Share News

నేడే తుదిఘట్టం

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:25 AM

ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేక మహోత్సవం తుది అంకానికి చేరుకుంది. ఆదివారం ఉదయం 9.34 గంటలకు కనకదుర్గమ్మ ప్రధానాలయం గోపుర శిఖరానికి మూడు సముద్రాలు, 12 నదుల జలాలతో అభిషేకం చేస్తారు.

నేడే తుదిఘట్టం
హోంమంత్రి అనితతో మాట్లాడుతున్న విజయేంద్ర సరస్వతి

సువర్ణ శిఖరానికి కుంభాభిషేకం

కంచి పీఠాధిపతి పర్యవేక్షణలో ఏర్పాట్లు

లక్షమంది వరకు వస్తారని అంచనా

విజయవాడ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేక మహోత్సవం తుది అంకానికి చేరుకుంది. ఆదివారం ఉదయం 9.34 గంటలకు కనకదుర్గమ్మ ప్రధానాలయం గోపుర శిఖరానికి మూడు సముద్రాలు, 12 నదుల జలాలతో అభిషేకం చేస్తారు. ఉదయం పూర్ణాహుతితో కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత కుంభాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హాజరవుతారని భావించారు. వారి రాకకు సంబంధించి ఎలాంటి అధికార సమాచారం లేదు. దాదాపు లక్షమంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

రెండోరోజు ప్రత్యేక పూజలు

రెండోరోజు కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి వివిధ పవిత్రనది, సముద్ర జలాలతో అష్టోత్తర కలశస్థాపన, పూజ, పీఠపూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు మూలమంత్ర హవనాలు చేశారు. సాయంత్రం 4 గంటలకు మూలమంత్ర హవనాలు, ప్రదోషకాల పీఠపూజలు నిర్వహించి హారతి సమర్పించారు. రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం ఇచ్చారు. ఈ కార్యక్రమాలను కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షించారు. ఉదయం కృష్ణానదిలో స్నానమాచరించిన తర్వాత ఆయన ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. అమ్మవారి ప్రధానాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం యాగశాలకు వచ్చి పూజలు చేశారు. కాగా, శనివారం సాయంత్రానికి దుర్గమ్మను 45 వేల మంది దర్శించుకున్నారు. మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని చిన్ని దంపతులతో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

కొత్త భవనంలో అన్నదానం

భక్తుల రద్దీ సాధారణంగా ఉండడంతో అన్నదానం మహామండపంలో నిర్వహిస్తున్నారు. భక్తుల అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన అధికారులు ఆదివారం మహామండపం ఎదురుగా ఉన్న కొత్త అన్నదాన భవనంలో ఏర్పాట్లు చేశారు.

Updated Date - Mar 08 , 2026 | 01:25 AM