స్టేడియానికి సొబగు
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:40 AM
‘దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నడిబొడ్డున అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం ఉంది. విజయవాడలో అటువంటి స్టేడియం లేదు.’ ఓ అంతర్జాతీయ క్రీడాకారిణి సీఎం చంద్రబాబును కలిసినప్పుడు వ్యక్తం చేసిన అభిప్రాయమిది. ఈ అభిప్రాయంలో వాస్తవం ఉంది.
ఇందిరాగాంధీ స్టేడియం ఆధునికీకరణకు అడుగులు
రూ.19.6 కోట్లలో పనులకు టెండర్లు
సింథటిక్ ట్రాక్ ఏర్పాటుతో పాటు అభివృద్ధి పనులు
ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు
అధునాతన హంగులతో నిర్మాణ పనులు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ‘దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నడిబొడ్డున అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం ఉంది. విజయవాడలో అటువంటి స్టేడియం లేదు.’ ఓ అంతర్జాతీయ క్రీడాకారిణి సీఎం చంద్రబాబును కలిసినప్పుడు వ్యక్తం చేసిన అభిప్రాయమిది. ఈ అభిప్రాయంలో వాస్తవం ఉంది. విజయవాడ నగర నడిబొడ్డున ఎంజీ రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉంది. కానీ, ఇక్కడ సదుపాయాల విషయంలో ఎప్పుడూ లోటు కనిపిస్తూనే ఉంటుంది. ఈ లోటు త్వరలో తీరనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ట్రాక్, కోర్టులు ఇక్కడ దర్శనం ఇవ్వనున్నాయి. రూ.19.6 కోట్లతో స్టేడియాన్ని ఆధునికీకరించడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు
స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అథ్లెటిక్స్ నిర్వహణకు సింథటిక్ ట్రాక్ నిర్మించనున్నారు. ఇదికాకుండా బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్, టెన్నిస్ కోర్టులను అధునాతన హంగులతో సిద్ధం చేస్తారు. ఈ పనులకు మొత్తం రూ.19.60 కోట్లు కేటాయించారు. ఈ పనులు కాకుండా ఐజీఎంస్ ఆవరణలో ఫుట్‌బాల్ కోర్టుకు సమీపాన ఇండోర్ స్టేడియం నిర్మించాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన పట్టాలెక్కాలంటే మరిన్ని నిధులు అవసరమవుతాయి. ఒక్క ఇండోర్ స్టేడియం నిర్మాణానికే రూ.30 కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేటాయించిన నిధులు సరిపోవు. ప్రస్తుతానికి ట్రాక్, కోర్టుల పనులను పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. టెండర్లను త్వరలో ఖరారు చేయనున్నారు.
ఇక క్రీడావసరాలకే..
క్రీడాకారులకు ఉపయోగపడాల్సిన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సభలకు కేంద్రంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మొత్తం రాజకీయ, ప్రభుత్వ సభలు నిర్వహించారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు కూడా ఇక్కడే జరిపేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. స్టేడియాన్ని పూర్తిగా క్రీడావసరాలకు మాత్రమే ఉపయోగించాలని పలువురు క్రీడాభిమానులు ప్రభుత్వానికి లేఖలు రాశారు. దీంతో ఐజీఎంఎస్‌లో కార్యక్రమాల నిర్వహణ తగ్గిపోయింది. స్టేడియం ప్రాంగణం చిన్నచిన్న రాళ్లతో కనిపించేది. మూడు రోజుల క్రితం నిర్వహించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆటల పోటీల కారణంగా ప్రాంగణాన్ని మొత్తం క్రీడలకు ఉపయోగపడేలా మార్పు చేశారు.