Share News

సాగరతీరాన రిసార్ట్స్‌

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:57 AM

కృష్ణాజిల్లాలో సాగరతీరానికి సమీపంలో రెండు భారీ రిసార్ట్స్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదిరింది. రూ.158 కోట్లతో బే వ్యూ రిసార్ట్స్‌ను ఏర్పాటు చేయటానికి ‘మైరా’ గ్రూప్‌ ముందుకొచ్చింది.

సాగరతీరాన రిసార్ట్స్‌

కృష్ణాజిల్లాలో బీచ్‌ టూరిజం అభివృద్ధికి చర్యలు

రాష్ట్ర ప్రభుత్వంతో మైరా, రాడిసన్‌ ఎంవోయూ

రూ.158 కోట్లతో రిసార్ట్స్‌ ఏర్పాటుకు మైరా రెడీ

రూ.30 కోట్లతో గోల్డ్‌ శాండ్‌ బీచ్‌ రిసార్ట్స్‌కు రాడిసన్‌ ఆసక్తి

ఇప్పటికే బాపట్లలో పనులు మొదలు.. త్వరలో కృష్ణాలో..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కృష్ణాజిల్లాలో సాగరతీరానికి సమీపంలో రెండు భారీ రిసార్ట్స్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదిరింది. రూ.158 కోట్లతో బే వ్యూ రిసార్ట్స్‌ను ఏర్పాటు చేయటానికి ‘మైరా’ గ్రూప్‌ ముందుకొచ్చింది. మొత్తం 150 గదులతో, 1,650 సీటింగ్‌ సామర్థ్యం కలిగిన కన్వెన్షన్‌తో కూడిన బే వ్యూ రిసార్ట్స్‌ను ఏర్పాటు చేయటానికి ఈ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వటంతో శంకుస్థాపనకు మార్గం ఏర్పడింది. ఈనెల చివరి వారంలో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే, సాగరతీరం వెంబడి గోల్డ్‌ శాండ్‌ బీచెస్‌ రిసార్ట్స్‌ ఏర్పాటు చేయటానికి ప్రముఖ రాడిసన్‌ గ్రూపు ముందుకొచ్చింది. బాపట్ల బీచ్‌తో పాటు కృష్ణాజిల్లాలోనూ రూ.30 కోట్లతో బీచ్‌ రిసార్ట్స్‌ను అభివృద్ధి చేయనుంది. మొత్తం 147 గదులు, 1,800 సీటింగ్‌ సామర్థ్యం కలిగిన కన్వెన్షన్‌ సెంటర్‌తో కూడిన బీచ్‌ రిసార్ట్స్‌ను అభివృద్ధి పరచనుంది.

అద్భుత సాగరతీరాలెన్నో..

కృష్ణాజిల్లాలో సువిశాల సాగరతీరంలో సుందరమైన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌తో పాటు కృత్తివెన్ను మండలంలోని చిన్నగొల్లపాలెం, పెద్దగొల్లపాలెం, బందరు మండలంలో పెదపట్నం బీచ్‌లు ఉన్నాయి. ఈ మూడు బీచ్‌లు కూడా ఎన్‌హెచ్‌-216 వెంబడి ఉన్నాయి. ఈ బీచ్‌లకు వెళ్లడానికి తగిన రోడ్డు మార్గాలు లేవు. ఎన్‌హెచ్‌-216 నుంచి ఈ బీచ్‌లకు ఆర్వోబీల ద్వారా మార్గాలను ఏర్పాటు చేసుకుంటే గోవాను తలదన్నే ప్రకృతి సౌందర్యాన్ని చూడొచ్చు. నాగాయలంకలో నవలంక అనే ఇసుక దీవి ఉంది. ఇక్కడకు కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీటికి మార్గాలను ఏర్పాటు చేయగలిగితే అనేక సంస్థలు బే హోటల్స్‌ ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశం ఉంది.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో మూడు ఎంవోయూలు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మూడు ఎంవోయూలు జరిగాయి. రూ.174.82 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు మూడు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. వీసీ న్యూట్రిఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిట్‌ సంస్థ రూ.100 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చి ఎంవోయూ చేసుకుంది. మల్లవల్లిలో 30 ఎకరాలు కేటాయించాలని కోరింది. ఈ సంస్థ నుంచి ప్రభుత్వానికి ఇంకా డీపీఆర్‌ రావాల్సి ఉంది. ఈ సంస్థ మొత్తం 4 వేల మందికి ఉద్యోగాలను కల్పిస్తానని ఎంవోయూలో పేర్కొంది. రూ.49.82 కోట్లతో విశ్వశ్రీ ప్రొటీన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఈ కంపెనీ నుంచి ప్రభుత్వానికి డీపీఆర్‌ వచ్చింది. అనుమతుల దశలో ఉంది. మొత్తం 250 ఉద్యోగాలను కల్పిస్తామని ఈ సంస్థ ఎంవోయూలో పేర్కొంది. రూ.25 కోట్లతో వేపూరి ఆగ్రో ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 100 మందికి ఉద్యోగాలను కల్పిస్తామని ఎంవోయూ చేసుకుంది. డీపీఆర్‌ను సమర్పించగా, ల్యాండ్‌సేల్‌ అగ్రిమెంట్‌ కూడా పూర్తయింది. అనుమతుల దశలో ఉంది.

Updated Date - Feb 17 , 2026 | 12:57 AM