ధనాధన్ డ్రోన్
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:03 AM
జిల్లాలో డ్రోన్ల వినియోగం పెరిగింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోనే అత్యధికంగా డ్రోన్లను వినియోగిస్తున్న టాప్ జిల్లాల జాబితాలో ఎన్టీఆర్ జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. నగరంలో డ్రోన్ సమ్మిట్ అనంతరం ప్రైవేట్ రంగాలతో సమానంగా ప్రభుత్వ శాఖలు కూడా డ్రోన్లను ఉపయోగిస్తుండటం, వ్యవసాయం, పోలీసు, జిల్లా యంత్రాంగాలు డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తుండటం, ఫొటోగ్రఫీలో కీలకంగా మారడంతో డ్రోన్లకు ప్రాధాన్యత ఏర్పడింది.
డ్రోన్ల వినియోగంలో రాష్ట్రంలోనే జిల్లా నాల్గోస్థానం
ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో విరివిగా వినియోగం
వ్యవసాయ రంగంలోనూ భారీగా వాడుకలోకి..
కొనుగోళ్లలోనూ టాప్ రేంజ్..
డ్రోన్ దీదీ పథకంతో పెరిగిన వాడకం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో ఇప్పటి వరకు 8,377 గంటల పాటు డ్రోన్లు ఎగిరాయి. నెలలో 1,781 గంటలు, గత వారంలో 417 గంటలు, ఈ వారంలో 304 గంటల పాటు డ్రోన్ల వినియోగం జరిగింది. ఇందులో ప్రభుత్వ డ్రోన్లు గంటపాటు, ప్రైవేట్ డ్రోన్లు 300 గంటల పాటు ఎగిరాయి. కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 3,464 గంటల పాటు డ్రోన్ల వినియోగం జరిగింది. నెలలో 549 గంటలు, గత వారంలో 114 గంటలు, ఈ వారంలో 44 గంటల పాటు డ్రోన్లు ఎగిరాయి. గంటపాటు ప్రభుత్వ డ్రోన్లు, 43 గంటల పాటు ప్రైవేట్ డ్రోన్లు వినియోగించారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో పతాక స్థాయికి..
డ్రోన్ టెక్నాలజీ ప్రజలకు చేరువవుతున్న కొద్దీ వాటి వినియోగం గణనీయంగా పెరుగుతోంది. బుడమేరు వరదల సమయంలో ముంపులో చిక్కుకున్న ప్రజలకు ఆహారాన్ని వీటి ద్వారానే చేరవేశారు. అలాగే, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగింది. వీటిద్వారా పురుగు మందులు పిచికారీ చేయటం సులువుగా మారింది. అలాగే, జిల్లా వ్యవసాయశాఖ నేతృత్వంలో డ్రోన్ల వినియోగం పెరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకం ‘డ్రోన్ దీదీ’ వచ్చాక వీటి వినియోగం తారస్థాయికి చేరింది. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్)లో అయితే ఉద్యాన విభాగంలో డ్రోన్ల ద్వారా మొక్కలకు నీరు, మందులు స్ర్పే చేయిస్తున్నారు. నగరంలో పారిశుధ్య పరిస్థితులను డ్రోన్ల ద్వారా సమీక్షి స్తున్నారు. స్ర్టామ్ వాటర్ డ్రెయిన్లు, ప్రధాన కాల్వలు, దోమల లార్వా వంటివి పరిశీలించటానికి వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రకృతి విపత్తులతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు వీటిని వినియోగిస్తున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కీలక ‘అస్త్రం’గా మారింది. పేకాట స్థావరాలు, కోడిపందేల వంటి వాటిపై డ్రోన్ నిఘా సత్ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడంలో కీలకపాత్ర పోషిస్తోంది.
ప్రైవేట్ డ్రోన్ల వినియోగం ఎక్కువే..
ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫొటోగ్రఫీ రంగంలో దీని వినియోగం ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా విస్తరించటం ద్వారా ఆ వినియోగం ఇంకాస్త పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ రీల్స్, వీడియోల కోసం భారీ ఎత్తున డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపాధిగా ఎంచుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
కొనుగోళ్లూ
పెరిగాయ్..
డ్రోన్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. డ్రోన్ అంటే ఒకప్పుడు చాలా ఖరీదైనది. మంచి స్టెబిలైజేషన్, 4కే, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్న డ్రోన్లు రూ.లక్షన్నర వరకు ఉన్నాయి. మొదట్లో డీజేఐ కంపెనీకి చెందిన వాటికే డిమాండ్ ఉండేది. ప్రస్తుతం దేశీయంగా కూడా ఇదే ఫీచర్లతో తయారవుతున్నాయి. నాట్ డ్రోన్స్, గరుడ డ్రోన్స్ ఇలాంటి దేశీయ కంపెనీలు మరికొన్ని రూ.25 వేల నుంచే విక్రమిస్తున్నాయి. దీంతో దేశీయ డ్రోన్లకు డిమాండ్ పెరిగింది.