చెరువులకు నీరు
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:50 AM
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చెరువులు నింపడానికి జలవనరుల శాఖ అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటివరకు వేసవికి కేటాయించిన నీటిలెక్కలను పరిశీలించి ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు.
ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదలకు సన్నాహాలు
4 వేల క్యూసెక్కులు వదలాలని నిర్ణయం
తాగునీటి అవసరాలకు అధికారుల లెక్కలు
పులిచింతల నుంచి 2,400 క్యూసెక్కుల విడుదల
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చెరువులు నింపడానికి జలవనరుల శాఖ అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటివరకు వేసవికి కేటాయించిన నీటిలెక్కలను పరిశీలించి ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని చెరువులకు ఏ మేరకు నీరు అవసరమవుతుందో తెలియజేయాలని గ్రామీణ నీటిపారుదల శాఖకు జలవనరుల శాఖ అధికారులు లేఖ రాశారు. ఏయే చెరువుకు ఎంత మొత్తంలో నీరు కేటాయించాలన్న దానిపై మండలాలవారీగా కేటాయింపుల లెక్కలు తీసుకుంటున్నారు.
నికరం 4 వేల క్యూసెక్కులు
జిల్లాలో చెరువులను నింపడానికి 15 రోజులు నీటిని విడుదల చేస్తారు. మొత్తం చెరువులు నిండడానికి 4 వేల క్యూసెక్కుల నీరు అవసరమవుతుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 285, ఏలూరు జిల్లాలో 150 చెరువులు ఉన్నాయి. ఈ మొత్తం చెరువులకు బందరు, రైవస్, ఏలూరు కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తారు. గ్రామీణ నీటిపారుదల శాఖ నుంచి ఇంకా పూర్తిస్థాయిలో వివరాలు రాకపోవడంతో ఈలోపు ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేయాలని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. 4 వేల క్యూసెక్కుల్లో ప్రస్తుతానికి 2,400 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా ఈ నీటి విడుదల జరుగుతోంది. ఇందులో 400 క్యూసెక్కుల నీరు లీకేజీల రూపంలో వృథా అవుతుందని లెక్కించారు. నికరంగా 2 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతుందని అంచనా వేశారు. ఇందులో 800 క్యూసెక్కుల నీరు కేడబ్ల్యూ (కృష్ణా పశ్చిమ) కాల్వకు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 3 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గ్రామీణ నీటిపారుదల శాఖ నుంచి త్వరలోనే నీటి లెక్కలు అందుతాయని భావిస్తున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో నీటి విడుదల ఉంటుంది.