Share News

చక్రబంధం

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:00 AM

మౌని అమావాస్య ఎఫెక్ట్‌ నగరంపై భారీగానే పడింది. వాస్తవానికి ఆదివారంతోనే సెలవులు ముగిసినా అమావాస్య కారణంగా చాలామంది సోమవారానికి ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. ఫలితంగా నగరం అష్టదిగ్బంధనం అయ్యింది. చాలాసేపు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

చక్రబంధం
బందరు రోడ్డులో భారీగా నిలిచిన ట్రాఫిక్‌

తిరుగు ప్రయాణాలతో నగరం కిటకిట

మౌని అమావాస్య ఎఫెక్ట్‌తో ప్రయాణాలు వాయిదా

సోమవారం ఒక్కసారిగా పెరిగిన వాహనశ్రేణి

కార్లతో కిక్కిరిసిన 16, 65 జాతీయ రహదారులు

రద్దీతో ట్రాఫిక్‌ను మళ్లించిన పోలీసులు

బెంజిసర్కిల్‌, రామవరప్పాడు, వారధి వద్ద బారులుగా..

(ఆంధ్రజ్యోతి విజయవాడ సిటీ) : సంక్రాంతి పండక్కి గ్రామాల్లో సందడి చేసి తిరుగు ప్రయాణమైన వారితో జాతీయ, రాష్ట్ర రహదారులు కిక్కిరిశాయి. వాస్తవంగా ఈనెల 17, 18 (శని, ఆదివారాల్లో) తిరుగు ప్రయాణాలుంటాయని భావించిన పోలీసులు.. అందుకు తగిన విధంగానే ట్రాఫిక్‌ నియంత్రణ చేపట్టారు. అయితే అనూహ్యంగా ప్రజలంతా సోమవారం తిరుగు ప్రయాణాలు చేయడంతో విజయవాడ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులు కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్ల వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.

భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

సోమవారం ఉదయం 9 గంటల నుంచి నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ మొదలైంది. కంకిపాడు, గుడివాడ, ఉయ్యూరు, పామర్రు, మచిలీపట్నం, భీమవరం, కైకలూరు నుంచి ఏకధాటిగా వాహనాలు ఠిరావడంతో ఆటోనగర్‌ టెర్మినల్‌ నుంచి బెంజిసర్కిల్‌ వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వారధి, బస్టాండ్‌, గొల్లపూడి వై జంక్షన్‌ పరిసరాల్లోనూ తీవ్ర ప్రభావం చూపింది. గన్నవరం, హనుమాన జంక్షన, ఏలూరు, రాజమండ్రి నుంచి వాహనాలు అత్యధికంగా వెస్ట్‌ బైపాస్‌ వైపు మళ్లినా, కొన్ని వాహనాలు నగరంవైపు రావడంతో రామవరప్పాడు వద్ద సాయంత్రం వరకు ట్రాఫిక్‌ పాక్షికంగానే స్తంభించింది. అయితే బెంజిసర్కిల్‌, రామవరప్పాడు రింగ్‌ వద్ద సాయంత్రం 5 గంటల నుంచి తీవ్రమైన రద్దీ నెలకొంది. దాదాపు కిలోమీటరు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్‌ జిల్లా ట్రాఫిక్‌ పోలీసులు రంగప్రవేశం చేసి వాహనాల రాకపోకలు సజావుగా జరిపే పనిలో నిమగ్నమయ్యారు. వేలసంఖ్యలో కార్లు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో రవాణా నత్తనడకన సాగింది. వాహనశ్రేణిని దృష్టిలో ఉంచుకుని నగరంలోకి భారీ వాహనాలు రాకుండా పోలీసులు ముందే మళ్లింపులు జరిపారు. హైదరాబాద్‌ వైపునకు వెళ్లే భారీ వాహనాలను హనుమాన జంక్షన్‌ నుంచి నూజివీడు, మైలవరం మార్గం వైపునకు మళ్లించారు. కారులో ప్రయాణించే వారు సైతం ఇదే మార్గాన్ని అనుసరించడంతో ఆయా ప్రాంతాల్లోని రాష్ట్ర రహదారులు వాహనాలతో కిక్కిరిశాయి. రాత్రి 9 గంటల వరకు రోడ్లపై ప్రయాణికుల రద్దీ కొనసాగింది. బస్టాండ్‌, రైల్వేస్టేషన సైతం ప్రయాణికులతో కిటకిటలాడాయి.

మౌని అమావాస్య ఎఫెక్ట్‌

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి సొంతూర్లకు వచ్చిన చాలామంది వాస్తవానికి సోమవారమే విధులకు హాజరుకావాల్సి ఉంది. దీంతో ఆదివారమే తిరుగు ప్రయాణాలు ఉంటాయని అందరూ అనుకున్నారు. అయితే, ఆదివారం మౌని అమావాస్య కావడంతో చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. అమావాస్య గడియలు ముగియగానే అనూహ్యంగా తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు.

Updated Date - Jan 20 , 2026 | 01:00 AM