Share News

రూ.లక్షలు ఇచ్చుకో.. లజ్జబండ తవ్వుకో..

ABN , Publish Date - Feb 01 , 2026 | 01:18 AM

లజ్జబండ డ్రెయిన్‌ను అక్రమార్కులు చెరపట్టారు. డ్రెయిన్‌ వెంబడి మడచెట్లను నరికేయడం, రొయ్యల చెరువులు తవ్వేయడం యథేచ్ఛగా సాగిస్తున్నారు. మడక వరకు మడచెట్లను పూర్తిగా నరికేసి చెరువులుగా మార్చేశారు. రూ.3 లక్షలు ఇస్తే చాలు.. డ్రెయిన్‌ను ఆక్రమించుకునేలా స్థానిక నాయకులు బేరాలు కుదుర్చుకుంటున్నారు. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు నిరాటంకంగా సాగుతున్నాయి. ఇలాగే వదిలేస్తే మడక నుంచి కప్పలదొడ్డి వరకు కూడా డ్రెయిన్‌ ఆక్రమణకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

రూ.లక్షలు ఇచ్చుకో..  లజ్జబండ తవ్వుకో..
లజ్జబండ డ్రెయిన్‌ వెంబడి బఫర్‌ జోన్‌లో ఉన్న రొయ్యల చెరువులు

పెదపట్నం-మడక వరకు నిరాటంకంగా ఆక్రమణలు

బఫర్‌ జోన్‌ పరిధిలోని మడచెట్ల నరికివేత పూర్తి

నాయకులకు రూ.3 లక్షలు సమర్పిస్తే చాలు

లజ్జబండ వెంబడి చెరువులు తవ్వేసుకోవచ్చు

అధికార యంత్రాంగానికి అదనంగా ముడుపులు

రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్‌, మత్స్య శాఖలకు తలో కొంత

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మడ అడవులకు గుండెకాయగా ఉన్న పెడన, కృత్తివెన్ను, బందరు మండలాల పరిధిలోని లజ్జబండ డ్రెయిన్‌ను అక్రమార్కులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ డ్రెయిన్‌ సముద్రంలో కలిసే పెదపట్నం నుంచి కృత్తివెన్ను, పెడన మండలాల మీదుగా మడక వరకు ఆక్రమించేశారు. పెదపట్నం నుంచి అచ్చయ్యపాలెం, జింజేరు వరకు డ్రెయిన్‌కు రెండువైపులా ఇదే పరిస్థితి. జింజేరు నుంచి ముంజలూరు వరకు ఒకవైపు ఆక్రమణలు జరగ్గా, ముంజలూరు నుంచి నందమూరి బ్రిడ్జి మీదుగా మడక వరకు కిలోమీటర్ల కొద్దీ ఈ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ డ్రెయిన్‌కు రెండువైపులా బఫర్‌ జోన్‌ వరకు మడచెట్లు విస్తరించి ఉండగా, వాటిని అక్రమార్కులు కొట్టేసి రొయ్యల చెరువులుగా మార్చేశారు. వాటిని కౌలుకు ఇస్తూ లబ్ధి పొందుతున్నారు. చాలావరకు రొయ్యల చెరువులను వారే నిర్వహిస్తున్నారు. మణిమేశ్వరం, ఉప్పులూరు, రామాపురం, జింజేరు, కానూరు, అచ్చయ్యవారి పాలెం, జొన్నలవారి మోడి, గొల్లగూడెం, ఇంతేరు, రామాపురం, పాండ్రాక, గొల్లపాలెం, ఉప్పుకట్ల వరకు భారీస్థాయిలో మడచెట్ల విధ్వంసం జరిగింది.

రూ.3 లక్షలకు డీల్‌

స్థానిక నాయకులకు రూ.3 లక్షలు ఇస్తే చాలు... లజ్జబండను ఆక్రమించుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు సిండికేట్‌గా ఏర్పడి ఈ దందాకు తెరలేపుతున్నారు. రూ.3 లక్షలు ఇచ్చిన అక్రమార్కులకు వారు అండగా నిలిస్తున్నారు. చెరువుల విస్తీర్ణాన్ని బట్టి అదనంగా ముడుపులు సమర్పించుకోవాల్సి ఉంటుంది.

తిలాపాపం తలా పిడికెడు

లజ్జబండ ఆక్రమణల పాపంలో రాజకీయ పార్టీల నాయకులే కాకుండా అధికారుల పాత్ర కూడా ఉంది. రెవెన్యూ యంత్రాంగానిదే కీలకపాత్ర. ఇంతా జరుగుతున్నా ఆర్డీవో స్థాయి అధికారి పట్టించుకునే పరిస్థితి లేదు. తహసీల్దార్ల పరిస్థితి ఇక సరేసరి. నాయకులు అనుమతించడానికి రూ.3 లక్షలు చెల్లించాల్సి వస్తే, రెవెన్యూ అధికారులకు రూ.2 లక్షలు అదనం. దీనిని బట్టి మిగిలిన శాఖలు కూడా ఏ రకంగా దండుకుంటున్నాయో తెలుస్తుంది. ఇక అటవీ, ఇరిగేషన్‌, మత్స్యశాఖ అధికారులు మడ సంరక్షణను గాలికొదిలేశారు. కనీసం పోలీసులకు ఫిర్యాదులు కూడా చేయట్లేదు. రొయ్యల చెరువులకు అనుమతులు ఇవ్వటానికి నిర్దిష్ట నిబంధనలు ఉంటాయి. అవి పాటించకుండా ఏరకంగా అనుమతులు ఇస్తారో అధికారులకే తెలియాలి.

వందల సంఖ్యలో చెరువుల తవ్వకాలు

లజ్జబండ డ్రెయిన్‌ నీరు సముద్రంలో కలవటం ఓ ఎత్తయితే, సముద్రపు ఆటుపోట్ల కారణంగా నీరు ముందుకు ఎగదన్నినప్పుడు పరిస్థితి మరో ఎత్తుగా ఉంటుంది. ఈ సమయంలో డ్రెయిన్‌ ద్వారా నీరు ఉప్పొంగి పొలాలను ముంచెత్తుతుంది. ఇలాంటి సమయంలో ఉప్పునీరు పంటపొలాల్లోకి రాకుండా మడచెట్లు అడ్డుకునేవి. డ్రెయిన్‌ ఒడ్డు కూడా ఎత్తులో ఉండటం వల్ల సమస్య వచ్చేది కాదు. మడచెట్లను నరికేయడం, బఫర్‌ జోన్‌లో మట్టి తవ్వటం వల్ల ఆటుపోట్ల సమయంలో సముద్రం నుంచి వచ్చే నీరు గట్లు దాటేస్తున్నాయి. గట్టు వెంబడి మడచెట్లను నరికేయడమే కాకుండా రొయ్యల చెరువులు తవ్వేయటం ప్రారంభించారు. ప్రస్తుతానికి వందల సంఖ్యలో లజ్జబండ డ్రెయిన్‌ వెంబడి రొయ్యల చెరువులు కనిపిస్తున్నాయి.

Updated Date - Feb 01 , 2026 | 01:18 AM