Share News

19 నుంచి వసంత నవరాత్రులు

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:34 AM

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు చైత్రమాస వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శీనానాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

19 నుంచి వసంత నవరాత్రులు

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఏర్పాట్లు

పలు రకాల పుష్పాలతో అమ్మవారికి అర్చన

19న ఉగాది, 27న శ్రీరామనవమి సంబరాలు

ఇంద్రకీలాద్రి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు చైత్రమాస వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శీనానాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, అదేరోజు ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం జరుగుతాయని, 27న శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 19వ తేదీ వేకువజామున 3 గంటలకు అమ్మవారికి స్నపన, పూజాధికాలు పూర్తయ్యాక ఉదయం 8 నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 9.15 గంటలకు ప్రత్యేక పుష్పార్చనకు శ్రీకారం చుడతారు. 3 గంటలకు పంచాంగ శ్రవణం, సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున మహామంపడం నుంచి వెండి రథోత్సవం జరుగుతాయి. 26వ తేదీ చైత్రశుద్ధ అష్టమిని పురస్కరించుకుని ఘాట్‌రోడ్డులోని ఆలయంలోంజనేయస్వామికి, ప్రధాన ఆలయంలోని క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ చేస్తారు. 27వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10 గంటలకు సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. 28వ తేదీ ఉదయం 9 గంటలకు వసంత నవరాత్రులను పూర్ణాహుతితో ముగిస్తారు. అదేరోజు 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. వసంత నవరాత్రుల్లో రోజూ వివిధ రకాల పూలతో అమ్మవారిని అర్చిస్తారు. పుష్పార్చనలో పాల్గొనేవారు రూ.2,500 రుసుము చెల్లించాలని ఈవో ఆ ప్రకటనలో వివరించారు.

Updated Date - Mar 10 , 2026 | 12:34 AM