంతా పూర్తి

శ్రీరామనవమి నుంచి రాకపోకలకు అనుమతి

ఇటు ఏలూరు, అటు గుంటూరు నుంచి అమరావతికి అనుసంధానం

కృష్ణానదిపై 3 కిలోమీటర్ల వంతెన ప్రత్యేకం

వెదురుపావులూరు, వెంకటపాలెం వద్ద టోల్‌ప్లాజాలు

గొల్లపూడి దగ్గర ఎన్‌హెచ్‌-65కు అనుసంధానం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వెస్ట్‌ బైపాస్‌పై పూర్తిస్థాయిలో రాకపోకలు సాగించడానికి వీలుగా ఎన్‌హెచ్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామనవమి నుంచి పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు. అప్పటికి ప్యాకేజీ-3లో చిన అవుటపల్లి దగ్గర ల్యాండింగ్‌ పోర్షన్‌ను, ప్యాకేజీ-4లో కాజా దగ్గర ల్యాండింగ్‌ పోర్షన్‌ పనులను పూర్తి చేయనున్నారు. ప్యాకేజీ-3లో జక్కంపూడి దగ్గర ఆర్వోబీ శ్లాబ్‌ మినహా మొత్తం బైపాస్‌ సిద్ధం కానుంది. కోర్టు కేసు కారణంగా దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సర్వీసు రోడ్లు ఉంటాయి కాబట్టి రాకపోకలకు ఇబ్బంది ఉండదు. దీంతో విజయవాడ నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్‌ సమస్యలు దాదాపు తొలగనున్నాయి.

రాజసంగా రెడీ

వెస్ట్‌ బైపాస్‌ రాజసంగా సిద్ధమైంది. ఆరు వరసల నిర్మాణంతో మొత్తం 47 కిలోమీటర్ల విస్తీర్ణంలో చిన అవుటపల్లి నుంచి కాజా వరకు ఇది కొనసాగుతుంది. కాజా-విజయవాడ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగంగా 2 ప్యాకేజీల కింద దీనిని మొదలుపెట్టారు. చిన అవుటపల్లి దగ్గర మొదలై మర్లపాలెం, గన్నవరం, బీబీ గూడెం, కొండపావులూరు, ముస్తాబాద, సూరంపల్లి, నున్న, పాతపాడు, నైనవరం, జక్కంపూడి, గొల్లపూడి వరకు ప్యాకేజీ-3, గొల్లపూడి, సూరాయపాలెం, వెంకటపాలెం, నవులూరు, మంగళగిరి, కాజా వరకు ప్యాకేజీ-4 ఉంటుంది. గ్రేటర్‌ విలీన ప్రతిపాదిత ప్రాంతాల మీదుగా సాగుతూ అమరావతి మీదుగా కాజా దగ్గర ఎన్‌హెచ్‌-16తో అనుసంధానమవుతుంది. మర్లపాలెం, గొల్లపూడి దగ్గర రెండు భారీ ఫ్లై ఓవర్లను నిర్మించారు. ఇవికాకుండా 20 వరకు ఆర్వోబీలు, వీయూపీలు ఉన్నాయి. ప్యాకేజీ-4లో భాగంగా కృష్ణానదిపై 3 కిలోమీటర్ల ఆరు వరసల వంతెన నిర్మించారు. గొల్లపూడిలో ఎన్‌హెచ్‌-65తో అనుసంధానం అవుతుంది. రాజధాని అమరావతిలో ఈ1 నుంచి ఈ16 రోడ్లతో పాటు ఎన్‌1 నుంచి ఎన్‌18 రోడ్లను అనుసంధానం చేస్తుంది. కాజా దగ్గర ఎన్‌హెచ్‌-16ను అనుసంధానించడంతో అటు ఏలూరు వైపు నుంచి, ఇటు గుంటూరు వైపు నుంచి రాజధానికి రాకపోకలు సాగించవచ్చు. ఈ మార్గంలో రెండు టోల్‌ప్లాజాలను నిర్మించారు. ప్యాకేజీ-3లో వెదురుపావులూరు దగ్గర, ప్యాకేజీ- 4లో వెంకటపాలెం దగ్గర టోల్‌ప్లాజాలను నిర్మించారు.

Updated Date - Mar 21 , 2026 | 12:49 AM