Share News

పండుగ ఆనందం..అంతలోనే విషాదం

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:02 AM

రెప్పపాటులో పండుగ ఆనందం ఆవిరైంది. మితిమీరిన వేగంతో లారీ దూసుకొచ్చి ఢీకొనడంతో తల్లి మృతిచెందగా, తండ్రి, కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి.

పండుగ ఆనందం..అంతలోనే విషాదం
లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న నీరజ చేతి చిటికెన వేలు

ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం

తల్లి మృతి, తండ్రి, కుమార్తెకు తీవ్రగాయాలు

లారీడ్రైవర్‌ అతివేగం.. స్కూటీని ఢీకొనడంతో ప్రమాదం

లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న కుమార్తె చిటికెన వేలు

మైలవరం/జి.కొండూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : రెప్పపాటులో పండుగ ఆనందం ఆవిరైంది. మితిమీరిన వేగంతో లారీ దూసుకొచ్చి ఢీకొనడంతో తల్లి మృతిచెందగా, తండ్రి, కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. కుమార్తె చిటికెన వేలు తెగి లారీ క్యాబిన్‌లో ఇరుక్కోవడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ముగ్గురూ రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో పడగా, కాళ్లు విరిగాయి. అజాగ్రత్తగా, అతివేగంగా లారీ నడపడమే కాకుండా, కారును ఓవర్‌టేక్‌ చేయబోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీడ్రైవర్‌ తప్పిదానికి ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. మైలవరం పట్టణానికి చెందిన మల్లెల వెంకట జమలేశ్వరరావు (బుల్లయ్య)కు ముగ్గురు కుమార్తెలు. సోడాల వ్యాపారం చేసి పెద్ద కుమార్తెకు నెల కిందటే పెళ్లి చేశారు. సంక్రాంతి పండక్కి పెద్ద కుమార్తె, అల్లుడు రాగా, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఇంటికి వచ్చారు. సకుటుంబ సమేతంగా సంక్రాంతి జరుపుకొన్నారు. ఆ తర్వాత పెద్ద కుమార్తె అత్తారింటికి, రెండో కుమార్తె హైదరాబాద్‌ వెళ్లిపోయారు. తల్లిదండ్రులతో మరోరోజు గడిపిన చిన్న కుమార్తె నీరజను హైదరాబాద్‌ పంపేందుకు బుల్లయ్య, తన భార్య నాగలక్ష్మితో కలిసి ముగ్గురూ స్కూటీపై ఇబ్రహీంపట్నంవైపు బయల్దేరారు. ఇబ్రహీంపట్నం-ఛత్తీస్‌గఢ్‌ 30వ నెంబరు జాతీయ రహదారిపై చెవుటూరు బైపాస్‌లోకి ప్రవేశించగానే, ఎదురుగా మైలవరంవైపు వస్తున్న లారీ ముందున్న కారును ఓవర్‌టేక్‌ చేస్తూ స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న బుల్లయ్య ఎగిరి రహదారి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. నీరజ చేతి చిటికిన వేలు తెగి లారీ క్యాబిన్‌లో ఇరుక్కుంది. నీరజ, నాగలక్ష్మి కాళ్లు విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ముగ్గుర్ని తొలుత విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించగా, నాగలక్ష్మి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 20 , 2026 | 01:02 AM