Share News

ప్లాట్లు.. ఇంకెన్నాళ్లీ పాట్లు

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:42 AM

రెండు దశాబ్దాలుగా జక్కంపూడి రైతులు తమకు రావాల్సిన ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్యూఆర్‌ఎం ఇళ్లు నిర్మించగా, మిగిలిన 60 శాతం రైతుల వాటాలోని స్థలం అభివృద్ధికి నోచుకోక.. ప్లాట్లు స్వాధీనం కాక.. భవన నిర్మాణాలకు అనుమతులు రాక అవస్థలు పడుతున్నారు. మా ప్లాట్లను ఎప్పటికి స్వాధీనం చేస్తారని కార్పొరేషన్‌ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్లాట్ల సాధన కోసం ఉద్యమబాటకు శ్రీకారం చుడుతున్నారు.

ప్లాట్లు.. ఇంకెన్నాళ్లీ పాట్లు
జక్కంపూడిలోని రైతుల ప్లాట్లు

రెండు దశాబ్దాలుగా జక్కంపూడి రైతుల ఎదురుచూపులు

2006లో ఎన్యూఆర్‌ఎం ఇళ్ల నిర్మాణం కోసం 60-40 ఒప్పందం

కార్పొరేషన్‌ వాటా 40 శాతంలో జీప్లస్‌త్రీ ఇళ్ల నిర్మాణం

రైతుల వాటా 60 శాతంలో లే అవుట్‌ ఏర్పాటు

ఇప్పటి వరకు రైతులకు ప్లాట్లు స్వాధీనం చేయని కార్పొరేషన్‌

ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా, జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకం కింద నగరానికి 30 వేల ఇళ్లు మంజూరయ్యాయి. నగరంలో అందుబాటులో ఉన్నంత వరకు రాధానగర్‌, న్యూ రాజరాజేశ్వరిపేట, అజితసింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో జీప్లస్‌త్రీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరో 8 వేల ఇళ్ల నిర్మాణాలకు స్థలాభావం రీత్యా కార్పొరేషన్‌ పరిధి కాకపోయినా శివారున ఉన్న జక్కంపూడిలో భూములు తీసుకోవాలని భావించారు. 2006వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం చొరవతో జిల్లా యంత్రాంగం డెవలప్‌మెంట్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి జక్కంపూడి రైతులు అంగీకరించారు. మొత్తం 160 మంది రైతుల నుంచి 226 ఎకరాలను 60-40 నిష్పత్తిలో తీసుకున్నారు. కార్పొరేషన్‌ 40 శాతం వాటాగా 94 ఎకరాల భూములు, రైతులకు ప్లాట్లుగా అభివృద్ధి చేసి అప్పగించటానికి 132 ఎకరాలుగా విభజించారు. కార్పొరేషన్‌ తనకు వచ్చిన 40 శాతం వాటా భూముల్లో 8 వేల ఎన్యూఆర్‌ఎం ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. అయితే, రైతుల వాటా భూములను లే అవుట్‌గా వేసి, ప్లాట్లుగా విడదీసి, సదుపాయాలను కల్పించి రైతులకు అప్పగించాల్సి ఉంది. లే అవుట్‌ వేసి, ప్లాట్లను విడగొట్టి, రోడ్ల నిర్మాణం చేపట్టారు. వాటర్‌ ట్యాంక్‌ నిర్మించారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ (యూజీడీ) వంటివి కల్పించినా స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్లు, ప్రధాన కల్వర్టులు కల్పించలేదు. కాలక్రమంలో అంతులే ని నిర్లక్ష్యం ఏర్పడింది.

2014లో ఉచిత రిజిస్ర్టేషన్లు

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అభివృద్ధి ప్రాతిపదికన 60-40 నిష్పత్తిలో భూములు ఇవ్వడం బాగుందని చంద్రబాబు ప్రశంసించడంతో పాటు రైతులకు ఉచితంగా రిజిస్ర్టేషన్లు చేసి పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు. లే అవుట్‌లో 746 ప్లాట్లను విడగొట్టి, రైతులు ఇచ్చిన భూముల ప్రాతిపదికన వాటిని కేటాయించి రిజిస్ర్టేషన్లు చేశారు.

కార్పొరేషన్‌ నిర్వాకం.. సమస్య మళ్లీ మొదటికి..

ఉచితంగా రిజిస్ర్టేషన్లు చేసి డాక్యుమెంట్లు ఇచ్చినప్పటికీ ఎవరి ప్లాట్లు ఎక్కడ అన్నది కార్పొరేషన్‌ అధికారులు చూపించలేదు. మిగతా సదుపాయాల కల్పన పనులు కూడా చేపట్టలేదు. దీంతో రైతులు కార్పొరేషన్‌ తమకు ప్లాట్లు స్వాధీనం చేసినట్టుగా అగ్రిమెంట్‌పై సంతకం చేయలేదు. చూస్తుండగానే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. ప్రస్తుతం బ్యాలెన్స్‌ పనులు చేయటానికి కార్పొరేషన్‌ దగ్గర డబ్బు లేదు. ప్లాట్లు చూపకపోవటం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంతో రైతులు కూడా అగ్రిమెంట్‌పై సంతకం చేయట్లేదు.

పాడైన లే అవుట్‌

రెండు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటం వల్ల లే అవుట్‌ పాడైపోయింది. ప్లాట్లలో పిచ్చిమొక్కలు, చెట్లు పెరిగిపోయాయి. ట్రాఫిక్‌ మళ్లింపు పేరుతో ఈ లే అవుట్‌లోని రోడ్ల మీదుగా వాహనాలను మళ్లించడం వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి. లే అవుట్‌ను అభివృద్ధి చేయాలంటే రూ.కోట్లు ఖర్చవుతాయి. నాలుగు ప్రధాన కల్వర్టులు నిర్మించాలంటే భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంది. సహనం నశించిన రైతులు.. ప్లాట్లను తమకు చూపి వాటిని అప్పగిస్తే చాలని, సదుపాయాల కల్పన పనులు తామే చేసుకుంటామని ప్రాధేయపడ్డారు. అయినా కూడా ప్లాట్లు అప్పగించటానికి కార్పొరేషన్‌ ముందుకు రావట్లేదు.

Updated Date - Feb 09 , 2026 | 12:42 AM