క్లాప్.. ఫ్లాప్
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:10 AM
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కింద నగరంలో అద్దె ప్రాతిపదికన తీసుకున్న చెత్త తరలింపు వాహనాలు కార్పొరేషన్‌కు ఆర్థిక గుదిబండగా మారాయి. ఈ వాహనాలు ఇంటింటికీ వచ్చి తడి, పొడి చెత్తను సేకరిస్తున్నాయో లేదో తెలియదు కానీ, ఏడాదికి రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు బిల్లులు మాత్రం ఠంచనుగా చేరుతున్నాయి. వాహనాలు తిరక్కుండానే బిల్లులు చెల్లిస్తున్నారని, ఆ బిల్లుల మాటున అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. వీటి స్థానే కార్పొరేషన్ సొంతంగా వాహనాలను కొనడం ద్వారా ఖర్చుతో పాటు చెత్త సేకరణ కూడా తేలిక అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కార్పొరేషన్‌లో చెత్త తరలింపు వాహనాల దుస్థితి
వైసీపీ హయాంలో అద్దెకు తీసుకున్న వాహనాలు
225 వాహనాల్లో సగం కూడా తిరగని పరిస్థితి
అయినా ప్రతినెలా రూ.కోటి వరకు బిల్లుల చెల్లింపు
కొండెక్కిన సొంత వాహనాల కొనుగోలు ప్రతిపాదన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కింద తడి, పొడి చెత్త చాంబర్లతో కూడిన 225 మ్యాక్సీ ఆటోలను కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ఈ వాహనాల్లో ప్రస్తుతం 193 మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిలో సగం వాహనాలు కూడా ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించట్లేదు. ఈ మ్యాక్సీ టిప్పర్ ఆటోలు సీఎన్‌జీతో నడుస్తాయి. ఒప్పందం మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పనిచేయాలి. డ్రైవర్ల జీతాలు, సీఎన్‌జీ వ్యయం, అద్దె అన్నీ కలిపి ఒక్కో క్లాప్ వాహనానికి నెలకు రూ.51 వేలు చెల్లిస్తున్నారు. 193 వాహనాలకు సుమారు రూ.కోటి చెల్లిస్తున్నారు. వీటి నిర్వహణ స్వయంభు అనే సంస్థ దక్కించుకుంది. ప్రతినెలా డబ్బును కార్పొరేషన్ చెల్లిస్తుంది. ఈ వాహనాలను తీసుకున్న మొదట్లో కొద్దినెలల పాటు ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించాయి. ఆ తర్వాత నుంచి వాహనాల సంఖ్య పడిపోయింది. 50 వాహనాలు కూడా ఇంటింటికీ వచ్చి చెత్తనుసేకరించటం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఈ వాహనం ప్రతి ఇంటికీ వచ్చి డోర్ టు డోర్ చెత్తను సేకరించాలి. ఈ వాహనం వెంట పారిశుధ్య కార్మికులు ఉండి తడి, పొడి చెత్తను వేరే ్వరు చాంబర్లలో పోయాలి. కానీ, పారిశుధ్య కార్మికులు పుష్‌కార్టులు, రిక్షాబండ్లలో తీసుకొచ్చి ఎక్కడో ఒకచోట పార్క్ చేసిన ఈ వాహనంలో పోయాల్సి వస్తోంది. ఈ వాహనాలు చాలాసంఖ్యలో తిరగకపోవటంతో పారిశుధ్య కార్మికులు చెత్తకుండీలు, డంపర్ బిన్లలో పోస్తున్నారు. బిల్లులు మాత్రం నెలకు రూ.కోటి వరకు చెల్లిస్తున్నారు. అంటే.. నాలుగేళ్లుగా సుమారు రూ.50 కోట్ల మేర చెల్లించారు. వీటి గడువు ఈ ఏడాది నవంబరుతో ముగుస్తుంది.
సొంత వాహనాలు కొంటారా?
ప్రైవేట్ వాహనాల స్థానంలో సొంతంగా కొనాలని కూటమి ప్రభుత్వం వచ్చాక పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ నిర్దేశించింది. వైసీపీ హయాంలో ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేసేవారు. ఆ డబ్బును ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టేవారు. ఈ విధానాన్ని రద్దు చేస్తూ సొంత వాహనాలను కొనాలని నిర్ణయించినా ఇంకా పాత వాహనాలే కొనసాగుతున్నాయి.
ఎలక్ర్టికల్ వాహనాల సంగతేంటి?
చెత్త సేకరించే పుష్‌కార్టులు, ట్రై సైకిళ్లు, మ్యాక్సీ ఆటోలు, ఇతర వాహనాలను ఎలక్ర్టికల్ వాహనాలుగా అందించటానికి ఆరునెలల కిందట ఎంఏయూడీ నుంచి ప్రతిపాదన వచ్చింది. మొత్తం 160 వాహనాలు కావాలని కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలు పట్టాలెక్కిన దాఖలాలు లేవు.
సబ్సిడీతో వాహనాలు కొనొచ్చు
కార్పొరేషన్‌లో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారి ద్వారా సఫాయి కర్మచారీ కార్పొరేషన్ నుంచి సబ్సిడీతో చెత్త తరలింపు వాహనాలను కొనొచ్చు. కార్మికుల పేరుతో కొన్న వాహనాలను కార్పొరేషన్ తీసుకోవచ్చు. తద్వారా కార్మికులకు కొంతమేర రాయల్టీ చెల్లిస్తూ కార్పొరేషన్ మూడొంతుల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు.