Share News

ఆ‘పన్ను’హస్తం

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:43 AM

ఈనెలాఖరుకు నూరుశాతం ఇంటిపన్ను వసూళ్లే లక్ష్యంగా గ్రామాల్లో అధికార యంత్రాంగం దీక్షబూనింది. ప్రభుత్వం పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించటంతో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు, టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ గ్రామాల్లో వసూళ్లను వేగవంతం చేస్తున్నారు. ఈవోఆర్డీ, ఎంపీడీవో, డీఎల్‌పీవోలే కాదు.. డీపీవో సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్నుల వసూలుపై సమీక్షలు జరుపుతున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా పన్నులు నేరుగా ప్రభుత్వ ఖాతాకు జమ అవుతున్నాయి.

ఆ‘పన్ను’హస్తం

పిడికిలి బిగించిన జిల్లా యంత్రాంగం

నూరుశాతం ఇంటి పన్ను వసూలే లక్ష్యం

ఇంటింటికీ తిరుగుతూ వసూళ్లు

రోజువారీగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ

అవకతవకలు జరక్కుండా ఆన్‌లైన్‌ విధానం

నేరుగా ప్రభుత్వ ఖాతాకు డబ్బు జమ

153 పంచాయతీల్లో నూరుశాతం సక్సెస్‌

(ఆంధ్రజ్యోతి-చల్లపల్లి) : 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులను ఈ నెలాఖరులోగా నూరుశాతం వసూలు చేసే లక్ష్యంతో అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. క్షేత్రస్థాయిలో పంచాయతీ అధికారులు, సిబ్బంది పనిచేసేలా.. ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ, రోజువారీ లక్ష్యాలు విధిస్తూ వసూళ్లలో వేగాన్ని పెంచుతున్నారు. దీంతో కార్యదర్శులు సైతం పన్ను వసూళ్లకు వెళ్తున్నారు. మండలస్థాయి అధికారులు గ్రామాల్లో తిరుగుతూ పర్యవేక్షణ చేస్తుండగా, జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు రోజూ టెలీ కాన్ఫరెన్సులతో పాటు ప్రత్యేకంగా ఫోన్‌చేసి మాట్లాడుతున్నారు. డీపీవో సైతం నేరుగా పెద్ద పంచాయతీలకు వెళ్లి సమీక్షలు చేస్తున్నారు.

అవకతవకలకు ఆస్కారం లేకుండా..

పన్ను వసూళ్లలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేలా ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో డిమాండ్లు ఒకసారి ఇచ్చుకుంటూ వెళ్లి, ఆ తర్వాత పన్నులు వసూళ్లు చేసేవారు. వసూలు చేసిన మొత్తాన్ని లెక్కకట్టి ట్రెజరీకి జమ చేస్తుండేవారు. ఈ దశలో పన్ను వసూళ్ల మొత్తాన్ని పూర్తిస్థాయిలో జమ చేయకుండా బిల్‌ కలెక్టర్ల నుంచి కార్యదర్శుల వరకూ అనేక అవకతవకలు జరిగేవి. వాటన్నింటికీ చెక్‌ పెడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌, యూపీఏ, చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తుండటంతో నేరుగా ప్రభుత్వ ఖాతాకు నగదు జమ అవుతోంది. అలాగే, యజమాని ఫోన్‌కు పీడీఎఫ్‌ రూపంలో రశీదు వెళ్తోంది. మొదట్లో ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో చిన్న సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ కాలక్రమేణా అవి పరిష్కారమయ్యాయి. నిరక్షరాస్యులు, ఫోన్‌పే సౌకర్యం లేనివారు నగదు ఇస్తుంటే.. సిబ్బంది వారి ఫోన్లలో డబ్బు వేసుకుని యూపీఐ ద్వారా చెల్లించి వారికి రశీదు ఇవ్వాల్సి వస్తోంది. ఇలా కొంతమేర పనిభారం పెరిగింది.

చల్లపల్లిలో డి మాండ్‌ రూ.కోటి పైమాటే..

చల్లపల్లి పంచాయతీలో 2025-26 సంవత్సరం డిమాండ్‌ రూ.కోటిపైనే ఉంది. గ్రామంలో మొత్తంగా 5,085 ఇళ్లకు సంబంధించి పన్నులు వసూలు చేయాలి. ఈనెల 5 నాటికి చల్లపల్లిలో 60శాతం పైగా పన్ను వసూళ్లు జరిగాయు. మార్చి నెలాఖరుకు నూరుశాతం వసూలు లక్ష్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. చల్లపల్లి పంచాయతీలో గ్రేడ్‌-1 కార్యదర్శితో పాటు సచివాలయ కార్యదర్శులు, మహిళా పోలీసులు, పంచాయతీలో కాంట్రాక్టు పద్ధతిలో బిల్‌ కలెక్టర్లుగా పనిచేస్తున్న సిబ్బంది కలిసి ఏడు బృందాలుగా ఏర్పడి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోనూ కౌంటర్‌ ఏర్పాటుచేసి బిల్లులు కట్టించుకుంటున్నారు.

ప్రభుత్వ భవనాల పన్నుల బకాయిల్లో పురోగతి శూన్యం

చల్లపల్లిలోని ప్రభుత్వ సంస్థలు మాత్రం ఇంటి పన్నులు చెల్లించటంలో వెనకపడ్డాయి. ఈ బకాయిలు వసూలైతే పన్ను వసూలు లక్ష్యంలో పురోగతి సాధించినట్లవుతుంది. వివిధ ప్రభుత్వ శాఖల భవనాలకు సంబంధించి మూడేళ్ల నుంచి 17 ఏళ్ల వరకు బకాయిలు చెల్లించాలి. ఈ పన్నులే మొత్తంగా దాదాపు రూ.7 లక్షలుపైగా వసూలు కావాల్సి ఉంది. కోర్టు వివాదాల్లో ఉన్న భవనాల ద్వారా సుమారు రూ.16 లక్షలకు పైగా పన్ను రావాల్సి ఉంది.

152 పంచాయతీల్లో నూరుశాతం

జిల్లాలోని 497 పంచాయతీల్లోని 152లో ఇప్పటికే నూరుశాతం పన్ను వసూలు జరిగింది. రూ.88 కోట్ల మేర పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఈనెల 4వ తేదీ నాటికి రూ.57 కోట్లు వసూలుచేసి 64.70 శాతం లక్ష్యాన్ని సాధించారు. చిన్న గ్రామాల్లో డిమాండ్‌ త క్కువగా ఉంది. చల్లపల్లి మండలంలో వెలివోలు, ఆముదార్లంక, యార్లగ డ్డ, వక్కలగడ్డ, నడకుదురు గ్రామాల్లో నూరుశాతం ఇంటిపన్నుల వసూలు జరిగింది.

ప్రజలు సహకరించాలి : పీవీ మాధవేంద్రరావు, చల్లపల్లి కార్యదర్శి

మార్చి నెలాఖరు నాటికి నూరుశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గ్రామంలో ఏడు బృందాలు తిరుగుతున్నాయి. ప్రజలు.. అధికారులు, సిబ్బందికి సహకరించి సకాలంలో పన్నులు చెల్లించాలి. ఈ నెలాఖరుకు నూరుశాతం పన్ను వసూళ్లకు సహకరించాలి.

Updated Date - Mar 06 , 2026 | 12:43 AM