Share News

పోర్టుకు దారులు

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:56 AM

మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరిగితే సరుకుల ఎగుమతులు, దిగుమతుల కోసం వచ్చే వాహనాల కోసం రెండు నూతన రహదారులను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధమైంది. సాగరమాల పథకంలో భాగంగా మచిలీపట్నం, పెడన శివారు ప్రాంతాల్లో ఔటర్‌ రింగ్‌రోడ్డు నమూనాలో వీటిని నిర్మిస్తారు. జాతీయ రహదారుల విభాగం అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. ఆమోదం లభిస్తే మచిలీపట్నం పోర్టు నుంచి మచిలీపట్నం నగరం, పెడన పట్టణం శివారులో నార్త్‌, సౌత రహదారుల నిర్మాణం జరుగుతుంది.

పోర్టుకు దారులు

బందరు పోర్టుకు రెండు రహదారులు

225 అడుగుల వెడల్పుతో నిర్మించే ప్రణాళికలు

కరగ్రహారం, గిలకలదిండి, రుద్రవరం మీదుగా గూడూరు వరకు సౌత రహదారి

తపశిపూడి, బుద్దాలపాలెం, పెడన శివారు నుంచి తరకటూరు వరకు నార్త్‌ రోడ్డు

సాగరమాల పథకం ద్వారా నిర్మించే యోచన

కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఎన్‌హెచ్‌ అధికారులు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం పోర్టు పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయి. 2026, డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువులోగా పోర్టు పనులు పూర్తికాకున్నప్పటికీ మరో ఏడాదిన్నరలో అయినా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పోర్టు నుంచి ఏటా 30 లక్షల టన్నుల సరుకుల ఎగుమతులు, దిగుమతులు జరిగేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఈ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రెండు రోడ్లను నిర్మించేందుకు నమూనాలను తయారుచేశారు. కత్తిపూడి-ఒంగోలు వరకు ఉన్న జాతీయ రహదారి-216, మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి-65ను పోర్టుకు కలిపేలా ఈ నార్త్‌, సౌత రహదారుల నమూనాలను తయారు చేస్తున్నారు.

నార్త్‌ రహదారి ఇలా

నార్త్‌ రహదారి పోర్టు నుంచి తపశిపూడి, కాకర్లమూడి, బుద్దాలపాలెం మీదుగా పెడన శివారులోని తోటమూల జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారి-216 వద్ద కలుస్తుంది. అక్కడి నుంచి మలుపు తిరిగి తరకటూరు వద్ద మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి-65 వద్ద కలిసేలా నమూనాను రూపొందించారు.

సౌత రహదారి ఇలా..

మచిలీపట్నం పోర్టు నుంచి సౌత రహదారి కరగ్రహారం, గిలకలదిండి, రుద్రవరం సమీపంలో జాతీయ రహదారి-216ను కలుస్తుంది. ఈ రహదారిని మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి-65తో గూడూరు సమీపంలో కలుపుతారు.

జాతీయ రహదారులను కలిపేలా..

భవిష్యత అవసరాలను దృష్టిలో పెట్టుకుని నార్త్‌, సౌత రహదారులను 75 మీటర్ల వెడల్పుతో (225 అడుగులు) నిర్మించేలా ప్రణాళికను తయారు చేశారు. మచిలీపట్నం శివారు కిలోమీటరు దూరంలో జాతీయ రహదారులు-216, 65 కలిసే ఎస్‌ఎన్‌ గొల్లపాలెం వద్ద క్రాస్‌ క్లోవర్‌ లీఫ్‌ నమూనాలో రహదారి నిర్మించేందుకు గతంలోనే ప్రణాళికలు రూపొందించారు. పోర్టు రాకతో భవిష్యత్తులో మచిలీపట్నం మరింత విస్తరిస్తే ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ నమూనాను ఇటీవల మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో జాతీయ రహదారులు, మోర్త్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పక్కన పెడుతున్నట్ల్లు ప్రకటించారు. దీనికి బదులుగా రెండు జాతీయ రహదారులు కలిసే ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ నిర్మించేలా నమూనాను మార్చి ఇటీవల ఆమోదం కోసం పంపారు. దీనికి ఆమోదం లభిస్తే మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌, పెడన పురపాలక సంఘాల శివారులో ఔటర్‌ రింగ్‌రోడ్డు మాదిరిగా నార్త్‌, సౌత రహదారులు నిర్మించి మచిలీపట్నం-విజయవాడ, కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారులతో కలుపుతారు. దీంతో పాటు జాతీయ రహదారి 216ను కృత్తివెన్ను మండలంలోని లోసరి వంతెన నుంచి కోడూరు మండలం ఉల్లిపాలెం వరకు సముద్రతీరం వెంబడి నిర్మించాలని ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ రహదారి సముద్రపు కరకట్ట మాదిరిగా ఉండి తీరప్రాంతాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే రక్షణ కవచంగా ఉండాలని జాతీయ రహదారుల అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు.

Updated Date - Jan 08 , 2026 | 12:56 AM