ఇక విజయ ఆర్గానిక్ రైస్
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:26 AM
పాలు, పాల ఆధారిత ఉత్పత్తులకే పరిమితమైన ‘విజయ’ ఇకపై ఆహార పదార్థాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. కృష్ణామిల్క్ యూనియన్ నేతృత్వంలో ‘విజయ’ బ్రాండ్‌తో ఆర్గానిక్ రైస్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది.
పాలేతర ఉత్పత్తుల్లోకి కృష్ణామిల్క్ యూనియన్
త్వరలో మార్కెట్‌లోకి ఆర్గానిక్ రైస్
సేంద్రియ సాగు చేపట్టిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు
రైతుకు నష్టం లేకుండా మద్దతు ధరకే కొనాలని నిర్ణయం
సేంద్రియ సాగులో చేపట్టిన అపరాలు కూడా..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పాలు, పాల ఆధారిత ఉత్పత్తులకే పరిమితమైన ‘విజయ’ ఇకపై ఆహార పదార్థాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. కృష్ణామిల్క్ యూనియన్ నేతృత్వంలో ‘విజయ’ బ్రాండ్‌తో ఆర్గానిక్ రైస్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. ఇందుకోసం ఉమ్మడి కృష్ణాజిల్లాలో నూరుశాతం సేంద్రియ విధానంలో వరి సాగు చేసిన వారి నుంచి ధాన్యాన్ని కొనడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే సీజన్ నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించి, ఆర్గానిక్ రైస్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం తమ వంతుగా లాభాపేక్ష లేకుండా ఆర్గానిక్ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు.
మద్దతు ధరకే కొనుగోలు
ప్రభుత్వం సర్టిఫై చేసిన, ఉమ్మడి కృష్ణాజిల్లా యంత్రాంగం ఇచ్చే సర్టిఫికెట్ ప్రాతిపదికన సేంద్రియ వ్యవసాయం చేసిన వారి నుంచి ధాన్యాన్ని కొంటారు. రైతు నష్టపోకుండా ఉండేలా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకే కొంటామని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణామిల్క్ యూనియన్ లేఖ కూడా రాయనుంది. అలాగే, అపరాల కేటగిరీలో మినుములు, పెసలు, కందులు, సెనగలు, తదితరాలను కూడా రైతుల నుంచి కొంటామని ఆంజనేయులు
జిల్లాలో సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇటీవల సేంద్రియ వ్యవసాయ విధానం విస్తరిస్తోంది. ఈ విధానం పెరగాల్సిన అవసరాన్ని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిత్యం సూచిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో సాగు పరిస్థితులు కూడా ఆయన తెలుసుకుంటున్నారు. అలాగే, కూటమి ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి మంచి ప్రోత్సాహకాలు ఇస్తోంది. వ్యవసాయ శాఖకు లక్ష్యాలను నిర్దేశించి సాగు విస్తరణకు రెండు జిల్లాల యంత్రాంగాలు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పెంచి, 59 లక్షల ఎకరాల మేర పెంపుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని తాజాగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో కృష్ణామిల్క్ యూనియన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో సేంద్రియ విధానం ద్వారా ఎంతమంది రైతులు, ఎంత ధాన్యం పండించగలిగితే ఆ మొత్తాన్నీ కొనాలని నిర్ణయించింది.