మ్యూల్‌కారకులెవరు?
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:05 AM
సైబర్ నేరాల్లో తరచూ మ్యూల్ ఖాతాలను సమకూరుస్తున్న ముఠా చిక్కుతున్నా.. అసలు నేరస్తులు ఎందుకు తప్పించుకుంటున్నారు..? మ్యూల్ నిందితులు అరెస్టయిన కొద్దిసేపటికే వారి ఫోన్లలోని డేటా ఎలా డిలీట్ అవుతోంది..? అసలు సైబర్ సూత్రధారులు తప్పించుకోడానికి కారణమేంటి? అనే పోలీసుల ప్రశ్నకు పుష్‌బుల్ యాప్ సమాధానం చెప్పింది. అసలు ఈ యాప్ ఏంటి? దీనిద్వారా సైబర్ సూత్రధారులు ఎలా తప్పించుకుంటున్నారు?.. అంటే..
సైబర్ నేరగాళ్ల సాంకేతిక ఎత్తుగడ పుష్‌బుల్
మ్యూల్ ఖాతాల కార్యకలాపాల కోసం ప్రత్యేక యాప్
ఏపీకే ద్వారా ఏజెంట్ల ఫోన్లలో ఇన్‌స్టాల్
ఏజెంట్ల కదలికలను ఆధీనంలోకి తీసుకుంటున్న నేరగాళ్లు
పోలీసులకు చిక్కినట్టు అనుమానం రాగానే డేటా డిలీట్
పోలీసులకు చిక్కుతున్న ఏజెంట్లు.. సూత్రధారులు పరార్
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : సైబర్ నేరం ఏదైనా సరే ఒకటి, రెండు దశల్లో నిందితులే పోలీసులకు చిక్కుతున్నారు. అసలు నేరగాళ్లు మాత్రం అజ్ఞాతంలో భద్రంగా ఉంటున్నారు. దీనికి కారణమే ‘పుష్‌బుల్’. సైబర్ నేరగాళ్లు.. పోలీసులకు చిక్కకుండా, తమ కింద ఉన్నవారు చిక్కినా వెంటనే తెలుసుకునేందుకు ఈ యాప్‌ను ఉయోగిస్తున్నారు. దీనిద్వారా తమ కింద ఎన్ని దశలు ఉన్నాయో వాళ్లందరి ఫోన్లను ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఏ దశలోఏం జరిగిందో వెంటనే తెలుసుకుని అప్రమత్తమవుతున్నారు.
ఇదీ నెట్‌వర్క్
సాధారణంగా సైబర్ నేరగాళ్లు ఎక్కువగా డిజిటల్ అరెస్టు, తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు వంటి వలలు విసురుతున్నారు. ఇందులో చిక్కుకున్న వారి నుంచి లక్షల రూపాయలను కాజేస్తున్నారు. ఈ డబ్బును జమ చేయించుకోవడానికి అవసరమైన బ్యాంకు ఖాతాలను ప్రత్యేక వ్యవస్థ ద్వారా తెరిపిస్తున్నారు. నిరుద్యోగ యువతకు కమీషన్ల ఆశను చూపించి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో గ్రూపులను తయారు చేస్తున్నారు. నలుగురైదుగురిని ఒక గ్రూపుగా నియమిస్తున్నారు. కూలీలు, కార్మికులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఖాతాలు తెరిపిస్తున్నారు. వారితో కరెంట్ ఖాతాలు తెరిపిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిమ్‌కార్డులను తీసుకుంటున్నారు. ఖాతా తెరిచాక దానికి సంబంధించిన ఏటీఎం కార్డు, పాస్‌బుక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను తీసుకుంటున్నారు. వాటిని ఈ గ్యాంగ్‌లు తమ వద్ద ఉంచుకుంటున్నాయి. సైబర్ ట్రాప్‌లో పడిన వారికి నేరగాళ్లు ఈ ఖాతాల నెంబర్లు ఇస్తున్నారు. అందులో బాధితులు డబ్బు జమ చేయగానే, మ్యూల్ బ్యాచ్ వద్ద సిమ్‌కార్డులకు సందేశాలు వెళ్తాయి. ఏ ఖాతాలో ఎంత జమ అయ్యిందో వెంటనే పై దశలో ఉన్న వారికి ఈ గ్రూపులు చెబుతాయి. ఇలా ఈ-సందేశాలు అసలు నేరగాళ్ల వద్దకు వెళ్తాయి. ఈ డబ్బును ఏయే ఖాతాలకు ఎంతెంత మళ్లించాలో సైబర్ నేరగాళ్లు ఆదేశాలు ఇస్తారు. ఆ విధంగా మ్యూల్ బ్యాచ్‌లు చేస్తాయి. ఇలా చేసినందుకు కొంతమందికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనంగా ఇస్తారు. మరికొంతమందికి జమ అయిన మొత్తాన్ని బట్టి కమీషన్లు అందజేస్తారు.
పుష్‌బుల్ యాప్ అంటే..
సైబర్ నేరగాళ్లు పుష్‌బుల్ వంటి యాప్‌లను ఏపీకే ఫైల్ రూపంలో మ్యూల్ బ్యాచ్‌కు చెందినవారి ఫోన్లకు వాట్సాప్‌లో పంపుతారు. ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోగానే, యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే మ్యూల్ గ్యాంగ్‌ల్లో ఉన్నవారి ఫోన్లన్నీ అసలు నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తాయి. ఈ బ్యాచ్ తాము చెప్పినట్టు చేస్తుందా, లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. చెప్పినట్టు ఇక్కడి నుంచి లావాదేవీలు జరిగాయా లేదా అన్నది తెలుసుకుంటారు. వారు ఆదేశాలు ఇచ్చినట్టుగా లావాదేవీలు జరగకపోయినా, ఆయా ఖాతాల్లో డబ్బు జమ కాకపోయినా, మ్యూల్ బ్యాచ్‌లో ఎవరైనా గంట, రెండు గంటలపాటు స్పందించకపోయినా ఈ యాప్ ద్వారా తెలుసుకుంటారు. ఈ సూచనలను బట్టి వారు పోలీసులకు చిక్కినట్టుగా భావిస్తారు. వెంటనే మ్యూల్ బ్యాచ్ వద్ద ఉన్న ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేస్తున్నారని సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. రెండు మ్యూల్ కేసుల్లో పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేసినప్పుడు ఈ విషయం బయటపడింది.