Share News

ఇక్కడి ఇసుక అక్కడికి..

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:43 AM

మన రాష్ట్రం నుంచి అక్రమంగా వెళ్తున్న ఇసుక లారీలు తెలంగాణాలో పట్టుబడుతున్నాయి. అక్కడి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌, పోలీసులు, రవాణా, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. మన రాష్ట్రం నుంచి తెలంగాణాకు ఇసుక అక్రమంగా తరలివెళ్తుంటే, మన పోలీసులు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌, మైనింగ్‌, రవాణా, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

ఇక్కడి ఇసుక అక్కడికి..
తెలంగాణ పోలీసులు పట్టుకున్న ఏపీ ఇసుక వాహనాలు

సరిహద్దు దాటి తెలంగాణ చేరుతున్న ఇసుక

అక్కడి పోలీసులకు పట్టుబడుతున్న వాహనాలు

మన రాష్ట్రంలో నిద్రపోతున్న అధికార యంత్రాంగం

యథేచ్ఛగా సరిహద్దులు దాటిస్తున్న అక్రమార్కులు

(ఆంధ్రజ్యోతి-కంచికచర్ల) : ఉచిత ఇసుక విధానం వల్ల జిల్లాలో ఇసుక కొరత లేకుండాపోయింది. పెద్దగా గిరాకీ కూడా లేదు. తక్కువ ధరకు ఇసుక అందుతోంది. కానీ, తెలంగాణ జిల్లాల్లో ఇసుక తేలిగ్గా దొరకట్లేదు. ధర ఎక్కువైనా నాణ్యమైనది దొరకడం గగనమే. మన జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలకు సరిహద్దులుగా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఇందిరమ్మ పక్కా గృహాల నిర్మాణాలు జరుగుతుండటం, ఖమ్మంలో రోడ్ల అభివృద్ధి, ఇతర భారీ కట్టడాల నిర్మాణాల వల్ల అక్కడ ఇసుకకు డిమాండ్‌ ఏర్పడింది.

అక్రమంగా తరలింపు

నందిగామ డివిజన్‌ పరిధిలో మునేరు, కట్లేరు, వైరాయేరు, పాలేరుతో పాటు కృష్ణానది ఉండటంతో ఇసుక పుష్కలంగా దొరుకుతోంది. అధికారిక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లు ఉన్నప్పటికీ ఇసుక విక్రయాలు పెద్దగా జరగట్లేదు. మన రాష్ట్రంలో ఉచిత విధానం వల్ల కొరత లేకపోవడం, మరోవైపు ప్రజల నుంచి ఫిర్యాదులు రాకపోవడంతో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఇసుకపై దృష్టి పెట్టట్లేదు. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. యంత్రాలతో మునేటిని కొల్లగొడుతున్నారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, కంచికచర్ల మండలాల్లో పలుచోట్ల రాత్రిళ్లు మునేటి నుంచి ఇసుక తవ్వి సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక దందా సాగుతున్నప్పటికీ అడపదడపా పోలీసులు తప్ప మిగతా ప్రభుత్వ శాఖల అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు కూడా లేవు. అధికారుల దాడుల్లేవు. దీంతో అక్రమార్కులు వణుకు బెణుకు లేకుండా నిర్భయంగా ఇసుక వాహనాలను తెలంగాణాకు తరలిస్తున్నారు.

తెలంగాణాలో ఆంధ్ర వాహనాలు సీజ్‌

రెండు రోజుల క్రితం తెలంగాణా పోలీసులు, ఇతర శాఖల అధికారులు ఇసుక అక్రమ వాహనాలపై కొరడా ఝలిపించారు. కంచికచర్ల మండలం నుంచి ఇసుక తరలిస్తున్న ఏపీ 39 డబ్ల్యూజీ 5777, ఏపీ 39 డబ్ల్యూఎఫ్‌ 1888 నెంబర్లు కలిగిన రెండు లారీలను తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామం వద్ద తల్లాడ పోలీసులు పట్టుకుని సీజ్‌ చేశారు. వేంసూరు మండలం వెంకటాపురం వద్ద ఏపీ 39 డబ్ల్యూపీ 2998 నెంబరు కలిగిన టిప్పరును సత్తుపల్లి ఎంవీఐ పోలీసులు పట్టుకున్నారు. జగ్గయ్యపేట ప్రాంతం మల్కాపురం నుంచి తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను బాణాపురం వద్ద ముదిగొండ పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి ప్రాంతానికి అక్రమంగా తరలిస్తుండగా, గంగారం సెంటర్‌ చెక్‌పోస్టు వద్ద టిప్పర్‌, ట్రాక్టర్‌ను సత్తుపల్లి పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ఇసుక వాహనాలను సీజ్‌ చేయటమే కాకుండా, యజమానులు, డ్రైవర్లు, బ్రోకర్లపై కూడా తెలంగాణా పోలీసులు కేసులు నమోదు చేయటం గమనార్హం.

Updated Date - Feb 20 , 2026 | 12:43 AM